Sakshi News home page

అమేథీ నుంచి బరిలోకి.. రాహుల్‌ గాంధీ ఏమన్నారంటే!

Published Wed, Apr 17 2024 3:37 PM

Rahul Gandhi Soldier Reply Amid Suspense Over Amethi Fight - Sakshi

దేశంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ వేడి నెలకొంది. నువ్వా-నేనా అన్నట్లు అధికార ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయి. అభ్యర్ధుల ప్రకటన, ప్రచారాలో పార్టీలో హోరెత్తిస్తున్నాయి.  ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి పోటీపై తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కంచుకోట అయిన అమేథీలోక్‌సభ స్థానానికి హస్తం పార్టీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన రాహుల్‌ గాంధీ బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్‌ మీళ్లీ పోటీ చేస్తారా లేదా అనేది సస్పెన్స్‌ నెలకొంది.

ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశంలో అమేథీలో బీజేపీ నుంచి బరిలో దిగిన స్మృతి ఇరానీపై పోటీకి కాంగ్రెస్‌ నుంచి ఎవరూ నిలబడుతున్నారనే ప్రశ్న రాహుల్‌కు ఎదురైంది. దీనిపై ఆయన మాట్లాడుతూ... తాను పార్టీలో ఓ సైనికుడు మాత్రమేనని తెలిపారు. ఎన్నికల్లో పోటీ నిర్ణయాలు కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ తీసుకుంటుందని అన్నారు. ‘ఇది బీజేపీ ప్రశ్న. చాలా బాగుంది. పార్టీ అధిష్టానం నుంచి వచ్చినా ఏ ఆదేశాన్ని అయినా నేను అనుసరిస్తాను. మా పార్టీలో అభ్యర్థుల ఎంపిక నిర్ణయాలు కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ తీసుకుంటుంది’ అని తెలిపారు.

కాగా ఒకప్పుడు అమేథీ గాంధీ కుటుంబానికి కంచుకోట. గతంలో రాహుల్‌ చిన్నాన్న సంజయ్ గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, ఆ తర్వాత తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో రాహుల్‌ హాట్రిక్‌ విజయం సాధించారు అయితే  2019 ఎన్నికల్లో ఫలితాలు తారుమరయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి పోటీకి దిగిన రాహుల్‌పై బీజేపీ నుంచి స్మృతి ఇరానీ గెలుపొందారు. అయితే కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్‌ అక్కడ గెలిచి.. పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

ప్రస్తుత ఎన్నికల్లో వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.మరోవైపు దమ్ముంటే అమేథీ నుంచి పోటీ చేయాలంటూ రాహుల్‌కు స్మృతి ఇరానీ సవాల్‌ విసురుతున్నారు.ఇక కాంగ్రెస్‌ కంచుకోటలో ఎవరూ బరిలో దిగుతారో? మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
 

Advertisement

homepage_300x250