లెక్కల మాస్టారుపై డీఈఓ విచారణ
ద్వారకాతిరుమల: స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్‌వీ ముత్యాలరావు గతేడాది నవంబర్‌లో విద్యార్థులను చితకబాదిన ఘటనపై డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ బుధవారం విచారణ జరిపారు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల ఎంపీయూపీ పాఠశాలలో ఒకటవ తరగతి చదివే గుండె త్రివిక్రమ్, నాల్గో తరగతి చదివే గుండె సహస్రలను గతేడాది నవంబర్ 25న లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్‌వీ ముత్యాలరావు అకారణంగా చితకబాదిన ఘటనపై తల్లిదండ్రులు అప్పట్లో కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా జరిగిన విచారణలో విద్యార్థులను ముత్యాలరావు కొట్టాడని ఎంఈఓ నివేదికలో పేర్కొన్నా ఆయనపై డీఈఓ చర్యలు తీసుకోకుండా, బదిలీ చేయడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ, చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ అధికారి సూర్యచక్ర వేణి బుధవారం పాఠశాలలో విచారణ జరిపి గుండె ధర్మరాజు, గుండె మాణిక్యాల నుంచి స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేశారు. అలాగే ఎంఈఓ–1 డి.సుబ్బారావు, ఎంఈఓ–2 పి.వెంకట్రావుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం డీఈఓ మద్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి, విద్యార్ధులతో కలసి భోజనం చేశారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి ఉపాధ్యాయుడు ముత్యాలరావును కాపాడుతూ వస్తున్న డీఈఓతో విచారణ జరిపిస్తే బాదితులకు ఏం న్యాయం జరుగుతుందని పలువురు అంటున్నారు. దీనిపై ఇతర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment