Sakshi News home page

బాబు గారి మాటలకు అర్థాలే వేరులే!

Published Tue, May 7 2024 6:35 PM

బాబు గారి మాటలకు అర్థాలే వేరులే!

సాక్షి ప్రతినిధి, కడప: ‘వినేవాడు లోకువైతే, చెప్పేవాడు చంద్రబాబు’అనే నానుడిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు టీడీపీ అధినేత. మొన్న రాజంపేట పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని ప్రకటించారు. నెల రోజుల క్రితం మదనపల్లె పర్యటనలో ఇక్కడి ప్రజల కోరిక మేరకు అన్ని హంగులున్న మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం రాయచోటి పర్యటనలో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కొనసాగిస్తామని ఎట్టి పరిస్థితుల్లో మార్చమని స్పష్టం చేశారు. పూటకో హామీ.. అవసరానికో అబద్ధం చెప్పడమే సిద్ధాంతంగా చంద్రబాబు పెట్టుకున్నారు. ఆయన ప్రసంగాలే అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

● అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి అడ్డదారైనా తొక్కుతారనే అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయాన్ని నిజం చేసి చూపించారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే అన్నమయ్య జిల్లాలోనే మూడు నియోజకవర్గాలను జిల్లా కేంద్రంగా కొనసాగించనున్నటు్‌ల్‌ హామీ ఇచ్చారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని తెలిపారు. ఏప్రిల్‌ 25న రాజంపేటలో పర్యటించిన సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చారు. మార్చి 27న మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తామని అక్కడ హామీ ఇచ్చారు. చంద్రబాబు వైఖరిలో తాత్కాలికంగా లబ్ధి పొందాలనే ఉద్దేశం మినహా, హామీల్లో చిత్తశుద్ధి లేదని ఇట్టే అర్థం అవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

బీజేపీతో పొత్తు పెట్టుకుంటూనే...

తెలుగుదేశం పార్టీ బీజేపీ, జనసేన పార్టీలతో ఎన్నికల పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగింది. కలివిడిగా సంసారం చేస్తున్న ఆ పార్టీ అధినేత ఎదుటి పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పుకురావడం మరోవింత.‘గురివింద గింజ తన కింద ఉన్న నలుపు ఎరుగనట్లు’ ప్రత్యక్షంగా బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకొని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని, బిల్లులు పాస్‌ అయ్యేందుకు సహకరిస్తున్నారని ఆరోపించడంపై నవ్విపోతున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటులో విడతల వారీగా మద్దతు ఇస్తామని బాహాటంగా ప్రకటించారు. బహిరంగంగా ఎన్నికల పొత్తు పెట్టుకున్న విషయాన్ని మరుగు పరుస్తూ ముస్లిం మైనార్టీలను మఽభ్యపెట్టేందుకు కూడా చంద్రబాబు వెనుకాడడం లేదని స్పష్టమవుతోంది.

కడపలో ప్రజాదరణ లేకపోవడంతో...

రాయచోటి సభ ముగించుకొని నిర్ణీత సమయానికే కడప చేరుకున్న చంద్రబాబు వెంటనే రోడ్‌షోకు బయలుదేరలేదు. ఆశించిన మేరకు జనసమీకరణ లేదని తెలుసుకొని సుమారు ఒకటిన్నర గంట కడప ఎయిర్‌పోర్టులో ఉండిపోయారు. ఆలస్యం కావడానికి కారణాలు ఆరాతీస్తే అసలు విషయం మరుగుపర్చి జిల్లా నాయకులతో మంతనాలు చేస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చుకోవడం విశేషం. చంద్రబాబు జిల్లా కేంద్రమైన కడపలో చేపట్టిన రోడ్‌షో సమయానికి ఎండవేడిమి లేకపోయినా ఆశించిన ప్రజాస్పందన కన్పించలేదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మిట్ట మధ్యాహ్నం కార్యక్రమం నిర్వహించినా జనం వేలాదిగా బారులు తీరుతున్నారు. పైగా కాలు కదపకుండా ఉండిపోతున్నారు, చంద్రబాబు అనేక హామీలు గుప్పించినా ప్రజలనుంచి ఆశించిన మద్దతు లభించలేదని టీడీపీ సీనియర్‌ నాయకుడొకరు వెల్లడించడం గమనార్హం.

అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన వైనం..

తన తప్పులను ఎదుటి వారికి అంటగట్టడంలో చంద్రబాబుకు మించినోళ్లు లేరని రాజకీయ పరిశీలకులు చెబుతుంటారు. అచ్చం అలాగే కడప గడపలో చంద్రబాబు చెప్పుకొచ్చారు. తన హయాంలో కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, యూజర్స్‌ చార్జీలు పెంచలేదని ప్రకటించుకున్నారు. అలాగే ఐదేళ్ల పాలనలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏమి చేశారో ప్రజలకు చెప్పలేకున్నారని పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి సిద్ధం సభల నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతి సమావేశంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం వివరిస్తున్నారు. తన హయాంలో మేలు జరిగి ఉంటేనే ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారు. అలాంటి దమ్ము, ధైర్యం లేకపోగా పచ్చి అబద్ధాలు వల్లించడమే ధ్యేయంగా చంద్రబాబు ప్రసంగం సాగిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

మొన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామన్న చంద్రబాబు

నేడు రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని ప్రకటన

నెల రోజుల క్రితం మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తామంటూ హామీ

పూటకో హామీ.. అవసరానికో అబద్ధం.. ఇదే చంద్రబాబు సిద్ధాంతం

Advertisement

homepage_300x250