
ప్యారిస్ ఒలింపిక్స్-2024 పతక విజేతలు నీరజ్ చోప్రా- మనూ భాకర్ గురించి జరుగుతున్న ప్రచారంపై మనూ తండ్రి రామ్ కిషన్ భాకర్ స్పందించారు.

మనూకు ఇప్పట్లో పెళ్లి చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. కాగా విశ్వ క్రీడల తాజా ఎడిషన్‌లో షూటర్ మనూ భాకర్ రెండు కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.

తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించిన 22 ఏళ్ల మనూ.. అదే క్రీడాంశంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో మరో కంచు పతకం సొంతం చేసుకుంది.

తద్వారా ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన భారత తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనూ నాలుగో స్థానంలో నిలిచి.. మూడో పతకానికి అడుగుదూరంలో నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలో మనూ భాకర్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.

మరోవైపు.. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.

టోక్యోలో స్వర్ణం గెలిచిన 26 ఏళ్ల నీరజ్ ఈసారి మాత్రం రెండోస్థానానికే పరిమితం కావడం కాస్త నిరాశ కలిగించేదే అయినా.. ప్యారిస్‌లో భారత్‌కు ఏకైక రజతం అందించిన అథ్లెట్‌గా నిలిచాడు.

ఇదిలా ఉంటే.. ఒలింపిక్స్-2024 ముగింపు వేడుకల అనంతరం నీరజ్ చోప్రా- మనూ భాకర్ మాట్లాడుకుంటున్న వీడియో బయటకు వచ్చింది.

ఇందులో వీరిద్దరు కాస్త సిగ్గుపడుతున్నట్లుగా కనిపించగా.. మనూ తల్లి సుమేధా భాకర్ ఫొటోలు క్లిక్‌మనిపించారు. అంతేకాదు.. అనంతరం నీరజ్ దగ్గరకు వచ్చిన సుమేధా.. అతడి చేయిని తన చేతుల్లోకి తీసుకుని మాటివ్వు అన్నట్లుగా తలపై పెట్టుకున్నారు.

ఆ తర్వాత మనూ తండ్రి రామ్ కిషన్ కూడా అక్కడికి వచ్చారు. నీరజ్ ఆయన పాదాలకు నమస్కరించగా.. ఆయన అతడి వెన్నుతట్టారు.

ఈ వీడియోలు వైరల్ కావడంతో... ఈ హర్యానా అథ్లెట్లు పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇందుకు మనూ తల్లిదండ్రుల అనుమతి కూడా లభించిందంటూ వదంతులు పుట్టుకొచ్చాయి.

ఈ విషయంపై స్పందించిన మనూ తండ్రి రామ్ కిషన్ దైనిక్ భాస్కర్‌తో మాట్లాడుతూ.. ‘‘మనూ ఇంకా చిన్నపిల్ల. తనకు ఇంకా పెళ్లి చేసే ఈడు కూడా రాలేదు. ఇప్పట్లో అసలు ఆ విషయం గురించే మేము ఆలోచించడం లేదు.

ఇక మనూ వాళ్ల అమ్మ నీరజ్‌ను తన కుమారుడిలాగే భావిస్తుంది. వాళ్లిద్దరి మధ్య తల్లీకొడుకుల అనుబంధం ఉంది’’ అని పేర్కొన్నారు.

అదే విధంగా.. నీరజ్ చోప్రా అంకుల్ కూడా ఈ విషయం గురించి స్పందించారు. ‘‘నీరజ్ పతకం తీసుకురావడం దేశమంతా చూసింది కదా.

అలాగే అతడి పెళ్లి కూడా అందరికి తెలిసే జరుగుతుంది’’ అని స్పష్టం చేశారు.




