పగలు భగభగ.. రాత్రి గజగజ
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సాక్షి, భీమవరం: వాతావరణ మార్పులు జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలు ఎండ మండిపోతుంటే, రాత్రిళ్లు చలి వణికిస్తోంది. మంచు ప్రభావంతో వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. గొంతు నొప్పి, జలుబు తదితర లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు శీతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మహా శివరాత్రి తర్వాత నుంచి చలి తీవ్రత తగ్గి ఎండల తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. మునుపెన్నడూ లేని విధంగా ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఎండ తీవ్రత పెరిగింది. వేసవిని తలపిస్తూ సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. కొద్ది రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండతీవ్రతకు ఉక్కపోత తోడై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మధ్యాహ్న 11 గంటల నుంచి రోడ్డుపై తిరగాలంటే భయమేస్తోంది. జిల్లాలోని వినియోగదారులతో రద్దీగా ఉండే భీమవరంలోని జువ్వలపాలెం, సండే మార్కెట్ రోడ్లు, నరసాపురంలోని స్టీమర్ రోడ్డు, తణుకులోని వేల్పూరు రోడ్డు, పాలకొల్లులోని బస్టాండ్ సెంటర్, తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్, తాలుకా ఆఫీస్ రోడ్డు మధ్యాహ్నం అయ్యే సరికి జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. గతంలో లేని విధంగా ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్రత ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
పగటి పరిస్థితి ఇలా ఉంటే.. చీకటిపడే సరికి వాతావరణం మారిపోతోంది. పొగమంచు కమ్మేసి చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 18 డిగ్రీలకు తగ్గిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల సమయం వరకు కూడా మంచు ప్రభావం ఉంటుండంతో పగటిపూట వాహనచోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
పొంచిఉన్న వైరల్ ఇన్ఫెక్షన్లు
ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో వైరల్ ఇన్ఫెక్షన్లు విజృంభించే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జలుబు, దగ్గు, గొంతునొప్పి, తదితర లక్షణాలతో బాదపడుతున్నారు. ఆయా లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రోజువారి ఓపీలో సీజనల్ వ్యాధులతో వచ్చే రోగులు ఎక్కువగానే ఉంటున్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో ప్రస్తుతం వ్యాధుల తీవ్రత లేకున్నా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసు కుంటున్నాం. నిల్వ ఆహారం తీసుకోకూడదు. ప్రయాణించేటప్పుడు ఎండ, మంచు నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
– భానునాయక్,
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
న్యూస్‌రీల్
వాతావరణ మార్పులతో ప్రజలు బెంబేలు
వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు
పట్టణం గరిష్టం కనిష్టం
భీమవరం 36 20
తణుకు 36 21
తాడేపల్లిగూడెం 37 20
పాలకొల్లు 33 19
నరసాపురం 38 20
ఈ జాగ్రత్తలు పాటించాలి
మంచులో ఎక్కువగా తిరగకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరగాల్సి వస్తే మంచు ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కూలింగ్ వాటర్ తాగకూడదు. బాగా కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే భుజించాలి. నిల్వ ఉన్న ఆహారం తీసుకోకూడదు.
గొంతునొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు మొదలైన లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి.
డ్రైనేజీల సమీపంలో నివసించే వారు దోమల బెడద లేకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలి.
పగలు భగభగ.. రాత్రి గజగజ
పగలు భగభగ.. రాత్రి గజగజ
పగలు భగభగ.. రాత్రి గజగజ
Comments
Please login to add a commentAdd a comment