Sakshi News home page

కూటమి విచ్ఛిన్నం.. ఒంటరిగానే జేజేపీ పోటీ

Published Thu, Mar 28 2024 3:27 PM

Dushyant Chautala JJP will contest all 10 seats in Haryana - Sakshi

Haryana: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని జననాయక్ జనతా పార్టీ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. 

“రాష్ట్రంలోని మొత్తం 10 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని జననాయక్ జనతా పార్టీ పీఏసీ సమావేశంలో నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం” అని చౌతాలా ఏఎన్‌ఐకి చెప్పారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

భారతీయ జనతా పార్టీ-జననాయక్ జనతా పార్టీ (BJP-JJP) కూటమి విచ్ఛిన్నమైన కొన్ని రోజులలోనే జేజేపీ నుంచి ఒంటరి పోటీ నిర్ణయం వచ్చింది. ఈ కూటమి విచ్ఛిన్నం మార్చి 12న మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాకు దారితీసింది. నయాబ్ సింగ్ సైనీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నయాబ్ సైనీ కురుక్షేత్ర నుండి బీజేపీ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆయన పార్టీ రాష్ట్ర చీఫ్‌గా నియమితులయ్యారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హర్యానాలోని మొత్తం 10 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. అయితే ఆప్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన జేజేపీ పోటీ చేసిన 7 స్థానాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కాగా హర్యానాలో 2024 సార్వత్రిక ఎన్నికలు మే 25న ఆరో దశలో జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement

adsolute_video_ad

homepage_300x250