Sakshi News home page

adsolute video ad after first para

చిన్నారులు బరువు పెరుగుతున్నారా? అయితే జాగ్రత్త!

Published Sun, Apr 14 2024 8:21 AM

Do This When Children Gain Weight Disproportionately To Their Height - Sakshi

హెల్త్‌

మన దేశంలో అప్పుడే పుట్టిన ఆరోగ్యకరమైన పిల్లలు రెండున్నర కిలోల నుంచి 3 కిలోల వరకు బరువుంటారు. పిల్లల బరువు అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. తల్లిదండ్రుల జీన్స్, తల్లి ఆహారపు అలవాట్లు, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి వచ్చిన రుగ్మతలు, తల్లి బరువు వంటి అంశాలపై పిల్లల బరువు ఆధారపడి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఎక్కువ తేడా లేకుండా.. ఈ బరువుకు కాస్త అటు ఇటుగా ఉన్న పిల్లలూ ఆరోగ్యంగా పుట్టినట్టే.

కొన్ని సూచనలతో చిన్నారులు ఆరోగ్యంగా బరువు పెరుగుతున్నారో లేదో తెలుసుకోవచ్చు. పిల్లలు పుట్టాక మొదటి వారంలో– పుట్టినప్పుడు ఉన్న బరువు కంటే మొదట్లో కాస్త తగ్గుతారు. నిర్దిష్టంగా చెప్పాలంటే మొదటి వారం పదిరోజుల్లో పుట్టిననాటి బరువులో 5 శాతం నుంచి 10 శాతం బరువు తగ్గుతారు. ఇక రెండోవారం నుంచి క్రమేణా బరువు పెరుగుతూపోతారు.

మొదటి మూడు నెలల్లో దాదాపు రోజుకు 20 నుంచి 30 గ్రాములు పెరుగుతూ పోతే... మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రోజుకు 10 నుంచి 15 గ్రాముల వరకు పిల్లలు బరువు పెరుగుతారు. ఇలా చూస్తే మొదటి ఐదునెలల్లో పుట్టినప్పటికంటే రెట్టింపు (డబుల్‌) బరువు, ఏడాదికి మూడు రెట్ల (ట్రిపుల్‌) బరువు పెరగాలి. కానీ పాపలందరూ ఇలాగే పెరగాలని లేదు. కాస్త అటు ఇటుగా ఉన్నా అది ఆరోగ్యకరమైన బరువే. అయితే ఈ లెక్కకు దూరంగా ఉంటే మాత్రం తగినంత బరువు పెరగడం లేదని అర్థం చేసుకోవాలి.

తల్లి నుంచి రెండు రకాల పాలు..
బిడ్డ పాలు తాగేప్పుడు తల్లి నుంచి రెండు రకాల పాలు వస్తాయి. మొదట వచ్చే పాలను ఫోర్‌ మిల్క్‌ అంటారు. రెండోసారి పాలను హైండ్‌ మిల్క్‌గా పేర్కొంటారు. అంటే ఈ హైండ్‌ మిల్క్‌ పాప కాసిన్ని పాలు తాగాక వస్తాయి. నిజానికి ఫోర్‌ మిల్క్‌ కంటే.. హైండ్‌ మిల్క్‌ చాలా బలవర్ధకమైనవి. బరువు పెరగడానికి ఇవే ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫోర్‌ మిల్క్‌ను ప్రసవం కాగానే స్రవించే ముర్రుపాలతో ΄÷రబాటు  పడవద్దు. ముర్రుపాలు వేరు, ఫోర్‌ మిల్క్‌ వేరు. పుట్టగానే స్రవించే ముర్రుపాలు శిశువుకు చాలా మంచివి. రోగనిరోధకతను ఇస్తాయి. ఫోర్‌ మిల్క్‌ అంటే... పాలు పట్టడం మొదలు పెట్టగానే మొదట స్రవిస్తాయి. ఓ పది–పదిహేను గుటకల తర్వాత హైండ్‌ మిల్క్‌ స్రవిస్తాయి.

తగినంత బరువు పెరగడం లేదంటే..

  • తల్లి పాలు సరిపోక పోవడం లేదా బిడ్డ సరిగా తాగకపోవడం, బిడ్డ పూర్తిగా తాగకుండా మధ్యలోనే నిద్రపోవడం, పాలు తాగకపోవడానికి కొన్నిసార్లు తల్లి వైపునుంచి, మరికొన్నిసార్లు బిడ్డ వైపు నుంచి కూడా కారణాలు ఉండవచ్చు. 
  • తల్లి బిడ్డకు పాలు సరిగా పట్టకపోవడం జరగవచ్చు. 
  • పాలు పడుతున్నప్పుడు చిన్నారి దృష్టి పాల నుంచి పక్కకు మళ్లవచ్చు.  పాలపీక అలవాటు చేయడం వల్ల చిన్నారులు పాలు సరిగా తాగరు. 
  • ఎనీమియా, యూరినరీ ఇన్ఫెక్షన్స్, చెవిలో ఇన్ఫెక్షన్స్, అలర్జీల వంటిఆరోగ్యపరమైన సమస్య ఉన్నా  బరువు పెరగకపోవచ్చు.

బరువు పెరగడానికి..

  • రెండు మూడు గంటలకు ఓమారు పాలు పట్టించాలి. ∙ఓ రొమ్ము పట్టించాక ఆ రొమ్ము నుంచి పాలు పూర్తిగా తాగిందో లేదో నిర్ధారణ చేసుకోవాలి. ఇందుకు చేయాల్సింది... బిడ్డ పూర్తిగా పాలు తాగాక చిన్నారికి అదే రొమ్మును అందిస్తే ముఖం తిప్పుకోవడం, రొమ్ము అందుకోకపోవడం చేస్తుంది. 
  • ఓ రొమ్ములోని పాలు పూర్తిగా పట్టించాక రెండో రొమ్ము కూడా అందించాలి. అప్పుడు ఆ రెండో రొమ్ము పాలు  తాగకపోయినా– బిడ్డ సంతృప్తిగా ఉంటే పూర్తిగా పాలు తాగినట్లే. బిడ్డకు పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోడానికి రోజులో ఎన్నిసార్లు పక్క తడుపుతోందన్న అంశం కూడా ఓ సూచన. పాప పగటిపూట కనీసం నాలుగయిదుసార్లు పక్క తడుపుతుంటే.. పాలు సరిపోతున్నాయని అనుకోవచ్చు. 

చికిత్స ఎప్పుడంటే..?
పైన పేర్కొన్న అంశాలను జాగ్రత్తగా గమనిస్తూ, పాప బరువును ప్రతివారం పరీక్షిస్తూ ఉండాలి. అప్పటికీ బిడ్డ బరువు వయసుకు తగి నంతగా పెరగడం  లేదంటే... ఏవైనా ఇన్ఫెక్షన్స్‌ ఉన్నాయేమో వైద్యపరీక్షల ద్వారా తెలుసుకుని, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది.

— డా. శివనారాయణరెడ్డి వెన్నపూస, నియోనేటాలజిస్ట్‌ అండ్‌ పీడియాట్రిస్ట్‌

ఇవి చదవండి: చల్లచల్లని కూల్‌ కూల్‌

Advertisement

adsolute_video_ad

homepage_300x250