Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

కర్ణాటకలో మాదిరిగానే దగా

Published Wed, Apr 10 2024 5:40 AM

Kishan Reddy fire on Congress party - Sakshi

కాంగ్రెస్‌ పార్టీపై కిషన్‌రెడ్డి ఫైర్‌ 

హామీలు అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు 

మరోసారి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధం 

బీజేపీలో చేరిన జహీరాబాద్, నల్లగొండ నేతలు, కార్యకర్తలు 

సికింద్రాబాద్‌ ప్రచార రథాలను ప్రారంభించిన కేంద్రమంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలోనూ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన ఏ హామీనీ అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని, నిధుల సమీకరణ ఎజెండా కూడా కాంగ్రెస్‌ వద్ద లేదని అన్నారు. దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు తయారైందని విమర్శించారు. పరిపాలనలో, దోపిడీలో మార్పురాలేదని, ప్రజలను వెన్నుపోటు పొడవడంలో మార్పు రాలేదని ధ్వజమెత్తారు.

ఎంపీ బీబీ పాటిల్‌ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆంజనేయులు, జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే పండరి, జెడ్పీటీసీ రాజు రాథోడ్, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నల్లగొండ జిల్లాకు చెందిన రామరాజు, ఇతర నాయకులు మంగళవారం బీజేపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి వారికి బీజేపీ కండువాలు కప్పి ఆహా్వనం పలికారు. ఉగాది రోజున పలువురు నాయకులు, కార్యకర్తలు, బీసీ, అంబేడ్కర్‌ సంఘాల ప్రతినిధులు బీజేపీలో చేరడం శుభసూచకమని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండూ దొందూ దొందే 
రాష్ట్రంలో కేవలం ఒక పార్టీ పోయి మరో పార్టీ అధికారంలోకి వచ్చిందని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండూ దొందూ దొందేనని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల తుక్కుగూడ సభలో రాహుల్‌గాంధీ పాత గ్యారంటీల గురించి మాట్లాడకుండా, ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా.. కొత్త హామీలు ఇచ్చిపోయారని విమర్శించారు. రాహుల్‌గాంధీ వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి ప్రజలను వెన్నుపోటు పొడిచారని, తాజాగా పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. అయితే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని కాంగ్రెస్‌ని నమ్మే పరిస్థితిలో లేదని కిషన్‌రెడ్డి చెప్పారు.  

ఆర్‌జీ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు 
కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజల నుంచి ఆర్‌జీ ట్యాక్స్‌ (రా హుల్‌గాంధీ ట్యాక్స్‌) వసూలు చేస్తోందని, బిల్డర్లు, కాంట్రాక్టర్లను ఎవ్వరినీ వదలడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలో 25 ఎంపీ సీట్లలో బీజేపీ గెలవబోతోందని, తెలంగాణలో కూడా ప్రజలు మోదీకి అండగా నిలబడి 17 సీట్లలో విజయాన్ని అందించాలని కోరారు.  

రేవంత్‌కు కాంగ్రెస్‌ నుంచే ప్రమాదం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ కాంగ్రెస్‌ నుంచే ప్రమాదం పొంచి ఉందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సికింద్రాబాద్‌ పార్టీ ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తనను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, అయితే ఆయనకు బీజేపీతో ఎలాంటి అపాయం లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వానికి తామెలాంటి అంతరాయం కలిగించబోమని అన్నారు. సీఎంకు ఏదైనా ప్రమాదం ఉందంటే అది కాంగ్రెస్‌ వారి నుంచే అని ఆయన గుర్తించాలని సూచించారు.

తాము బహిరంగంగానే ప్రజల మద్దతు కూడగట్టి కాంగ్రెస్‌ను ఓడిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక సంఖ్యలో ఎంపీ సీట్లను గెలుచుకుంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు సభల్లో పాల్గొన్నారని, భవిష్యత్తులో మరిన్ని సభల్లో పాల్గొంటారని తెలిపారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు సైతం ఇప్పటికే మండల స్థాయి వరకు ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పారు.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250