Sakshi News home page

adsolute video ad after first para

సన్నాలకు ఫుల్‌ డిమాండ్‌

Published Thu, Apr 18 2024 10:30 AM

కొనుగోలు చేసిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఉంచిన వ్యాపారులు   - Sakshi

క్వింటాల్‌కు రూ.2,500 చెల్లింపు

జోరుగా ప్రైవేట్‌ వ్యాపారుల కొనుగోలు

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

సన్న ధాన్యానికి బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ పలుకుతోంది. క్వింటాల్‌కు మద్దతు ధర రూ. 2,500 చొప్పున చెల్లించి వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ధర కంటే క్వింటాల్‌కు రూ. 297 అధికంగా రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

– మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 2.63 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందుకు గానూ 5.20 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తోందని అంచనా వేసిన అధికారులు 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే 2.3 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు కాగా 60 వేల ఎకరాల్లో సన్న రకం సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా దొడ్డు రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్‌కు మద్దతు ధర రూ. 2,203 చొప్పున చెల్లిస్తోంది. సన్నరకం సాగు చేసిన రైతుల నుంచి ప్రైవేట్‌ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్‌ ధాన్యానికి రూ.2,500 చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నాలకు క్వింటాల్‌కు రూ. 2,203 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో క్వింటాల్‌పై రైతుకు రూ.297 అదనంగా వస్తుండడంతో అన్నదాతలు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు సైతం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వ్యాపారులు పోటీపడి కొంటున్నారు.

ధర మరింత పెరిగే అవకాశం

ప్రస్తుతం వ్యాపారులు సన్నాలను క్వింటాల్‌ రూ. 2,500 చెల్లించి కొనుగోలు చేస్తుండగా 10 రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. గతేడాది వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 80 వేల ఎకరాలకు పైగా సన్నాలను సాగు చేశారు. ధాన్యం చేతికందిన మొదట్లో వ్యాపారులు క్వింటాల్‌కు రూ. 2,400 చొప్పున చెల్లించి రైతుల వద్ద కొనుగోలు చేశారు. అనంతరం మరో 15 రోజుల తర్వాత క్వింటాల్‌కు రూ. 2,800 చెల్లించారు. కేవలం రెండు వారాల వ్యవధిలో క్వింటాల్‌కు రూ.400 ధర పెరిగింది.

తగ్గనున్న ధాన్యం దిగుబడి

యాసంగి సీజన్‌లో 1.34 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తోందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వారి అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. రైతులు ఎక్కువగా బోరుబావుల ఆధారంగా వరి సాగు చేశారు. భూగర్భజలాలు అడిగంటిపోవడంతో చాలా వరకు బోర్లలో నీటి ఊటలు తగ్గి పంటలు ఎండిపోయాయి. దీంతో దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.

నాలుగెకరాల్లో సన్నాలు సాగు చేశా

నాలుగెకరాల్లో ఆర్‌ఎన్‌ఆర్‌ సన్న రకం వరి పంట సాగు చేశాను. సుమారు 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ. 2,500 చొప్పున విక్రయించాను. కొనుగోలు కేంద్రాల కంటే క్వింటాల్‌కు రూ. 297 అదనంగా లాభం వచ్చింది.

– బాబు, గవ్వలపల్లి తండా

1/1

Advertisement

adsolute_video_ad

homepage_300x250