కులగణనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
వరంగల్: కులగణనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వరంగల్‌కు వచ్చిన ఆయన ఓసిటీలోని ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఇంట్లో మీడియాతో మాట్లాడారు. కులగణన రీసర్వే చేస్తామనడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రీన్‌ఫీల్డ్ రహదారుల నిర్మాణంలోని భూనిర్వాసితులకు మార్కెట్ ధరల ప్రకారం నష్ట పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలను నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొత్తం బీఆర్‌ఎస్ పాలనను మరిపిస్తోందని, ప్రజ లకు, ఉద్యోగులకు సమస్యలపై పోరాటం చేసే వారికోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజల పక్షాన ఉంటూ సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈటల పిలుపునిచ్చారు.
సీపీఎస్ రద్దు చేసేందుకు కృషి..
నల్లగొండ ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తంరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. తాను సీపీఎస్ రద్దు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ సహకారంతో పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, నాయకులు ప్రదీప్ రావు, గంట రవికుమార్, రావు పద్మ, సతీష్‌షా, బాకం హరిశంకర్, సముద్రాల పరమేశ్వర్, మార్టిన్ లూధర్, రఘునారెడ్డి పాల్గొన్నారు.
కేయూ, వివిధ కళాశాలల్లో ప్రచారం
కేయూ క్యాంపస్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అభ్యర్థి పులి సరోత్తంరెడ్డితో కలిసి ఈటల రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ, నగరంలోని పలు కళాశాలలు, పాఠశాలల్లో సందర్శించారు. ఎమ్మెల్సీగా పోటీలో నిలి చిన సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కేడీసీ నూతన భవన నిర్మాణానికి రూ 15కోట్లు మంజూరు చేయాలని పీఎం ఉషా పథకం కింద ప్రతిపాదనలు పంపామని, చొరవ తీసుకొని మంజూరు చేయించాలని ప్రిన్సిపాల్ రాజారెడ్డి.. ఎంపీ ఈటల దృష్టికి తీసుకెళ్లగా, తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment