Sakshi News home page

adsolute video ad after first para

మండు వేసవిలో చల్లని కబురు.. గుడ్‌ న్యూస్‌ చెప్పిన ‘స్కైమెట్‌’

Published Tue, Apr 9 2024 6:27 PM

Skymet Good News For India About Monsoon - Sakshi

న్యూఢిల్లీ: వేసవిలో ఎండలు దంచి కొడుతున్న వేళ చల్లని కబురు అందింది. ‘స్కైమెట్‌’ సంస్థ ఈ చల్లని కబురు మోసుకువచ్చింది. ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు సమయానికి వస్తాయని తెలిపింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య సాధారణం వర్షపాతం(102శాతం) నమోదవుతుందని వెల్లడించింది. అయితే ఈ అంచనాకు 5శాతం అటూ ఇటు అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలిపింది.

సాధారణంగా రుతపవనాల సీజన్‌లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు లాంగర్‌ పీరియడ్‌ సగటు‌(ఎల్‌పీఏ) వర్షపాతం 868.6మిల్లీమీటర్లు. దీనిలో 96 శాతం నుంచి 104శాతం వరకు వర్షం పడే అవకాశాలుంటే దీనిని సాధారణ వర్షపాతంగా పిలుస్తారు. జనవరిలో విడుదల చేసిన ముందస్తు అంచనాల్లోనూ ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్‌  తెలిపింది.

తాజా అంచనాలపై స్కైమెట్‌ ఎండీ జతిన్‌సింగ్‌ మాట్లాడుతూ‘ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడానికి కారణమైన ఎల్‌నినో పరిస్థితులు వేగంగా లానినాగా  మారుతున్నాయి. సాధారణంగా ఎల్‌నినో, లానినాగా మారుతున్నపుడు రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి. గతంలో లానినా వల్ల కురిసిన వర్షపాతమే ఇందుకు నిదర్శనం. అయితే ఎల్‌నినో ముగింపు దశలో ఉన్నందున రుతుపవనాల ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.

అయితే రుతుపవనాల రెండో దశలో మాత్రం వర్షాలు బాగా కురుస్తాయి. లానినాతో పాటు ఇండియన్‌ ఓషియన్‌ డైపోల్‌(ఐఓడీ) పరిస్థితులు కూడా  ఈసారి సమయానికి రుతుపవనాలు రావడానికి, దేశమంతా వాటి విస్తరణకు దోహదం చేయనుంది. రుతుపవనాల వల్ల దక్షిణ భారతంతో పాటు దేశంలోని పశ్చిమ, నైరుతి ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో సరిపడా వర్షాలు పడతాయి. బిహార్‌, జార్ఖండ్‌, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌ వంటి తూర్పు రాష్ట్రాల్లో మాత్రం జులై, ఆగస్టు నెలల్లో కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్సుంది. ఇక ఈశాన్య భారతంలోనూ జూన్‌, జులై, ఆగస్టుల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి’అని తెలిపారు.

‘స్కైమెట్‌’ ప్రకారం జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వర్షపాతం అంచనాలు..

  • సాధారణం వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు 10 శాతం అవకాశాలున్నాయి(లాంగర్‌ పీరియడ్‌ సగటు(ఎల్‌పీఏ) దాటి 110 శాతం వర్షపాతం )
  • సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు పడేందుకు 20 శాతం అవకాశాలున్నాయి(ఎల్‌పీఏ దాటి 105 శాతం నుంచి 110శాతం మధ్య వర్షపాతం)
  • సాధారణ వర్షపాతం కురిసేందుకు 45 శాతం చాన్స్‌( సరిగ్గా ఎల్‌పీ సగటు 96 శాతం నుంచి 104 శాతం వర్షాలు)
  • సాధారణ కంటే తక్కువ వర్షపాతానికి 15 శాతం చాన్స్‌(ఎల్‌పీ సగటు 104 శాతానికి దిగువ 90 నుంచి 95 శాతం వర్షాలు)  
  • కరువుకు 10 శాతం చాన్స్‌(ఎల్‌పీ సగటులో 90 శాతం వర్షాలు మాత్రమే)

ఈ సీజన్‌లో ‘స్కైమెట్‌’ నెల వారి వర్షపాత అంచనాలు..

  • జూన్‌-ఎల్‌పీఏలో 95 శాతం వర్షపాతం (165.3 మిల్లీమీటర్లు) 
  • జులై-ఎల్‌పీఏలో 105 శాతం వర్షపాతం(280.5మిల్లీమీటర్లు)
  • ఆగస్టు-ఎల్‌పీఏలో 98 శాతం వర్షపాతం(254.9మిల్లీమీటర్లు)
  • సెప్టెంబర్‌-ఎల్‌పీఏలో 110 శాతం వర్షపాతం(167.9మిల్లీమీటర్లు)

‘స్కైమెట్‌’ ఏం చేస్తుంది..?

భారత్‌లో వాతావరణ ముందస్తు అంచనాలు వెల్లడించే ఒకే ఒక ప్రైవేట్‌ సంస్థ స్కైమెట్‌. వ్యవసాయ రంగానికి స్కైమెట్‌ వెల్లడించే వాతావరణ అంచనాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయి. సమీప భవిష్యత్తులో వాతావరణాన్ని బట్టి పంటలు నిర్ణయించుకునే వెసులుబాటు స్కైమెట్‌ ద్వారా రైతులకు లభిస్తోంది. సాటిలైట్‌లు, మానవ రహిత విమానాలు, డ్రోన్లు వాడి రుతుపవనాల రాకకు సంబంధించి ముందస్తు అంచనాలు వెల్లడించడంలో స్కైమెట్‌ పేరుగాంచింది.   

Advertisement

adsolute_video_ad

homepage_300x250