Sakshi News home page

adsolute video ad after first para

sri rama navami 2024: బాలరాముడికి సూర్య తిలకం

Published Thu, Apr 18 2024 6:41 AM

sri rama navami 2024: Surya Tilak emotional moment for me says PM Narendra Modi  - Sakshi

అయోధ్య భవ్యరామమందిరంలో మరో అద్భుతం 

భక్తులను పరవశింపజేసిన అపురూప దృశ్యాలు 

టీవీల్లో వీక్షించిన కోట్లాది మంది జనం  

సూర్య తిలకాన్ని ఆన్‌లైన్‌లో దర్శించుకున్న మోదీ  

అయోధ్య: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య బాలరాముడికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్ది ఆశీస్సులందించాడు. సరిగ్గా నుదుటిన చుంబించి రఘుకుల పురుషోత్తముడి పట్ల ఆతీ్మయత చాటుకున్నాడు. భవ్య రామమందిరంలోని గర్భాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారిగా కనిపించిన ఈ అద్భుత దృశ్యాలను భక్తులు కనులారా తిలకించి పరవశించిపోయారు.

జైశ్రీరామ్‌ అంటూ నినదించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో దర్శించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సూర్యతిలకం ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ సమయంలో గర్భగుడిలో అర్చకులు ప్రత్యేక హారతి ఇచ్చారు. అరుదైన వజ్రాలు, రత్నాలు పొదిగిన కిరీటంతోపాటు ప్రత్యేక ఆభరణాల అలంకరణతో బాలరాముడు మరింత సుందరంగా మెరిసిపోయాడు. ప్రతిఏటా శ్రీరామనవమి సందర్భంగా రాముడికి 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యతిలకం దిద్దేలా ఆలయంలో దర్పణాలు, కటకాల సాయంతో ప్రత్యేక ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

సూర్యతిలకం దృశ్యం 4 నుంచి 5 నిమిషాల పాటు కొనసాగిందని ఆలయ ప్రతినిధి ప్రకాశ్‌ గుప్తా చెప్పారు. సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి విగ్రహం నుదుటి భాగంపైకి ప్రసరించాయని వెల్లడించారు. ఈ సమయంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించలేదని అన్నారు. వారు బయటి నుంచే దర్శించుకున్నారని తెలిపారు. మరోవైపు, అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉత్సవాలు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది దర్శనం కోసం బారులు తీరారు.

భావోద్వేగపూరిత క్షణం: ప్రధాని మోదీ
దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి తనకెంతో ఆనందంగా కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఈ రోజు కోస మే కోట్లాది మంది ఎదురుచూశారని వెల్లడించారు. అస్సాంలోని నల్బారీలో ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని మోదీ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ బాలరాముడి సూర్యతిలకం ఘట్టాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించి, భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని చూసి తరించానని చెప్పారు. కోట్లాది మంది ప్రజల్లాగే తనకు కూడా ఇది భావోద్వేగపూరిత క్షణమని వెల్లడించారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250