Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

కంగ్రాట్స్‌.. నిర్మల!

Published Mon, Apr 15 2024 1:15 AM

- - Sakshi

ఆడపిల్లలకు రోల్‌ మోడల్‌

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన

కర్నూలు కల్చరల్‌/ఆదోని రూరల్‌: నిర్మల పోరాట యోధురాలుని, ఆ అమ్మాయి దృఢ సంకల్పం, పోరాట పటిమకు సెల్యూట్‌ అని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన ప్రశంసించారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన నిర్మల 10వ తరతగతిలో మంచి మార్కులు సాధించినప్పటికీ పేదరికంతో తల్లిదండ్రులు చదువు మాన్పించిన సందర్భంలో కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్మలను ఆస్పరి కేజేబీవీలో చేర్పించారు. ఆ విద్యార్థిని ఇంటర్మీడియట్‌ బైపీసీ గ్రూప్‌తో మొదటి సంవత్సరం పరీక్షల్లో 440 మార్కులకు 421 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆదివారం నిర్మలను క్యాంప్‌ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో బైపీసీ గ్రూప్‌లు ఉన్న 8 కేజీబీవీల్లో నిర్మల టాపర్‌గా నిలవడం అభినందనీయమన్నారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన హనుమంతమ్మ, శ్రీనివాస్‌ దంపతుల కుమార్తె నిర్మల గురించి నేడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారన్నారు. ఆడపిల్లలకు నిర్మల రోల్‌మోడల్‌, స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసించారు. ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ దృఢ సంకల్పంతో చదువుకోవాలన్న తన కోరికను నెరవేర్చుకొని ఉన్నత ఆశయంతో ముందుకు వెళుతోందన్నారు. విద్యతోనే సాధికారత లభిస్తుందని ఆడపిల్లలు చదువుకొని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. బేటీ బచావో బేటీ పడావో కింద నిర్మలకు ఇన్సెంటివ్‌ ఇవ్వాలని ఇంచార్జ్‌ ఐసీడీఎస్‌ పీడీని కలెక్టర్‌ ఆదేశించారు.

విద్యార్థిని ఖాతాలో ఇన్సెంటివ్‌ జమ చేయడం వల్ల ఇంటర్‌ తరువాత వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా పైచదువులు చదువుకోడానికి ఉపయోగ పడుతుందన్నారు. సమస్యలతో చదువుకోలేక మధ్యలో చదువు ఆపేసిన వారు ఇంకా ఎవరైనా ఉంటే స్పెషల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించి అలాంటి వారిని ఈ సంవత్సరం కేవీజీబీల్లో అడ్మిషన్‌ చేయించాలని ఆదేశించారు. నిర్మల సాధించిన ప్రగతి గురించి అందరికి తెలిసేలా సమావేశం నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నిర్మలను శాలువాతో సన్మానించి స్వీట్స్‌ అందజేశారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి జీవితంలో అనేక విజయాలు సాధించాలని సూచించారు.


బైపీసీలో 421 మార్కులు సాధించిన నిర్మలతో జిల్ల్లా కలెక్టర్‌ సృజన, ఇతర అధికారులు  

కలెక్టర్‌ చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను..
గ్రామంలో ఉన్న జడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదివి 537 మార్కులు సాధించానని, తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలతో చదువు వద్దని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని అయితే తనకు ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లానని నిర్మల తెలిపారు. ఈ విషయం ప్రతికల్లో ప్రచురితమై కలెక్టర్‌ దృష్టికి వెళ్లడం, కలెక్టర్‌ మేడం వెంటనే స్పందించి కేజీబీవీలో అడ్మిషన్‌ ఇప్పించారన్నారు.

 ఈరోజు ఇంటర్‌ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షల్లో కేజీబీవీల్లో టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాఽశాఖాధికారి శామ్యూల్‌, సమగ్ర శిక్ష ఏపీసీ విజయ జ్యోతి, ఇన్‌ఛార్జి ఐసీడీఎస్‌ పీడీ వెంకట లక్ష్మమ్మ, జీసీడీవో సునీత, కేజీబీవీ ఎస్‌ఓ శరన్‌స్మైలీ, ఆదోని ఎంఈఓ–2 శ్రీనివాసులు, విద్యార్థిని తల్లిదండ్రులు, బందువులు పాల్గొన్నారు.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250