Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Lok Sabha elections 2024: జూన్‌ నుంచి మూడో టర్ము

Published Tue, Feb 27 2024 5:43 AM

Lok Sabha elections 2024: Third term of our govt will start from June - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. జూన్‌ నుంచి తమ మూడో టర్ము పాలన మొదలవుతుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘ఆ తర్వాత సాకారమయ్యే వికసిత భారత్‌ దేశ యువత కలలకు ప్రతిరూపంగా ఉంటుంది. దేశ రూపురేఖలు ఎలా ఉండాలో నిర్ణయించే పూర్తి హక్కులు వారికున్నాయి. వారి కలలే నా సంకల్పం.

నా సంకల్పమే వికసిత భారతానికి హామీ. ఈ నయా భారత్‌లో చిన్న లక్ష్యాలకు చోటు లేదు. పెద్ద పెద్ద కలలు కంటూ వాటి సాకారానికి నిరి్వరామంగా కృషి చేస్తున్నాం. పదేళ్లుగా ఈ వేగం ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది’’ అన్నారు. అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా రూ.41 వేల కోట్లతో తలపెట్టిన 2,000 పై చిలుకు రైల్వే ప్రాజెక్టులకు సోమవారం ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

వీటిలో 27 రాష్ట్రాల పరిధిలో 554 అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి, 1500 రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జి పనులున్నాయి. తెలంగాణలో రూ.230 కోట్లతో 15 అమృత్‌ భారత్‌ స్టేషన్లు, రూ.169 కోట్లతో 17 రైల్‌ ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లకు మోదీ భూమి పూజ చేశారు. రూ.221 కోట్లతో పూర్తయిన 3 రైల్‌ ఫ్లై ఓవర్, 29 రైల్‌ అండర్‌ పాస్‌లను జాతికి అంకితం చేశారు.

కాంగ్రెస్‌ పాలనలో రైల్వే శాఖ రాజకీయ క్రీడలకు వేదికగా కునారిల్లిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. తమ పాలనలో పదేళ్లుగా ఆధునికతను అందిపుచ్చుకుని దూసుకుపోతోందన్నారు. ‘‘కొన్నేళ్లుగా భారత్‌ అన్ని రంగాల్లోనూ శరవేగంగా ప్రగతి సాధిస్తోంది. పన్నుల రూపేణా ప్రజలు చెల్లిస్తున్న ప్రతి రూపాయినీ వారి సంక్షేమానికే వెచి్చస్తున్నాం. గత కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌లను ప్రారంభించా’’ అని చెప్పారు.

టెక్స్‌టైల్‌ రంగ ప్రగతికి సాయం
టెక్స్‌టైల్‌ రంగానికి కేంద్రం అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుందని మోదీ చెప్పారు. ‘‘దేశాభివృద్ధిలో ఆ రంగానిది కీలక పాత్ర వికసిత భారత లక్ష్యసాధనలో టెక్స్‌టైల్‌ రంగం పాత్రను మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నాం’’ అన్నారు. భారత్‌ టెక్స్‌–2024ను మోదీ ప్రారంభించారు.

‘‘వికసిత భారతానికి పేదలు, యువత, రైతులు, మహిళలు నాలుగు స్తంభాలు. వారందరికీ టెక్స్‌టైల్‌ రంగంలో గణనీయమైన పాత్ర ఉంటుంది’’ అని ఈ సందర్భంగా అన్నారు. 2014లో రూ.7 లక్షల కోట్లున్న భారత టెక్స్‌టైల్‌ రంగం విలువ ఇప్పుడు రూ.12 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. నాలుగు రోజుల భారత్‌ ఎక్స్‌పోలో 100కు పైగా దేశాల నుంచి 3,500కు పైగా ఎగ్జిబిటర్లు, 3,000 పై చిలుకు కొనుగోలుదారులు, 40 వేల మందికి పైగా వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటున్నారు.  

Advertisement

Copy Button

 

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250