Sakshi News home page

ఆర్థిక మోసాలపై కేంద్రం సీరియస్‌

Published Mon, Apr 15 2024 6:13 AM

FinMin pushes for enhanced KYC procedure - Sakshi

కేవైసీని మరింత కఠినతరం చేయడంపై కసరత్తు

న్యూఢిల్లీ: ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం కేవైసీ నిబంధనలను కఠినతరం చేయడం, బిజినెస్‌ కరెస్పాండెంట్లను (బీసీ) చేర్చుకునేటప్పుడు మదింపు ప్రక్రియను మరింత పటిష్టం చేసేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సూచించడం మొదలైన అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలను అందించే వ్యాపారులు, బిజినెస్‌ కరెస్పాండెంట్ల (బీసీ) మదింపు ప్రక్రియను పటిష్టం చేయడమనేది మోసాల నివారణతో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేసేందుకు దోహదపడగలదని వివరించాయి. సాధారణంగా వ్యాపారులు, బీసీల వద్దే డేటా ఉల్లంఘనలకు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ స్థాయిలోనే డేటాకు భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి.

సైబర్‌ మోసాలకు హాట్‌స్పాట్స్‌గా ఉన్న ప్రాంతాల్లో బీసీలు ఎక్కువగా ఉండటాన్ని, వారి ఆన్‌బోర్డింగ్‌ ప్రక్రియను పునఃసమీక్షించుకోవాలని, మోసాల్లో ప్రమేయమున్నట్లుగా తేలిన మైక్రో ఏటీఎంలను బ్లాక్‌ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్‌బీఐ సూచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. సైబర్‌ సెక్యూరిటీ, ఆర్థిక మోసాల నివారణపై ఇటీవల జరిగిన అంతర్‌–మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ మేరకు సూచనలు వచి్చనట్లు పేర్కొన్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం 2023లో రూ. 7,489 కోట్ల సైబర్‌ ఆర్థిక మోసాలకు సంబంధించి 11,28,265 కేసులు నమోదయ్యాయి.

Advertisement

adsolute_video_ad

homepage_300x250