Sakshi News home page

adsolute video ad after first para

వైఎస్సార్‌ సీపీకి ఎమ్మార్పీఎస్‌ సంపూర్ణ మద్దతు

Published Thu, May 2 2024 3:25 PM

వైఎస్సార్‌ సీపీకి ఎమ్మార్పీఎస్‌ సంపూర్ణ మద్దతు

కాకినాడ రూరల్‌: రాష్ట్రంలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి సంపూర్ణ మద్దతును ఇస్తుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్జీ వర్గాలు వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని పిలుపు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెత్తందారులు, పెట్టుబడి వర్గాలకు వ్యతిరేకంగా పేద వర్గాల అభ్యున్నతి కోసం జగన్‌ కృషి చేశారన్నారు. దాదాపు 30 ఏళ్లుగా సీఎంలను చూస్తున్నామని, ఈ ఐదేళ్లలో నా వల్ల మంచి జరిగితే ఓటు వేయమని కోరుతున్న దమ్మున్న నాయకుడు జగన్‌ అన్నారు. రాష్ట్రంలో పేదల కుటుంబాలకు మంచి జరిగిందన్నారు. జగన్‌ను గెలిపించాలనడానికి కారణం ఆయన మాట ఇస్తే నిలబడే వ్యక్తి అన్నారు. ఆయన మాట తప్పరన్నారు. మిగిలిన నాయకులు మాట తప్పారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేపడతామని బీజేపీ మాట్లాడి, అధికారంలోకి వచ్చిన పదేళ్లు గడుస్తున్నా..పార్లమెంట్‌లో ప్రస్తావించకుండా మభ్యపెడుతోందన్నారు. పదేళ్ళ కాలంలో అనేక బిల్లులు ప్రవేశపెట్టుకుని వర్గీకరణకు చట్టం చేయకుండా సుప్రీంకోర్టుకు తోసేసిందన్నారు. 2014లో డబ్బుకొట్టి, చెప్పుకుట్టి నేనే పెద్ద మాదిగ అవుతానని మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలు మీటింగ్‌లు పెట్టుకోకుండా అడ్డుకోవడమే కాకుండా కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మంద కృష్ణ ఎన్‌డీఏ గెలుపు మాదిగల గెలుపు అని, చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపు అని మభ్య పెడుతున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రంపై యుద్ధమే అని చెప్పిన మంద కృష్ణ ఈ రోజు ఎందుకు బీజేపీ, నరేంద్రమోదీ కౌగిలిలోకి దూరారో చెప్పాలన్నారు. ఆరోజు చంద్రబాబు మోసగాడని చెప్పిన మంద కృష్ణ ఇప్పుడు ఆయనకు వత్తాసు పలుకుతున్నారన్నారు. చంద్రబాబు, ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు కాదన్నారు. జగన్‌ గెలిపించుకునేందుకు అందరూ కృషి చేయాలని, కాకినాడ జిల్లాలో వైఎస్సార్‌ సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్‌, ఎమ్మెల్యే అభ్యర్థులు కన్నబాబు, గీత తదితరులను గెలుపించుకోవాలన్నారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కో కన్వీనరు కొల్లూరి నాని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ము చినబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిక చక్రం, సవరపు నాగరాజు, కొమ్మురి గరటయ్య, బీఎన్‌ సుధాకర్‌, పలివెల విజయ్‌కుమార్‌, ఇప్పర్తి రత్న కుమార్‌ పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య

Advertisement

adsolute_video_ad

homepage_300x250