
తెలుగు తేజం గోపీచంద్ తోటకూర మే 19న దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు.

గోపీచంద్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూషెపర్డ్-25 (ఎన్‌ఎస్-25) వ్యోమనౌకలో గోపీచంద్ ఈ యాత్ర పూర్తిచేశారు.

గోపీచంద్ వెళ్లిన న్యూషెపర్డ్ రాకెట్‌కు ఇది ఏడో మానవసహిత అంతరిక్షయాత్ర.

గోపీచంద్‌తోపాటు వెంచర్ క్యాపిటలిస్ట్ మేసన్ ఏంజెల్, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహస యాత్రికురాలు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ రోదసీ యాత్రలో పాల్గొన్నారు.

టూరిస్ట్ హోదాలో హుషారుగా గోపీచంద్ ఈ యాత్రలో పాల్గొన్నారు

నేల నుంచి 100 కిలోమీటర్ల ఎగువన ఉండే కార్మాన్ రేఖను దాటాక గోపీచంద్ బృందం అక్కడి నుంచి అద్భుత దృశ్యాల్ని వీక్షించింది. ఈ రేఖను భూవాతావరణానికి, అంతరిక్షానికి సరిహద్దుగా పరిగణిస్తారు.

డ్వైట్ 1961లో అంతరిక్షయానానికి ఎంపికైన తొలి ఆఫ్రోఅమెరికన్ వ్యోమగామి. వివిధ కారణాల వల్ల ఆయనకు రోదసిలోకి వెళ్లే అవకాశం రాలేదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసులో ఆ కల నెరవేరింది. రోదసియాత్ర చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు.

రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గోపిచంద్ తోటకూర గుర్తింపు పొందారు.

భారత్‌కు చెందిన రాకేశ్ శర్మ.. 1984లో అంతరిక్షయానం చేశారు. ఆ తర్వాత గోపీచంద్ ఈ ఫీట్ సాధించారు.

రాకేష్ శర్మ తర్వాత కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల కూడా రోదసి యాత్రలు చేసినప్పటికీ.. వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు.

గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్‌పోర్టు ఉంది.

అందువల్ల రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు.

దీనికితోడు ఆయన పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేశారు. తద్వారా.. భారత తొలి స్పేస్ టూరిస్టుగా గుర్తింపు పొందారు.

విజయవాడలో పుట్టిన గోపీచంద్ తోటకూర.. పైలట్‌గానూ శిక్షణ పొందారు.

వాయు మార్గంలో రోగుల అత్యవసర తరలింపు విభాగంలో సేవలు అందించారు. హాట్ ఎయిర్ బెలూన్లు, గ్లైడర్లు, సీప్లేన్లు నడిపారు.

గోపీచంద్.. ‘ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ’ నుంచి ఏరోనాటికల్ సైన్స్‌లో బీఎస్సీ పూర్తి చేశారు.

ప్రస్తుతం గోపీచంద్ అట్లాంటా శివారులోని ‘ప్రిజర్వ్ లైఫ్’ సంస్థకు సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు.