Sakshi News home page

adsolute video ad after first para

#Pat Cummins: శెభాష్‌.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్‌ అన్నతో అట్లుంటది మరి..

Published Tue, Apr 16 2024 2:50 PM

IPL 2024 SRH vs RCB Fans Lauds Pat Cummins Captaincy Record Score Win - Sakshi

SRH Fans Hails Pat Cummins Captaincy: ఐపీఎల్‌లో గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న  జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. ఐపీఎల్‌-2023లో పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పట్టికలో అట్టడుగున పదోస్థానంలో నిలిచింది.

ఫలితంగా ఇక ఈ జట్టు ఇంతే! ఊరించి ఉసూరుమనిపించడం.. గెలుస్తారనుకున్న మ్యాచ్లో కూడా ఓడిపోవడం.. అనే విమర్శలు ఎదుర్కొంది. సరైన కెప్టెన్‌, ఓపెనింగ్‌ జోడీ లేకపోవడం.. డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేసే ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ విఫలం కావడం వంటివి తీవ్ర ప్రభావం చూపాయి.

భారీ ధరకు కొనుక్కున్న హ్యారీ బ్రూక్‌ రాణించకపోవడం.. హెన్రిచ్‌ క్లాసెన్‌తో పాటు గ్లెన్‌ ఫిలిప్స్‌ను బరిలోకి దింపినా అప్పటికే ఆలస్యం కావడం గతేడాది ఎస్‌ఆర్‌హెచ్‌ కొంపముంచింది. అయితే, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని.. లోపాలు సరిచేసుకుని ముందు సాగడం కూడా సన్‌రైజర్స్‌కు చేతకాదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

వన్డే వరల్డ్‌కప్‌-2023 విన్నింగ్‌ కెప్టెన్‌ కోసం 20 ‍కోట్లు
కానీ.. సన్‌రైజర్స్‌ యాజమాన్యం వ్యూహాత్మంగా అడుగులు వేసింది. ఐపీఎల్‌-2024 వేలంలో భాగంగా వన్డే వరల్డ్‌కప్‌-2023 విజేత ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. అతడి కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు వెచ్చించింది.

అదే విధంగా వరల్డ్‌కప్‌ హీరో ట్రావిస్‌ హెడ్‌ను కూడా రూ. 6.80 కోట్లు పెట్టి కొనుక్కుంది. అయితే.. టీ20లలో అంతగా అనుభవం లేని కమిన్స్‌ను కెప్టెన్‌ చేయడం సన్‌రైజర్స్‌ పొరపాటేనని మరోసారి విమర్శలు వచ్చాయి. అతడి కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అనే పెదవి విరుపులు కూడా!

నమ్మకం నిలబెట్టుకుంటున్న కమిన్స్‌
కానీ మేనేజ్‌మెంట్‌ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడుపుతున్నాడు కమిన్స్‌. అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, మార్క్రమ్‌ వంటి హిట్టర్లకు తోడు నితీశ్‌ కుమార్‌రెడ్డి, అబ్దుల్‌ సమద్‌ సేవలను సరైన సమయంలో సరిగ్గా ఉపయోగించుకుంటూ ఫలితాలు రాబడుతున్నాడు.

ఇక బౌలింగ్‌ విభాగంలో ఈ స్టార్‌ పేసర్‌ తనతో పాటు భువీ, నటరాజన్‌, జయదేవ్‌ ఉనాద్కట్‌లతో పాటు స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండేను కూడా అవసరమైన సమయంలో రంగంలోకి దించుతున్నాడు. 

మాస్టర్‌ మైండ్‌
ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్‌లో పిచ్‌ను సరిగ్గా రీడ్‌ చేసిన కమిన్స్‌ వన్‌డౌన్‌లో క్లాసెన్‌ను దింపి ఫలితం రాబట్టాడు. అందుకు తగ్గట్లే క్లాసెన్‌(31 బంతుల్లో 67) ట్రావిస్‌ హెడ్‌(41 బంతుల్లో 102)కు సహకారం అందిస్తూనే.. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన్నపుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు.

ఆఖర్లో మార్క్రమ్‌(17 బంతుల్లో 32), అబ్దుల్‌ సమద్‌(10 బంతుల్లో 37) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచి ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించడంలో తమ వంతు పాత్ర పోషించారు.

ఇక ఆర్సీబీ లక్ష్య ఛేదనలో ఆరంభంలో దూకుడుగా ఆడినా ప్యాట్‌ కమిన్స్‌ ముఖంపై నవ్వులు పూశాయే గానీ.. అతడు ఏమాత్రం తడబడలేదు. ముందుగా పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మ చేతికి బంతినిచ్చాడు. ఐదో బంతికే క్యాచ్‌ డ్రాప్‌ చేయడంతో కోహ్లికి లైఫ్‌ లభించగా అతడు దూకుడు మరింత పెంచాడు.

ఆ తర్వాత భువీని రంగంలోకి దింపాడు. అనంతరం మళ్లీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ అహ్మద్‌..నటరాజన్‌ ఇలా ఒక్కో ఓవర్‌కు వైవిధ్యం చూపించాడు. పిచ్‌ పరిస్థితిని అంచనా వేస్తూ మరో స్పిన్నర్‌ మయాంక్‌తో బౌలింగ్‌ చేయించి ఫలితం రాబట్టాడు.

ఆర్సీబీని దెబ్బకొట్టడంలో సఫలం
మయాంక్‌ మార్కండే కోహ్లి(42) బౌల్డ్‌ కావడంతో అప్పటిదాకా ఆర్సీబీ విజయంపై ఆశలు పెట్టుకున్న అభిమానులు ఒక్కసారిగా నీరుగారిపోయారు. అయితే, కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌(28 బంతుల్లో 62), దినేశ్‌ కార్తిక్‌(35 బంతుల్లో 83) ఇన్నింగ్స్‌ నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

తన వ్యూహాలను పక్కాగా అమలు చేసిన ప్యాట్‌ కమిన్స్‌ మూడు వికెట్లు తీయడంతో పాటు కెప్టెన్‌గానూ తానేంటో మరోసారి నిరూపించాడు. మిస్టర్‌ కూల్‌ ధోనిలా కూల్‌గా డీల్‌ చేస్తూ సన్‌రైజర్స్‌ను 25 పరుగుల తేడాతో గెలిపించాడు.

తద్వారా రైజర్స్‌ ఖాతాలో నాలుగో(ఆరింట) విజయం చేరింది. ఇక కమిన్స్‌ చేరిక జట్టుకు నష్టం చేకూరుస్తుందే తప్ప లాభం ఉండదన్న విమర్శకులకు అద్బుత నైపుణ్యాలతో సమాధానమిస్తున్న ఈ పేస్‌ బౌలర్‌..  తొలుత ప్లే ఆఫ్స్‌నకు గురిపెట్టాడు. 

అంతా సవ్యంగా సాగితే ఈసారి ఫైనల్లోనూ రైజర్స్‌ను చూస్తామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌. డేవిడ్‌ వార్నర్‌ తర్వాత తమకు దొరికిన మరో ఆణిముత్యం కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ అంటూ కొనియాడుతున్నారు. విశ్లేషకులు సైతం కమిన్స్‌ కెప్టెన్సీకి మంచి మార్కులే వేస్తున్నారు. పనిలో పనిగా రిస్క్‌ తీసుకున్నా సరే అనుకున్న ఫలితాలు వస్తున్నాయి అంటూ సన్‌రైజర్స్‌ ఓనర్‌ కావ్యా మారన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్‌, అగార్కర్‌ చర్చలు.. హార్దిక్‌ పాండ్యాకు నో ఛాన్స్‌!

Advertisement

adsolute_video_ad

homepage_300x250