
కాలుష్యం పేరుతో పేదలపై కుట్ర
భీమవరం: అభివృద్ధి ముసుగులో ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు పేదల ఇళ్లను తొలగించే బుల్డోజర్ రాజకీయాలను తక్షణం విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వీ గోపాలన్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాలుష్యమంటూ ఎన్నో ఏళ్లుగా కాలువలు, పంట బోదుల పక్కన నివసిస్తున్న పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేయడం దారుణమన్నారు. ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మండలం ఐ.భీమవరం నుంచి పాలకోడేరు మండలం ఏఎస్‌ఆర్ నగర్ వరకు కాలుష్యం పేరుతో పేదల ఇళ్ళను కూల్చివేసి పేదలకు నిలువ నీడలేకుండా చేస్తున్నారని గోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం చేసే పనులను సమర్ధిస్తామని అయితే అభివృద్ధి పేరుతో పేదలను రోడ్లపాలు చేయాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో భూస్వాముల పక్కనే పేదల ఇళ్లు ఉండడమే తొలగింపునకు అసలు కారణమన్నారు. ప్రభుత్వ పోరంబోకు భూములను భూస్వాములు, పెత్తందారులకు కట్టబెట్టడానికే పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనకు విరుద్ధంగా నియోజకవర్గంలో వేలాదిగా ఉన్న ఉప్పునీటి బోర్లు రఘురామ కృష్ణంరాజుకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.వాసుదేవరావు, జక్కంశెట్టి సత్యనారాయణ, సేశపు ఆశ్రియ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment