Sakshi News home page

adsolute video ad after first para

మన చదువుకు కీర్తి కిరీటం!

Published Fri, Apr 12 2024 12:21 AM

Sakshi Editorial On Higher education Government of Andhra Pradesh

అంతర్జాతీయంగా మన ఉన్నత విద్యారంగం వెలుగులీనుతున్న వైనాన్ని వరసగా మూడో ఏడాది కూడా క్యూఎస్‌ (క్వాక్వరెలీ సైమండ్స్‌) జాబితా నిరూపించింది. బుధవారం ప్రకటించిన ఆ జాబి తాలో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా అభివృద్ధి అధ్యయనాల విభాగంలో 20వ ర్యాంకు సాధించి తనకెవరూ సాటిలేరని నిరూపించింది. వామపక్ష భావజాలం బలంగావున్న విద్యాసంస్థగా ముద్ర వున్న జేఎన్‌యూ ప్రతియేటా విద్యాప్రమాణాల విషయంలో తన సత్తా చాటుతూనే వస్తోంది.

ఇక అహ్మదాబాద్‌ ఐఐఎం 25వ ర్యాంకు, బెంగళూరు, కలకత్తా ఐఐఎంలు 50వ స్థానంలోనూ వున్నాయి. డేటా సైన్స్‌లో, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో గువాహటి ఐఐటీ క్యూఎస్‌ జాబితాలో చోటు సంపాదించుకుంది. పరిశోధనా రంగంలో మన దేశం నాలుగో స్థానంలో వుండటం ఈసారి చెప్పుకోదగిన అంశం. ఈ విషయంలో మనం బ్రిటన్‌ను అధిగమించటం గమనించదగ్గది. ఒకప్పుడు మన పరిశోధనలకు పెద్ద విలువుండేది కాదు. రెండేళ్లుగా ఈ ధోరణి మారడం మంచి పరిణామం. 

క్యూఎస్‌ ర్యాంకుల జాబితా అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైనది. 96 దేశాల్లోని 1,559 విశ్వవిద్యాలయాల తీరుతెన్నులు 55 శాస్త్రాల్లో ఎలావున్నవో అధ్యయనం చేసి ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ఇందుకు క్యూఎస్‌ పెట్టుకున్న కొలమానాలు ఆసక్తికరమైనవి. దేశంలోని విద్యాసంస్థలు వాటిని గమనిస్తే మన విద్యావ్యవస్థ ఎంతోకొంత మెరుగుపడుతుంది. విద్యా విషయక కార్య క్రమాల్లో, పరిశోధనల్లో ఒక విశ్వవిద్యాలయం పనితీరు ఎలావున్నదో అంతర్జాతీయంగా భిన్నరంగాల్లో నిష్ణాతులైనవారి అభిప్రాయాలు తీసుకుంటారు.

అలాగే ఫలానా యూనివర్సిటీనుంచి వచ్చే పట్టభద్రుల్లో నైపుణ్యాలూ, సామర్థ్యమూ ఎలావున్నాయో వివిధ కంపెనీలనూ, సంస్థలనూ అడిగి తెలుసుకుంటారు. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, చదువు విషయంలో విద్యార్థులకు అందుతున్న మద్దతు వగైరాలు ఆరా తీస్తారు. అధ్యాపకుల ప్రమాణాలతోపాటు అధ్యాపకవర్గంలో వైవిధ్యత చూస్తారు. అంతర్జాతీయ నేపథ్యంవున్న అధ్యాపకులు, విద్యార్థులు ఎందరున్నారన్నది లెక్కేస్తారు. శాస్త్ర సాంకేతిక విద్యలో, తత్వశాస్త్ర విద్వత్తులో మన ప్రతిభావ్యుత్పత్తులు సాటిలేనివన్న ఖ్యాతి వుండేది.

ఐటీరంగంలో మనవాళ్ల బుద్ధికుశలత వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన దాఖ లాలు కనబడుతూనే వున్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్‌ల విషయంలో మన విశ్వవిద్యాల యాలు వెనకబడివుండేవి. ఆ కొలమానాలు, అందుకనుసరించే పద్ధతులు సక్రమంగా వుండవనీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ కొందరు విద్యావేత్తలు అనేవారు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఆ ప్రమాణాలు అందుకోవటం తప్పదు. ఎందుకంటే ప్రపంచం నలుమూలలా వుండే విద్యార్థులు ఉన్నత విద్య కోసం మన గడప తొక్కాలంటే అది తప్పనిసరి.

వివిధ దేశాల్లోని విద్యాసంస్థలందించే విద్య ఎలావున్నదో తులనాత్మక అధ్యయనం చేయటంవల్ల ఎవరు ఏ రంగంలో ముందంజలో వున్నారన్న సమాచారం వెల్లడవుతుంది. అది పై చదువులకెళ్లే విద్యార్థులకు మాత్రమే కాదు... పరిశోధకులకూ ప్రయోజనకారిగా వుంటుంది. అలాగే  అంతర్జాతీయంగా ఎవరి భాగస్వామ్యం పొందితే మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు మెరుగుపడతాయో విధాన నిర్ణేతలు నిర్ధారించుకుంటారు. అయితే సంపన్న, వర్ధమాన దేశాల విశ్వవిద్యాలయాల మధ్య పోటీ పెట్టడం ఎంత మాత్రమూ సరైంది కాదన్న వాదనలు ఎప్పటినుంచో వున్నాయి.

పరిశోధనలకూ లేదా పరికల్పనలకూ సంపన్న దేశాల్లో ప్రభుత్వాలనుంచీ, ప్రైవేటు వ్యక్తులనుంచీ నిధుల రూపంలో అందే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇక్కడ అది చాలా అరుదు. మన విశ్వవిద్యాలయాలు వెనకబడి వుండటానికి అదొక కారణం. ఇక ఇతర విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుకోవాలి. మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని తొలి యూపీఏ ఏలుబడిలో 2005లో దోహాలో జరిగిన డబ్ల్యూటీఓ–గాట్స్‌ సంభాషణల్లో సూత్రప్రాయంగా అంగీకరించిన పర్యవసానంగా ఇతర రంగాలతోపాటు విద్య కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. విదేశీ వర్సిటీలకు మన దేశం తలుపులు తెరిచింది.

2017లో నైరోబీలో జరిగిన డబ్ల్యూటీఓ సమావేశంలో ఎన్‌డీఏ సర్కారు సంతకం చేశాక 62 ఉన్నత విద్యాసంస్థలకు ‘ఆర్థిక స్వయంప్రతిపత్తి’ మొదలైంది. ఇది పరిమిత స్థాయిలోనైనా ప్రభుత్వ రంగ ఉన్నత విద్యా సంస్థలను ప్రైవేటీకరించటమే. పర్యవసానంగా ఉన్నత విద్యను అందుకోవటం నిరుపేద వర్గాలకు కష్టమవుతోంది. దానికితోడు అధ్యాపక నియామకాల్లోనూ, మౌలిక సదుపాయాలు కల్పించటంలోనూ ప్రభుత్వాలనుంచి మద్దతు కొరవడుతోంది. ఏతావాతా చాలా విశ్వవిద్యాలయాలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. ఇప్పుడు ఉన్నత శ్రేణి ర్యాంకులు పొందిన విద్యాసంస్థలకు దీటుగా ఇతర సంస్థలను కూడా తీర్చిదిద్దకపోతే, అన్ని వర్గాలకూ అందుబాటులోకి రాకపోతే ‘స్కిల్‌ ఇండియా’ వంటివి నినాదప్రాయమవుతాయని పాలకులు గుర్తించాలి.

ఉన్నత విద్యను అందుకోవాలనుకునే పేద వర్గాల పిల్లలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం కల్పిస్తోంది. ఈ విధానం కింద దేశంలోనే కాదు... అంతర్జాతీయ అగ్రశ్రేణి సంస్థల్లో సీటు సంపాదించుకునేవారికి సైతం భారీ మొత్తాల్లో ఫీజులు చెల్లించటానికి సిద్ధపడుతోంది. వారు చదువుకునే కాలంలో అయ్యే వ్యక్తిగత ఖర్చు కూడా భరిస్తోంది. ఈ మాదిరి విధానం ఇతర రాష్ట్రాల్లో లేదు. క్యూఎస్‌ ర్యాంకుల జాబితా ఇలాంటి అంశాలపై పాలకులు దృష్టి సారించేలా చేయగలిగితే, లోపాలను సరిదిద్దగలిగితే అది మన విద్యా, వైజ్ఞానిక రంగాలను అత్యున్నత స్థాయికి చేరుస్తుంది.  

Advertisement

adsolute_video_ad

homepage_300x250