
తవ్వేస్తాం.. దోచేస్తాం!
సాక్షి, యాదాద్రి: జిల్లాలో మూసీ, ఆలేరు, బిక్కేరు, శామీర్‌పేటతోపాటు పలు వాగులు, కాళేశ్వరం క్వారీల నుంచి యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరుతో ట్రాక్టర్ల సాయంతో ఇసుకను రహస్య ప్రాంతాల్లో డంప్‌చేసి హైదరాబాద్, జనగామ, భువనగిరి వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, పోలీస్, రెవెన్యూ అధికారుల అండదండలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ వాగుల నుంచి ఇసుక తరలింపు
మూసీ వెంట ఉన్న బీబీనగర్, వలిగొండ, రామన్నపేట మండలాల్లోని గ్రామాల వాగుల నుంచి నుంచి రాత్రి సమయంలో ఇసుకను తోడేస్తున్నారు. ఆలేరు, బిక్కేరు వాగుల వెంట ఉన్న రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, మోటకొండూరు, ఆత్మకూర్(ఎం), గుండాల, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని గ్రామాల నుంచి వందలాది ట్రాక్టర్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న వాగులతోపాటు గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టుల నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. అదేవిధంగా భువనగిరి, ఆలేరు, మోటకొండూరు, యాదగిరిగుట్ట, బీబీనగర్, బొమ్మలరామారం, ఆలేరు మండలాల్లో ఇసుక డంపులు ఏర్పాటు చేస్తున్నారు. వాగుల నుంచి దొంగచాటుగా తెస్తున్న ఇసుకను, కాళేశ్వరం నుంచి తెస్తున్న ఇసుకను ఒక చోట డంప్ చేసి గుట్టు చప్పుడు కాకుండా ఈ రెండు రకాల ఇసుకను కలిపి గోదావరి ఇసుక అని సరఫరా చేసి వినియోగదారులను మోసం చేస్తున్నారు.
అనుమతి కంటే ఎక్కువ మొత్తంలో రవాణా
ప్రైవేట్ భవన నిర్మాణాలు, ప్రభుత్వ భవన నిర్మాణాల కోసం ట్రాక్టర్ యజమానులు రెవెన్యూ శాఖ నుంచి అనుమతి తీసుకుంటున్నారు. ఈమేరకు స్థానిక వాగుల నుంచి తమకు అనుమతించిన రోజుల్లోనే పర్మిట్ పొందిన ట్రిప్పుల కంటే ఎక్కువ మొత్తంలో ఇసుకను రవాణా చేస్తున్నారు. రాత్రి సమయంలో కూడా వందల ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. మూసీ పరిధిలో ఉన్న రామన్నపేట, వలిగొండ, బీబీనగర్ మండలాల నుంచి రోజుకు 50 నుంచి 100 ట్రాక్టర్ల ఇసుకను సరఫరా చేస్తున్నారు.
దాడులు చేస్తున్నా ఆగని దందా
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పోలీసులు దాడులు ప్రారంభించారు. ఈనెల 14నుంచి ఓవర్‌లోడ్ ఇసుక లారీలు, ఇసుక డంప్‌లపై దాడులు నిర్వహిస్తున్నారు. పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి, రెవెన్యూ అధికారులకు అప్పగించి, జరిమానాలు విధించారు. అయినా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదని లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఇసుక అక్రమ రవాణా సాగిస్తే కేసులు నమోదు చేస్తాం
అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనలు, వాల్టా చట్టానికి తూట్లు పొడిచే విధంగా ఇసుక రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే రాచకొండ పరిఽధిలో ఇసుక అక్రమ తరలింపు కేసులు 250 నమోదు చేశాం. 50 వేల టన్నుల ఇసును సీజ్‌చేశాం. తక్కువ ట్రిప్పులకు పర్మిషన్ తీసుకుని ఎక్కువ ట్రిప్పులు కొడుతున్న వారిపై నిఘా పెడతాం. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీలను సీజ్ చేస్తాం. ఇసుక డంపులపై దాడులు చేసి వాటికి సంబంఽధించిన వారిపై చర్యలు తీసుకుంటాం.
– సుధీర్‌బాబు, రాచకొండ సీపీ
ఫ యథేచ్చగా ఇసుక దందా
సాగిస్తున్న అక్రమార్కులు
ఫ అనుమతి పొందిన ట్రిప్పుల కంటే ఎక్కువ మొత్తంలో ఇసుక రవాణా
ఫ రహస్య ప్రాంతాల్లో డంప్‌చేసి
హైదరాబాద్, జనగామ,
భువనగిరికి తరలింపు
ఫ వాగులు లేని ప్రాంతాల్లో మట్టిని
నీటితో శుభ్రం చేసి ఇసుకను
తీసి అమ్ముతున్న వ్యాపారులు
వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని..
కాళేశ్వరం రీచ్‌లనుంచి ఇసుక ఓవర్ లోడ్ తగ్గడంతో గిట్టుబాటు కావడంలేదని వ్యాపారులు ఽటన్ను ధర పెంచేశారు. మరో వైపు వాగుల నుంచి తెస్తున్న ఇసుక ధర కూడా పెరిగింది. ఈ క్రమంలో వాగులు లేని ప్రాంతాల్లో ట్రాక్టర్లలో మట్టిని తెచ్చి నీటితో శుభ్రం చేసి ఇసుకను తీసి అమ్ముతున్నారు. యాదగిరిగుట్ట, భువనగిరి, బొమ్మరాలరామారం, భువనగిరి, బీబీనగర్, మోటకొండూరు మండలాల్లో ఈ ఫిల్టర్ ఇసుక తయారు చేసి విక్రయిస్తున్నారు. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని నిజమైన ఇసుక వలే విక్రయించి మోసం చేస్తున్నారు.

తవ్వేస్తాం.. దోచేస్తాం!

తవ్వేస్తాం.. దోచేస్తాం!
Comments
Please login to add a commentAdd a comment