Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Ananthapur: పరిటాల డర్టీ పాలిటిక్స్‌

Published Thu, Apr 18 2024 1:00 AM

- - Sakshi

 ప్రచారం మాటున యథేచ్ఛగా ప్రలోభాలు

డబ్బు కావాలా? పనులు కావాలా అంటూ ఎర  

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు బలవంతంగా టీడీపీ కండువాలు

తమ పార్టీ వారికీ కండువాలు వేసి టీడీపీలో చేరారంటూ బిల్డప్‌

అధికారం కోసం ఏం చేయడానికై నా సిద్ధమంటోన్న వైనం

 అసహ్యించుకుంటున్న జనం

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల ఆత్మకూరుకు చెందిన ఓ వార్డు మెంబర్‌ వైఎస్సార్‌సీపీలో చేరాడు. ఈ క్రమంలోనే అదే రోజు సాయంత్రం సదరు వ్యక్తి ఇంటి వద్దకు బాలాజీ వెళ్లాడు. ఏదో చెప్పి టీడీపీ కండువా వేసి వచ్చారు. కానీ ఆ వార్డు మెంబర్‌ మాత్రం టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలు, సమావేశాలకు హాజరవుతున్నారు.

ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి వద్దకు ఈ నెల 15న టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత సోదరుడు బాలాజీ వెళ్లాడు. ఏదో మాట్లాడుతూనే అతనికి బలవంతంగా టీడీపీ కండువా కప్పారు. వారు గడప దాటిన మరుక్షణమే సదరు వ్యక్తి టీడీపీ కండువా పక్కకు పడేశాడు. అతని కుమారుడు ఆ కండువాకు చెప్పు చూపించడమే కాకుండా నిప్పు పెట్టాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది.

కొన్ని రోజుల క్రితం ఆత్మకూరుకు చెందిన నాయీ బ్రాహ్మణులు, కురుబ కులస్తులు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. దీన్ని జీర్ణించుకోని టీడీపీ నాయకులు అదే రోజు రాత్రి వారి ఇళ్ల వద్దకు వెళ్లారు.అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ నమ్మబలికి టీడీపీ కండువాలు వేశారు.

అనంతపురం: ఎమ్మెల్యే, మంత్రి పదవులను అనుభవించినా రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధికి పరిటాల కుటుంబీకులు చేసిన కృషి శూన్యం. పైగా, నమ్మి ఓట్లేసిన పాపానికి ప్రజల్నే వేధించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అధికారం మాటున వందల కోట్లు వెనకేసుకున్నారు. వారి ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా, బుద్ధి నేర్వని వారు మళ్లీ నేడు ఎన్నికలు వచ్చాయని ప్రజల్లోకి వెళ్తూ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు.

పచ్చటి పల్లెల్లో చిచ్చు..
ప్రచారం పేరుతో గ్రామాల్లోకి వెళ్తున్న పరిటాల కుటుంబీకులు ఆ మాటున యథేచ్ఛగా ప్రలోభాలకు దిగుతున్నారు. అధికారంలోకి రావడానికి ఏం చేయడానికైనా రెడీ అంటూ హల్‌చల్‌ చేస్తున్నారు. సామాన్య ప్రజలు, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్ల దగ్గరకు వెళ్లి తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. ఏ పని కావాలన్నా చేసి పెడతాం లేదా డబ్బు ఎంత కావాలన్నా ఇస్తాం అంటూ ఎర వేస్తున్నారు. పైగా గ్రామీణులను కులాల పేరిట విడగొట్టి సమావేశాలు నిర్వహిస్తూ ఆఫర్లు ఇస్తున్నారు. రాత్రి సమయాల్లో ఒక్కో రోజు ఒక్కో వర్గం వారిని కలుస్తూ ఏ కులంలో ఎంత మంది ఉన్నారంటూ తెలుసుకొని డబ్బు ముట్టజెబుతూ వల వేస్తున్నారు. ఓట్ల కోసం పచ్చటి పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు మళ్లీ బీజం వేస్తున్నారు.

సొంత పార్టీ నాయకులకూ తాయిలాలు..
పరిటాల కుటుంబం సొంత పార్టీ కేడర్‌ను కూడా నమ్మడం లేదు. వారికి కూడా తాయిలాల ఎర వేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారం చేస్తే ఆ రోజంతా ప్రచారంలో పాల్గొనే వారికి మందు, ఖర్చులకు డబ్బుతో పాటు రవాణా ఖర్చులకు కూడా ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌ సీపీ వారిని, ఆ పార్టీ సానుభూతిపరులను టీడీపీలో చేర్పించి ఎంత కావాలన్నా తీసుకోండి అంటూ కమీషన్లు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామాల్లో టీడీపీకి చెందిన వారినే సునీత, శ్రీరాం దగ్గరకు తీసుకెళ్లి పార్టీ కండువాలు వేయిస్తూ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

బయటకొచ్చాక పారవేస్తున్నారు..
భయపెట్టో, ప్రలోభ పెట్టో తమ వైపు జనాన్ని తిప్పుకోవాలన్న పరిటాల కుటుంబ పాచికలు ఏ మాత్రమూ పారడం లేదు. టీడీపీ కండువాలు కప్పుకున్న వారు బయటకు వచ్చాక వాటిని అక్కడే పడేసి వెళ్లిపోతున్నారు. తమ ఇంటికే వచ్చి పార్టీ కండువాలు వేసి వెళ్లాక వాటిని పారవేస్తున్నారు. కొంతమందైతే తగులబెడుతున్నారు. ఎన్ని రకాలుగా వల పన్నుతున్నా ప్రజలు లొంగకపోవడం చూసి పరిటాల సునీత డీలా పడినట్లు తెలుస్తోంది.

ఓడిపోతామన్న భయంతోనే..
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాయి. రూపాయి కూడా లంచం తీసుకోకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధి చేకూర్చారు. ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే ప్రజలకు రూ. వేల కోట్లు ప్రభుత్వం అందించింది. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని నెలల్లోనే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి పేరూరు డ్యాంను నీటితో నింపారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. రూ. వేల కోట్లతో నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో ప్రజలు ఈ సారి కూడా వైఎస్సార్‌ సీపీకి జై కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వెళ్తున్న తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇదంతా గమనించి మళ్లీ ఓటమి తప్పదని గుర్తించిన పరిటాల సునీత ఎలాగైనా, ఏం చేసైనా ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. బలవంతంగా టీడీపీ కండువాలు కప్పుతూ అపహాస్యం పాలవుతున్నారు. అంతా గమనిస్తున్న ప్రజలు లోలోనే నవ్వుకుంటున్నారు.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250