Sakshi News home page

జొకోవిచ్‌ జోరుగా...

Published Mon, Jan 22 2024 4:22 AM

Novak Djokovic into the quarters with an easy win - Sakshi

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో సీడెడ్‌ ప్లేయర్లు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), నాలుగో సీడ్‌ సిన్నెర్‌ (ఇటలీ), మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ సబలెంక (బెలారస్‌), నాలుగో సీడ్‌ కొకొ గాఫ్‌ (అమెరికా) క్వార్టర్స్‌ చేరారు. పురుషుల సింగిల్స్‌లో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ అతి సులువైన విజయంతో ముందంజ వేశాడు.

పది సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత అయిన జొకో 6–0, 6–0, 6–3తో అడ్రియన్‌ మనారినొ (ఫ్రాన్స్‌)ను చిత్తు చేశాడు. ఏకంగా 17 ఏస్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన సెర్బియన్‌ దిగ్గజం 31 విన్నర్లతో అలవోకగా మ్యాచ్‌ని చేతుల్లోకి తెచ్చుకున్నాడు. తొలి రెండు సెట్లలో అయితే ఫ్రాన్స్‌ ఆటగాడిని ఖాతా తెరువకుండా చేశాడు. ప్రత్యర్థి సర్వి స్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేశాడు.

కేవలం గంటా 44 నిమిషాల్లోనే వరుస సెట్లలో ప్రత్యర్థి ఆట కట్టించాడు. తాజా ఫలితంతో  గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నల్లో 58 సార్లు క్వార్టర్స్‌ ఫైనల్‌ చేరిన ఆటగాడిగా స్విట్టర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ సరసన   సెర్బియన్‌ సూపర్‌స్టార్‌ నిలిచాడు. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లోనే 14 సార్లు క్వార్టర్స్‌ చేరిన జొకోవిచ్‌ 10 సార్లు ముందంజ వేసి టైటిల్‌ గెలువగలిగాడు. 

సిట్సిపాస్‌ అవుట్‌ 
నిరుటి రన్నరప్, ఏడో సీడ్‌ స్టెఫనొస్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)కు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. గత మూడేళ్లలో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో అతనికి ఇదే నిరాశాజనక ప్రదర్శన. ఆదివారం జరిగిన పోరులో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సిట్సిపాస్‌ 6–7 (3/7), 7–5, 3–6, 3–6తో అమెరికాకు చెందిన 12వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ చేతిలో కంగుతిన్నాడు.

ఈ విజయంతో అమెరికా ఆటగాడు తొలిసారి ఆ్రస్టేలియా ఓపెన్‌లో నాలుగో రౌండ్‌ అడ్డంకిని దాటి క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు.  మిగతా మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా)కు స్థానిక ప్లేయర్‌ నుంచి అసాధారణ పోటీ ఎదురైంది. సుదీర్ఘంగా 4 గంటల 14 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో రుబ్లెవ్‌ 6–4, 6–7 (5/7), 6–7 (4/7), 6–3, 6–0తో పదో సీడ్‌ అలెక్స్‌ డి మినార్‌ (ఆ్రస్టేలియా)పై చెమటోడ్చి నెగ్గాడు.

దీంతో స్థానిక ఆటగాడు వరుసగా మూడో ఏడాదీ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టాడు. నాలుగో సీడ్‌ జానిక్‌ సిన్నెర్‌ (ఇటలీ) 6–4, 7–5, 6–3తో గత సీజన్‌ సెమీఫైనలిస్ట్, 15వ సీడ్‌ కరెన్‌ కచనొవ్‌ (రష్యా)కు షాకిచ్చాడు. 

కొకొ గాఫ్‌ తొలిసారి... 
మహిళల సింగిల్స్‌లో యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్, నాలుగో సీడ్‌ అమెరికన్‌ స్టార్‌ కొకొ గాఫ్‌ తొలిసారి ఈ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలో క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. నాలుగేళ్లుగా బరిలోకి దిగుతున్న ఆమెకు రెండు సార్లు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది.

కానీ ఈ సారి ఆమె 6–1, 6–2తో మగ్దలెన ఫ్రెచ్‌ (పోలాండ్‌)పై సునాయాస విజయంతో ముందంజ వేసింది. కేవలం గంట 3 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం. రెండో సీడ్‌ అరిన సబలెంక (బెలారస్‌) 6–3, 6–2తో అమండ అనిసిమొవ (అమెరికా)పై గెలుపొందగా, 9వ సీడ్‌ క్రెజ్‌సికొవా (చెక్‌ రిపబ్లిక్‌) 4–6, 6–3, 6–2తో మిర అండ్రీవా (రష్యా)పై విజయం సాధించింది. 

Advertisement

homepage_300x250