Sakshi News home page

adsolute video ad after first para

వేమిరెడ్డికి ఎన్నికలకు ముందే షాకులు..!

Published Fri, Mar 29 2024 12:35 AM

- - Sakshi

తీవ్ర అంతర్మథనంలో వేమిరెడ్డి

వెంటాడుతున్న ఓటమి భయం

ప్రచారాల్లో స్వపక్షం నుంచే నిరసనలు

ఆత్మీయ సభల్లోనూ అవమానాలు

ఖర్చుల పేరుతో పీక్కుతింటున్న నేతలు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వెంటాడుతున్న ఓటమి భయం.. స్వపక్షం నుంచే ఎదురవుతున్న నిరసనలు.. ఖర్చు పేరిట పీల్చిపిప్పి చేస్తున్న నేతలు.. ఇలా వరుస షాకులతో టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఎన్నికలకు ముందే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలతో ఏ మాత్రం సంబంధంలేని ఆయన ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట డబ్బులిచ్చి జనాలను తరలిస్తున్నా, అభ్యర్థులు మాట్లాడే సమయానికి వీరు నిష్క్రమిస్తుండటంతో పుండుమీద కారం జల్లిన పరిస్థితి వేమిరెడ్డికి ఏర్పడింది.

టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజకీయ పరిస్థితి ఓ అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అనే రీతిలో సాగుతోంది. ప్రచారానికి వెళ్తున్న వేమిరెడ్డి దంపతులకు స్వపక్ష నేతల నుంచే అవమానాలు, నిరసనలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో టీడీపీ గ్రాఫ్‌ మెరుగుపడకపోవడం.. పైగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవనే సంకేతాల తరుణంలో కీలక నేతలుగా ప్రచారం చేసుకుంటూ అందిన కాడికి గుంజాలనే ఉద్దేశంతో కొందరు ఆయన చుట్టూ కోటరీగా ఏర్పడ్డారు.

వలసలను ప్రోత్సహిస్తున్నా పెరగని ప్రజాదరణ
భారీ ప్యాకేజీలతో టీడీపీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ప్రజాదరణ ఏ మాత్రం పెరగడంలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కట్టబెట్టిన అత్యుత్తమ పదవులతో పాటు గౌరవ మర్యాదలు పొందిన వీరి పరిస్థితి ప్రస్తుతం ఒక్కసారిగా తిరగబడింది. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పట్టుబట్టి టీడీపీ కోవూరు అభ్యర్థిగా తన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరును ఖరారు చేయించారు. వాస్తవానికి ఏళ్ల పాటు కష్టించి తానే అభ్యర్థినని విస్తృత ప్రచారం చేసిన పోలంరెడ్డి దినేష్‌రెడ్డికి ఈ పరిస్థితి మింగుడుపడలేదు. తనను పక్కనబెట్టడాన్ని జీర్ణించుకోలేని దినేష్‌ తనదైన శైలిలో రాజకీయాలకు తెరలేపారు.

వెన్నంటే ఉంటూ నిరసనలకు సై..
వేమిరెడ్డి వెన్నంటే దినేష్‌రెడ్డి ఉంటూ తెరచాటు రాజకీయాలు చేస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది. అధిష్టాన ఆదేశాలతో పార్టీ కోసం పనిచేస్తూ.. ప్రశాంతక్కను గెలిపించుకుందామంటూ మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్న దినేష్‌.. పరోక్షంగా వారికి నిరసన సెగ చూపేలా కేడర్‌ను సమాయత్తపరుస్తున్నారని సమాచారం. ఇందుకూరుపేట మండలానికి ఆదివారం ఆమె వెళ్లగా, టీడీపీ వర్గీయులు భారీగా గుమిగూడి గో బ్యాక్‌.. ప్రశాంతి.. డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపు నిరీక్షించినా పరిస్థితి సద్దుమణగకపోవడంతో ఆమె వెనుదిరిగారు.

ఇదే సమయంలో దినేష్‌రెడ్డి నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినదించడం.. అనంతరం తన వర్గంతో కలిసి వెళ్లి ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిర్వహించడాన్ని దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. ఆత్మీయ సమావేశాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో ప్రశాంతిరెడ్డికి వెన్నుపోటు తప్పదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

ఆగండయ్యా..!
కోవూరులోని నెల్లూరు గ్రాండ్‌ హోటల్‌, బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజా వద్ద వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాలను నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతుండగానే, సభ నుంచి వెళ్లేందుకు కేడర్‌ సన్నద్ధమయ్యారు. ఎక్కడికెళ్తున్నారు.. ఆగండి అని వేమిరెడ్డి వేడుకున్నా పట్టించుకోకుండా అందరూ బయల్దేరారు.

ఖర్చులంటూ ఒత్తిడి
నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల కోసం వేమిరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. వేమిరెడ్డి నివాసంలో నాలుగు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు వారు డిమాండ్‌ చేశారని తెలిసింది. ఇంకా నామినేషన్ల పర్వమే ప్రారంభం కాలేదు.. అప్పుడే డబ్బులేంటి.. తర్వాత చూద్దామని ఆయన చెప్పారని సమాచారం.

ఇవి చదవండి: కూటమిలో వేరు కుంపట్లు

Advertisement

adsolute_video_ad

homepage_300x250