Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

IPL 2024: అరెరె.. మీరెందుకిలా అంటున్నార్సార్‌?!

Published Tue, Apr 23 2024 6:13 PM

IPL 2024 Fans Trolls Sunil Gavaskar Warning Avoid High Scores - Sakshi

గుజరాత్‌ టైటాన్స్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌.. లక్నో సూపర్‌ జెయింట్స్‌.. ముంబై ఇండియన్స్‌.. ఐపీఎల్‌-2023లో ప్లే ఆఫ్స్‌ చేరిన జట్లు.. వీటిలో గుజరాత్‌- చెన్నై మధ్య టైటిల్‌ పోరు జరుగగా సూపర్‌ కింగ్స్‌ చాంపియన్‌గా అవతరించింది.

ఇక పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అట్టడుగున నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌(9), పంజాబ్‌ కింగ్స్‌(8), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(7) కింద నుంచి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రాజస్తాన్‌ రాయల్స్‌, ఆర్సీబీ మెరుగైన ప్రదర్శనతో వరుసగా ఐదు, ఆరో స్థానంలో నిలిచాయి. 2023 పూర్తైన తర్వాత పాయింట్ల పట్టిక స్వరూపం ఇది.

ఇక ఇప్పుడు ఐపీఎల్‌-2024లో సగానికి పైగా మ్యాచ్‌లు అయిపోయాయి. గతేడాది పట్టికతో తాజా సీజన్‌ను టేబుల్‌ను పోలిస్తే టాప్‌-5 జట్లలో పూర్తి వ్యత్యాసం కనిపిస్తోంది.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఎనిమిదింట ఏడు విజయాలతో నంబర్‌ వన్‌లో ఉండగా.. గతేడాది నామమాత్రపు ప్రదర్శనకు పరిమితమైన కోల్‌కతా, చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న సన్‌రైజర్స్‌ ముందుకు దూసుకువచ్చాయి.

కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన ఏడింట ఐదు విజయాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై ఏడింట నాలుగు విజయాలతో టాప్‌-4లో కొనసాగుతోంది. లక్నో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది.

అయితే, ఆర్సీబీ, ముంబై మాత్రం చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాయి. కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో ముంబై ఎనిమిదింట కేవలం మూడుసార్లు గెలవగా..ఫాఫ్‌ డుప్లెసిస్‌ బృందం ఆర్సీబీ ఎనిమిదింట ఒక్కటి మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్‌ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.

అయితే..ఈసారి ధనాధన్‌ బ్యాటింగ్‌తో దుమ్ములేపుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. సన్‌రైజర్స్‌. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించడంతో పాటు మూడుసార్లు 250కి పైగా స్కోర్లు సాధించి సత్తా చాటింది. కేకేఆర్‌, ఆర్సీబీ సైతం ఈ మార్కును టచ్‌ చేశాయి.

ఈ నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ వంటి దిగ్గజాలు.. ప్రతిసారి హిట్టింగ్‌ చేస్తే ఐపీఎల్‌ బోర్‌ కొట్టడం ఖాయమంటూ వ్యాఖ్యానించడం కొంతమంది అభిమానులకు మింగుడుపడటం లేదు. ముంబై, ఆర్సీబీ, సీఎస్‌కే వంటి జట్లు పరుగుల వరద పారిస్తే మురిసిపోయే మాజీ క్రికెటర్లు ఈసారి వేరే జట్లు హిట్టింగ్‌ ఆడితే చూసి ఓర్వలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈసారి టేబుల్‌ తలకిందులయ్యేట్లుగా కనిపిస్తునందువల్లే బోర్‌ కొడుతుందంటూ ఇన్‌ఫ్ల్యూయెన్స్‌ చేసేలా కామెంట్లు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈసారి ఇప్పటికైతే ప్లే ఆఫ్స్‌ రేసులో రాజస్తాన్‌, కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, చెన్నై ముందు వరుసలో ఉండగా.. లక్నో, గుజరాత్‌ సైతం పోటీనిచ్చే అవకాశం ఉంది. సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి ఈ జట్లు టాప్‌-6లో ఉండగా.. ముంబై, ఢిల్లీ, పంజాబ్‌, ఆర్సీబీ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానంలో నిలిచాయి.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250