Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఆరు గ్యారంటీలపై చర్చకు సిద్ధమా?

Published Thu, Apr 4 2024 4:12 AM

Harish Rao challenge to ministers - Sakshi

మంత్రులకు హరీశ్‌రావు సవాల్‌  

బీఆర్‌ఎస్‌ను వీడిన నేతలు పోటీలో 4వ స్థానంలో ఉంటారు 

బీఆర్‌ఎస్‌ శ్రేణుల సమావేశంలో మాజీ మంత్రి వ్యాఖ్యలు 

సాక్షి యాదాద్రి: ఆరు గ్యారంటీలపై మంత్రులు చర్చకు సిద్ధంగా ఉన్నారా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్‌ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందని, ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బుధవారం భువనగిరిలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు.

ప్రభుత్వంలోని పెద్దలు పాలనను పక్కనబెట్టి బీఆర్‌ఎస్‌ నాయకులకు కాంగ్రెస్‌ కండువాలు కప్పే పనిలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, కడియం కావ్య, రంజిత్‌రెడ్డి, పట్నం సునీత నాలుగో స్థానంలో ఉంటారని జోస్యం చెప్పారు. పార్టీ మారుతున్న స్వార్థపరులను ఓడించాలని కార్యకర్తలు కసితో ఉన్నారని హరీశ్‌రావు చెప్పారు. 

రాహుల్‌ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘనుడీయన 
భువనగిరి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాహుల్‌ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘనుడని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల కోడ్‌ అడ్డం పెట్టుకుని హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని రేవంత్‌రెడ్డి, ప్రియాంకా గాంధీ ఈ భువనగిరిలోనే హామీ ఇచ్చారని, కానీ అలాంటి హామీనే ఇవ్వలేదని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి చెప్పారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ వైఫల్యాలతో పాటు కాంగ్రెస్‌కు ఓటేస్తే నష్టపోతామన్న విషయం అర్థమయ్యేలా ప్రజలకు వివరించాలని కార్యకర్తలను కోరారు. దేవుడిని అడ్డంపెట్టుకుని బీజేపీ ఓట్లు అడుగుతోందనీ, దేవుడి పేరుతో ఎన్నాళ్లు రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్‌ఎస్‌ ఉంటుందనీ, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్రమ కేసుల గురించి దిగులు చెందవద్దని, కేసుల పరిష్కారానికి తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తున్నామని హరీశ్‌ భరోసానిచ్చారు.

కార్యకర్తలంతా కలిసి నలభై రోజులు కష్టపడితే భువనగిరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ గెలుస్తారని జోస్యం చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250