Sakshi News home page

adsolute video ad after first para

SRH: ‘బాధితులు’ కూడా అసూయ పడేలా.. కమిన్స్‌ ఏమన్నాడో తెలుసా?

Published Tue, Apr 16 2024 4:19 PM

IPL 2024 SRH Most Sixes By A Team Cummins Says I Wish I Was A Batter - Sakshi

(43 X 4) + (38 X 6).. మొత్తం 81.. ఇదేంటి లెక్క తప్పు చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదండీ.. ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌లో నమోదైన ఫోర్లు, సిక్సర్లూనూ!!

చిన్నస్వామి స్టేడియం బౌండరీ చిన్నదే కావొచ్చు.. అయినా.. ఇలా బ్యాట్‌ తాకించగానే అలా బంతి అవతల పడదు కదా.. ఫోర్స్‌గా కొడితేనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంది. అలా తమ పవర్‌ హిట్టింగ్‌తో ప్రేక్షకులకు కనువిందు చేశారు ఇరు జట్ల బ్యాటర్లు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ జట్టులో అభిషేక్‌ శర్మ 2, ట్రావిస్‌ హెడ్‌ 8, హెన్రిచ్‌ క్లాసెన్‌ 7, ఐడెన్‌ మార్క్రమ్‌ 2, అబ్దుల్‌ సమద్‌ 3 సిక్స్‌లు బాదారు.

ఇలా ఓవరాల్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌ ఖాతాలో 22 సిక్సర్లు నమోదు కాగా.. ఐపీఎల్‌ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా రికార్డులకెక్కింది. మరోవైపు.. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి రెండు, ఫాఫ్‌ డుప్లెసిస్‌ 4, దినేశ్‌ కార్తిక్‌ 7, మహిపాల్‌ లామ్రోర్‌ రెండు సిక్స్‌లు బాదారు. 

తడిసి ముద్దైన చిన్నస్వామి స్టేడియం
మ్యాచ్‌ ఆద్యంతం ఇలా సిక్సర్ల వర్షంలో చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దవుతుంటే టీ20 ప్రేమికులంతా కేరింతలు కొట్టారు. న భూతో న భవిష్యతి అన్నట్లుగా బ్యాటర్లు హిట్టింగ్‌ చేస్తుంటే ఇది కదా పొట్టి ఫార్మాట్‌ మజా అనుకుంటూ మురిసిపోయారు.

బ్యాటర్‌ను అయినా బాగుండు
ఫలితం ఎలా ఉన్నా మంచినీళ్ల ప్రాయంలా సన్‌రైజర్స్‌- ఆర్సీబీ బ్యాటర్లు చితక్కొట్టిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో బాధితులుగా మిగిలిపోయిన బౌలర్లు కూడా తాము కూడా అప్పటికప్పుడు బ్యాటర్‌ అయి పోయి ఉంటే బాగుండు అనుకునేంతగా అసూయ పడేలా చేశారు. విజయానంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌, మూడు వికెట్లు తీసిన పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘నేను బ్యాటర్‌ను అయినా బాగుండు. సూపర్‌ మ్యాచ్‌.

అద్భుతమైన దృశ్యాలు. అంతకు మించిన వినోదం. చిన్నస్వామి స్టేడియం పిచ్‌ ఈరోజు పొడిగా ఉంది. దానిని మేము చక్కగా సద్వినియోగం చేసుకోగలిగాం’’ అని కమిన్స్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ సృష్టించిన అరుదైన రికార్డులు
►ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు- 22
►టీ20 క్రికెట్‌లో నేపాల్‌(314) తర్వాత రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు(287).
►ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు- 287/3.

సన్‌రైజర్స్‌ వర్సెస్‌ ఆర్సీబీ స్కోర్లు:
►టాస్‌: ఆర్సీబీ.. బౌలింగ్‌
►సన్‌రైజర్స్‌ స్కోరు: 287/3 (20)
►ఆర్సీబీ స్కోరు: 262/7 (20)
►ఫలితం: ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ విజయం

చదవండి: #RCBvsSRH: ఏంట్రా ఈ బ్యాటింగ్‌?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. వీడియో వైరల్‌

Advertisement

adsolute_video_ad

homepage_300x250