Sakshi News home page

భ్రాంతి కాదు నిజం అయారి

Published Sat, Feb 17 2018 4:40 AM

Manoj Bajpayee, Sidharth Malhotra’s dull espionage drama tests patience - Sakshi

‘‘దేశ్‌ బేచ్‌ దేంగే తో బచేగా క్యా?’’ (దేశాన్నే అమ్మేస్తే ఇంకేం మిగిలి ఉంటుంది?) అంటూ దేశమంతా అలుముకున్న అవినీతి మీద ఆలోచనను రేకెత్తించేదే ‘అయారి’ సినిమా! ‘ఎ వెడ్‌నెస్‌ డే’, ‘స్పెషల్‌ చబ్బీస్‌’, ‘బేబీ’ తీరులో ఈ సినిమా ఉత్కంఠను రేకెత్తించలేకపోయినా.. దర్శకుడు నీరజ్‌ పాండే మార్క్‌నైతే చూపిస్తుంది. అయారి.. అంటే భ్రాంతి.. తాంత్రికత.. మాంత్రికత!  అన్నీ బాగున్నట్టు అనిపించే, ఫీల్‌ గుడ్‌ ఫీల్‌ భ్రాంతిని కలిగించే పరిస్థితుల వెనక ఉన్న అసలు కథను చూపించే సినిమా. ఇది  కేవలం కల్పితం.

ఎవరినీ, దేనినీ ఉద్దేశించి కాదు అంటూ ప్రారంభంలో డిస్‌క్లేమర్‌ వేసినా.. రక్షణ శాఖలో జరుగుతున్న అవినీతిని సెల్యూలాయిడ్‌ మీద చూపించిన చిత్రం ఇది. అందుకే పైన చెప్పిన మాట అంటాడు ఆర్మీ చీఫ్‌ ‘‘దేశ్‌ బేచ్‌ దేంగే తో బచేగా క్యా?’’ అని! ఆహారధాన్యాల దగ్గర నుంచి ఆయుధాల దాకా అన్ని శాఖల్లో అంతటా అవినీతే. ఎక్కడికక్కడ దేశాన్ని అమ్ముకుంటూ పోతే ఇంకేం మిగులుతుంది? మనకన్నా ముందు తరం.. తర్వాత తరాలకు ఏం స్ఫూర్తిని పంచుతారు? సంపాదన ఆశలో పడి ఈ తరం ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్తుంది? అంటూ తరాల ఆలోచనల అంతరాలనూ ప్రశ్నిస్తుంది? చర్చకు చోటిస్తుంది.

దేశ భక్తి అనే పెద్ద మాటలు వద్దు కాని.. ఆరోగ్యకరమైన వాతావరణమైతే దేశంలో ఉండాలికదా! మన దేశంలో మనం భద్రంగా ఉన్నామనే భావనైతే కలగాలి కదా! దేశానికి కంచెలా ఉన్న రక్షణ శాఖ ఆ నమ్మకాన్నివ్వాలి కదా! అదే అమ్మకానికి తయారైపోతే? విశ్వాసాన్ని కోల్పోతాడు ఓ యంగ్‌ సోల్జర్, మేజర్‌ జయ్‌ బక్షి (సిద్ధార్థ్‌ మల్హోత్రా). రక్షణ శాఖలోని పెద్ద తలకాయలైతే ఆయుధాలు అమ్మే డీలర్స్‌తో డీల్‌ కుదుర్చుకొని నిజాయితీగా పనిచేస్తున్న టీమ్‌ను పణంగా పెట్టాలనుకున్నప్పుడే మొత్తం మిలటరీ వ్యవస్థ మీదే గౌరవాన్ని తుడిచేసుకుంటాడు.

ఆ డీల్‌లో తానూ వాటా పంచుకోవాలనుకుంటాడు. డ్యూటీని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన కల్నల్‌ అభయ్‌ సింగ్‌ (మనోజ్‌ బాజ్‌పాయ్‌)ను స్ఫూర్తిగా తీసుకుని.. విధి నిర్వహణలో అతనంతటివాడిని కావాలని కలలు కని ఆర్మీలోకి వస్తాడు. కల్నల్‌ అభయ్‌సింగ్‌ నేతృత్వంలోని కోవర్ట్‌ ఆపరేషన్స్‌ (స్పెషల్‌)లో సభ్యుడిగా ఉంటుంటాడు జయ్‌ భక్షి. ఒకరకంగా కల్నల్‌కు ఏకలవ్య శిష్యుడు జయ్‌. ఆపరేషన్స్‌ నిర్వహణలో ఆలోచన దగ్గర్నుంచి, వ్యూహప్రతివ్యూహాలు, ఆచరణ అన్నీ తన గురువులాగే చేస్తుంటాడు.

ట్యాపింగ్‌.. రేటింగ్‌
ఈ స్పెషల్‌ టీమ్‌ అసైన్‌మెంట్‌లో ఉన్నప్పుడే తెలుస్తుంది ఓ మిలిటరీ ఆఫీసర్‌ ఆర్మీ చీఫ్‌ దగ్గరకు ఓ డీల్‌ తీసుకుని రావడం గురించి.  ఓ ఆర్మ్స్‌ డీలర్‌ తరపున ఓ ఆఫర్‌ తీసుకొని వస్తాడు ఆ ఆఫీసర్‌ ఆర్మీ చీఫ్‌ దగ్గరకు. ఆ డీల్‌ను మన్నించి వాళ్ల దగ్గర ఆయుధాలు కొంటే అమరవీరుల వితంతువులకు సంక్షేమ ఫండ్‌నూ ఇస్తారనే తాయిలాన్నీ చూపిస్తాడు. ఆ ఆఫర్‌కు తల వంచని చీఫ్‌ ‘‘చివరకు దేశాన్నీ అమ్మేస్తున్నామన్న మాట’’ అంటూ చురకా అంటిస్తాడు.

‘‘అనధికారికంగా.. 20 కోట్ల ఫండ్‌తో మీరు నిర్వహిస్తున్న స్పెషల్‌ టీమ్‌ కోవర్ట్‌ ఆపరేషన్స్‌ మాటేంటి?’’ అని అప్పటిదాకా రహస్యంగా ఉన్న విషయాన్ని బయటపెట్టి బ్లాక్‌మెయిలింగ్‌కు తలపడ్తాడు ఆ ఆఫీసర్‌. ఆ స్పెషల్‌ టీమ్‌ ఓ కాజ్‌ కోసం.. ఎవరికీ తెలియకుండా నియమించింది. అది బయటపడేసరికి ఖంగు తింటాడు ఆర్మీ చీఫ్‌. వాళ్ల సంభాషణను ట్యాప్‌ చేస్తున్న జయ్‌ కూడా విస్మయం చెందుతాడు. అయినా తలవంచడు ఆర్మీ చీఫ్‌. దేశానికి రక్షణగా నిలవాల్సిన ఆ శాఖలోని అవినీతి మొత్తం మిలటరీ మీదే విశ్వాసాన్ని పోగొడ్తుంది జయ్‌కు.

ఆ టీమ్‌లోంచి ఈ ఆఫీసర్‌ టీమ్‌లోకి మారుతాడు జయ్‌.. డబ్బు సంపాదించుకోవడానికి. అప్పటికే ఈ కోవర్ట్‌ ఆపరేషన్స్‌ కోసం ఓ ఎథికల్‌ హ్యాకర్‌ సోనియా (రకుల్‌ప్రీత్‌ సింగ్‌)తో పరిచయం పెంచుకొని ప్రేమలో పడ్తాడు జయ్‌. ఇప్పుడు ఈ ఆఫీసర్‌ టీమ్‌లో చేరి తన కోవర్ట్‌ టీమ్‌ రహస్యాలను చెప్పేందుకు పదికోట్లకు డీల్‌ కుదుర్చుకుని తన ప్రియురాలితో దేశాన్ని వదిలిపోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో ఉంటాడు కూడా. ఈ విషయం కల్నల్‌ అభయ్‌సింగ్‌కు తెలుస్తుంది.

జయ్‌ కోసం వేట మొదలుపెడ్తాడు. ఇందులో భాగంగానే లండన్‌ చేరతారు ఇద్దరూ. అప్పటికే సోనియా లండన్‌ చేరుకుని ఉంటుంది జయ్‌ ప్లాన్‌లో భాగంగా. గురువు దగ్గర నేర్చుకున్న విద్యతో అతనికి దొరక్కుండా జాగ్రత్త పడ్తుంటాడు జయ్‌. ఇంకా పై ఎత్తులు వేసి దగ్గరకు రప్పిస్తాడు కల్నల్‌. ఇందులో ఇంటర్నేషనల్‌ ఆర్మ్స్‌ డీలర్‌ ముఖేష్‌ కపూర్‌ (అదిల్‌ హుస్సేన్‌)ను పావులా వాడుకుంటాడు అభయ్‌. ఆర్మ్స్‌ డీలర్‌ ముఖేష్‌ కపూర్‌ కూడా ఒకప్పుడు ఇండియన్‌ ఆర్మీలో ఆఫీసరే.

ఇండియన్‌ ఆర్మీలో ఉన్న లొసుగులు, విధివిధానాలన్నిటినీ ఔపోసన పట్టిన అతను ఆయుధాల వ్యాపారంతో కోట్లకు పడగలెత్తొచ్చని ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ వ్యాపారం మొదలుపెడ్తాడు. విదేశీ కంపెనీల ఆయుధాలకు డీలర్‌గా మారి మన దేశంలోని మిలటరీ అధికారులకు లంచాలిస్తూ అసలు ధరకన్నా నాలుగు రెట్ల ధరతో ఆయుధాలను కొనిపిస్తుంటాడు. అలా రిటైరయ్యి, మళ్లీ ఉద్యోగంలో చేరిన ఓ ఆర్మీ ఆఫీసర్‌నూ పట్టి.. ఆయన ద్వారా చీఫ్‌కు తన వర్తమానం పంపిస్తాడు అలా. ఆర్మీ చీఫ్‌ వద్దనేసరికి జయ్‌ భక్షి సహాయంతో ఆ చీఫ్‌ నియమించిన కోవర్ట్‌ ఆపరేషన్స్‌ గుట్టు రట్టు చేసి టీఆర్‌పీలో నంబర్‌ మూడులో ఉన్న ఓ చానల్‌ రిపోర్టర్‌కు ఇస్తాడు టెలికాస్ట్‌ చేయమని. దాంతో చానల్‌ రేటింగ్‌ను పెంచుకొని నంబర్‌వన్‌ చానల్‌గా అయిపోమ్మని.

మోసం.. దగా
అయితే కల్నల్‌ అభయ్‌ సింగ్‌ ఆ పాచిక పారనివ్వడు. జయ్‌ను పట్టుకునే క్రమంలో జయ్‌ ద్వారా తెలుసుకున్న, అందుకున్న  సమాచారంతో ఆ చానల్‌ రిపోర్టర్‌ను కలుసుకొని ఇంకో రికార్డర్‌ ఇస్తాడు టెలికాస్ట్‌ చేసుకొమ్మని. ఆఫీసర్‌ ఇచ్చినది వేసుకోవాలో.. ఇప్పుడు తాను ఇచ్చింది వేసుకోవాలో విచక్షణ నీదే అంటాడు. అది అమరవీరుల వితంతువుల కోసం ముంబైలో కట్టిన నివాస సముదాయంలో జరిగిన అవినీతికి సంబంధించిన వార్తాకథనం. ఆ రిపోర్టర్‌ అభయ్‌సింగ్‌ ఇచ్చిన కథనాన్నే టెలికాస్ట్‌ చేయిస్తుంది. ఆ ఆఫీసర్‌ తుపాకితో పేల్చుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఆ నిర్మాణం అవినీతిలో ప్రధాన హస్తం ఆ ఆఫీసర్‌దే. ఈ మొత్తం వ్యవహారం... రక్షణ శాఖ పట్ల అభయ్‌సింగ్, జయ్‌ల మ«ధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి ఆ ఇద్దరినీ ఒక్కటిచేసే దిశగా సాగి సినిమాను ఎండ్‌ చేస్తుంది.

కశ్మీర్‌ ఓ ప్రదేశం కాదు..
 రక్షణ శాఖ, అంతర్జాతీయ ఆయుధ వ్యాపారులు, డీలర్లు, దేశీ మీడియా.. ఇవన్నీ కలిసి ఎలాంటి గిమ్మిక్కులు చేస్తున్నాయి? ఆ లాబీ ముసుగులో ఎవరి ప్రయోజనాలను వాళ్లు ఎంతెంత నెరవేర్చుకుంటున్నారు? ఈ నేపథ్యంలో దేశ రక్షణ, దానిపట్ల ప్రజలకున్న నమ్మకాన్ని ఎలా పణంగా పెడ్తున్నారు? అనేదాన్ని కళ్లకు కట్టినట్టు చూపెడుతుందీ సినిమా. ‘‘ఇండియా, పాకిస్తాన్‌ ఈ రెండు దేశాల వైపు ఎందరో మేధావులు, విద్యావేత్తలు ఉన్నారు.
అయినా కశ్మీర్‌ సమస్యకు ఎందుకు పరిష్కారం చూపట్లేదు?’’ అని ప్రశ్నిస్తాడు జయ్‌.. కల్నల్‌ అభయ్‌సింగ్‌ను. ‘‘కశ్మీర్‌ ఓ ప్రదేశంకాదు.. ఓ ఇండస్ట్రీ. దానివల్ల వ్యాపారుల దగ్గర్నుంచి రాజకీయనాయకుల దాకా అందరికీ లాభాలున్నాయి. ఓ సమస్య లాభాలను పంచుతున్నంత కాలం దాన్ని కాలం చెల్లనివ్వకుండా చూసుకుంటారు ’’ అంటాడు కల్నల్‌. ఎంత నిజం? అదే నిజం దేశంలోని అన్ని సమస్యలకు వర్తిస్తుంది. అదే చెప్తుంది.. చూపిస్తుంది ‘అయారి’ సినిమా. పాలకులు, కార్పోరేట్‌ శక్తులు కలిసి సమస్యలతో ప్రయోజనాలను పిండుకుంటే ప్రజలకు అంతా బాగుందనే భ్రాంతి కలగజేస్తూ జోకొడ్తుంటారు. చైతన్యం కాకపోతే అయారి (భ్రాంతే) మిగుల్తుంది.

మనోజ్‌భాజ్‌పాయ్‌ ఈ సినిమాకు ఊపిరి. ఆదిల్‌ హెస్సేన్, నసీరుద్దీన్‌ షా, అనుపమ్‌ఖేర్‌ల నటన గురించి ప్రతేక్యంగా చెప్పేదేముంటుంది? పాత్రలను పండిస్తారు. వీళ్లకు సమ ఉజ్జీగా సిద్ధార్థ్‌ మల్హోత్రా శక్తియుక్తులను కూడదీసుకున్నాడు. రకుల్‌ప్రీత్‌.. డాన్సింగ్‌ డాల్‌గా మిగల్లేదు. దర్శకుడు నీరజ్‌పాండే ఇంతకుముందు తీసిన సినిమాలను దృష్టిలో పెట్టుకొని వెళితే నిరాశపడ్తారు. కాబట్టి ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ‘అయారి’ అలరిస్తుంది.
– శరాది

homepage_300x250