
భారత చెస్ రైజింగ్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్

ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న దివ్య దేశ్‌ముఖ్ కెరీర్ బెస్ట్ 15వ ర్యాంక్‌ను అందుకుంది.

అబుదాబి మాస్టర్స్ టోర్నీలో తొమ్మిది రౌండ్లకుగాను ఆరు పాయింట్లు సాధించిన 18 ఏళ్ల దివ్య 11 ఎలో రేటింగ్ పాయింట్లను సంపాదించింది.

ఈ ప్రదర్శనతో నాగ్‌పూర్‌కు చెందిన దివ్య చెస్ లైవ్ రేటింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌లో నిలిచింది.

వచ్చే నెల ఒకటో తేదీన అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో దివ్య అధికారికంగా 15వ ర్యాంక్‌ను అందుకుంటుంది.

ఈ ఏడాది బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో దివ్య రేటింగ్ పాయింట్లను సాధించింది.

టాటా స్టీల్ చాలెంజర్స్, గ్రెన్‌కెచెస్, షార్జా మాస్టర్స్, వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్, టర్కీష్ లీగ్‌లలో దివ్య పాల్గొని ఓవరాల్‌గా 63 పాయింట్లను సంపాదించింది.

సీజన్‌ను 2420 రేటింగ్ పాయింట్లతో ఆరంభించిన దివ్య ఖాతాలో ప్రస్తుతం 2483 పాయింట్లున్నాయి.

దివ్య ర్యాంక్ మెరుగవ్వడంతో తొలిసారి ‘ఫిడే’ మహిళల ర్యాంకింగ్స్‌లో టాప్–15లో నలుగురు భారత క్రీడాకారిణులు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి ఏడో స్థానంతో భారత నంబర్‌వన్‌గా కొనసాగుతోంది.

ఇక ద్రోణవల్లి హారిక 11వ ర్యాంక్‌లో, తమిళనాడుకు చెందిన గ్రాండ్‌మాస్టర్ వైశాలి 12వ ర్యాంక్‌లో, దివ్య దేశ్‌ముఖ్ 15వ ర్యాంక్‌లో ఉన్నారు.

తదుపరి సెపె్టంబర్ 10 నుంచి 23 వరకు హంగేరిలో జరిగే చెస్ ఒలింపియాడ్‌లో దివ్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
