Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

The Goat Life Man Real Life Story: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను

Published Sat, Mar 30 2024 6:04 AM

The Goat Life: Najeeb Muhammad real-life story - Sakshi

సౌదీలో రెండేళ్ల పాటు 700 గొర్రెలను ఒంటరిగా మేపాడు. మరో మనిషితో మాట్లాడలేదు. మరో మాట వినలేదు. ఇసుకతో స్నానం ఇసుకే దాహం ఇసుక తప్ప మరేం కనిపించని
ఒంటరితనం. బానిస బతుకు. కాని బతికి దేశం తిరిగి వచ్చాడు. 1995లో అతని జీవితం నవలగా వెలువడి మలయాళంలో సెన్సేషన్‌ సృష్టించింది. ప్రస్తుతం 138వ ప్రచురణకు వచ్చింది. అతని జీవితం ఆధారంగానే ‘గోట్‌ లైఫ్‌’ సినిమా తాజాగా విడుదలైంది. కేరళకు చెందిన నజీబ్‌ సంఘర్షణ ఇది.

కేరళలోని అలెప్పి దగ్గరి చిన్న ఊరికి చెందిన నజీబ్‌ కోరుకుంది ఒక్కటే. సౌదీకి వెళ్లి ఏదో ఒక పని చేసి కుటుంబానికి నాలుగు డబ్బులు పంపాలన్నదే. ఆ రోజుల్లో కేరళ నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి గల్ఫ్‌ దేశాలకు చాలామంది పని కోసం వలస వెళ్లేవారు. నజీబ్‌ కూడా సౌదీకి వెళ్లాలనుకున్నాడు. ఏజెంట్‌ అతనికి ఒక మాల్‌లో సేల్స్‌మ్యాన్‌గా పని ఉంటుందని పంపాడు. అలా నజీబ్‌ సౌదీలో అడుగు పెట్టాడు. అది 1993వ సంవత్సరం.

రెండు రోజుల తర్వాత
ఎయిర్‌పోర్ట్‌లో దిగాక నజీబ్‌ రెండు రోజుల పాటు ప్రయాణిస్తూనే ఉన్నాడు... అప్పుడు గాని అర్థం కాలేదు తాను మోసపోయానని. ఎడారి లోపల అతణ్ణి అరబ్‌ షేక్‌కు అప్పజె΄్పారు. ఆ షేక్‌ అక్కడే ఒక షెడ్డు వేసుకుని ఉండేవాడు. నజీబ్‌కు 700 గొర్రెలను కాచే పని అప్పజె΄్పాడు. వేరే బట్టలు ఇవ్వలేదు. స్నానానికి నీళ్లు ఇవ్వలేదు. బతకడానికి మాత్రం ముతక రొట్టెలు పడేసేవాడు. ఆ రొట్టెల్ని గొర్రెపాలలో తడిపి కొద్దిగా తినేవాడు నజీబ్‌. యజమాని, అతని తమ్ముడు ఈ ఇద్దరు మాత్రమే నజీబ్‌కు కనిపించేవారు. వారి అరబిక్‌ భాష తప్ప మరో భాష వినలేదు. మరో మనిషిని చూడలేదు. ‘నేను ఏడ్చినప్పుడల్లా వారు కొట్టేవారు’ అంటాడు నజీబ్‌.

భ్రాంతులు
నజీబ్‌కు ఎడారిలో ఉండి భ్రాంతులు మొదలయ్యాయి. అతడు గొర్రెల మధ్య ఉండి ఉండి తాను కూడా ఒక గొర్రెనేమో అనుకునేవాడు. రెండేళ్ల పాటు ఇలాగే జరిగింది. ఒకరోజు ఆ అన్నదమ్ములిద్దరూ పెళ్లి ఉందని వెళ్లారు. ఆ అదను కోసమే చూస్తున్న నజీబ్‌ ఎడారిలో పరిగెత్తడం మొదలుపెట్టాడు. దారి లేదు.. గమ్యమూ తెలియదు. పరిగెట్టడమే. ఒకటిన్నర రోజు తర్వాత మరో మలయాళి కనిపించి దారి చె΄్పాడు. అతడు కూడా తనలాంటి పరిస్థితిలో ఉన్నవాడే. చివరకు ఒక రోడ్డు కనిపించి రియాద్‌ చేరాడు. అక్కడి మలయాళీలు నజీబ్‌ను కాపాడారు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోతే తగిన పత్రాలు లేనందున 10 రోజులు జైల్లో పెట్టి ఇండియా పంపారు.

నవల సినిమాగా
నజీబ్‌ తిరిగి వచ్చాక కోలుకొని బెహ్రయిన్‌ వెళ్లాడు ఈసారి పనికి. అక్కడ పని చేస్తున్న రచయిత బెన్యమిన్‌కు నజీబ్‌తో పరిచయమైంది. నజీబ్‌ జీవితాన్ని బెన్యమిన్‌ నవలగా ‘ఆడు జీవితం’ (గొర్రె బతుకు) పేరుతో రాసి 2008లో వెలువరించాడు. అది సంచలనంగా మారింది. ఇప్పటికి వందకు పైగా ఎడిషన్స్‌ వచ్చాయి. 8 భాషల్లో అనువాదమైంది. ఆ నవల ్రపాశస్త్యం సినిమా రంగాన్ని ఆకర్షించింది. మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోగా ‘ఆడు జీవితం’ పేరుతో నటించి మొన్న మార్చి 28న విడుదల చేశాడు. తెలుగులో గోట్‌లైఫ్‌ పేరుతో అనువాదమైంది. వాస్తవిక సినిమాగా ఇప్పటికే గోట్‌లైఫ్‌ ప్రశంసలు పొందుతోంది.            

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250