
భూ వివాదంలో వ్యక్తి దారుణ హత్య
భూపాలపల్లి: భూవివాదంలో భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫక్కీర్‌గడ్డ(ఆకుదారివాడ)కు చెందిన 15వ వార్డు తాజా మాజీ వార్డు కౌన్సిలర్ నాగవెల్లి సరళ, ఆమె భర్త, రాజలింగమూర్తి(49) కొన్ని నెలలుగా పట్టణంలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజలింగమూర్తి బుధవారం సాయంత్రం ఫక్కీర్‌గడ్డలోని తన బంధువుల ఇంటికి వెళ్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్దకు వచ్చాడు. అక్కడ టీ తాగి రెడ్డి కాలనీలోని తన ఇంటికి రాత్రి సుమారు 7 గంటలకు వెళ్తున్న క్రమంలో హత్యకు గురయ్యాడు. దుండగులు మొఖం, పొట్ట భాగంలో కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో పేగులు బయటపడ్డాయి. ఈ హత్యలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలిసింది. జిల్లాకేంద్రంలోని ఓ భూ వివాదంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి రాస్తారోకో చేపట్టారు. నిందితులను గుర్తించే వరకు అంత్యక్రియలు నిర్వహించమంటూ రోడ్డుపై బైఠాయించారు. కాగా, తన భర్త హత్య వెనుక స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, స్థానికుల కుట్ర ఉందని మృతుడి భార్య సరళ ఆరోపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment