Sakshi News home page

adsolute video ad after first para

సీఎం వైఎస్‌ జగన్‌పై దాడి: అది ముమ్మాటికీ హత్యాయత్నమే.. 

Published Fri, Apr 19 2024 5:41 AM

Satish Arrested in CM Jagan Stone Incident - Sakshi

తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పే.. కోర్టుకు వివరించిన ఏపీపీ  

పోలీసు దర్యాప్తు నివేదికతో ఏకీభవించిన న్యాయస్థానం 

నిందితుడికి 14 రోజుల రిమాండ్‌.. నెల్లూరు సబ్‌జైలుకు తరలింపు 

కనుబోమపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పే 

న్యాయస్థానానికి వివరించిన ఏపీపీ  

పోలీసు దర్యాప్తు నివేదికతో ఏకీభవించిన న్యాయస్థానం 

నిందితుడికి 14 రోజుల రిమాండ్‌.. నెల్లూరు సబ్‌జైలుకు తరలింపు 

కేసును పక్కదారి పట్టించేందుకు డిఫెన్స్‌ న్యాయవాది వాదనలు 

వాటిని సమర్థంగా తిప్పికొట్టిన ఏపీపీ

సాక్షి ప్రతినిధి, విజయవాడ : సీఎం వైఎస్‌ జగన్‌పై నిందితుడు విసిరిన పదునైన సిమెంట్‌ కాంక్రీట్‌ రాయి కనుబొమపై కాకుండా ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో తేల్చిచెప్పారు. ఈ విషయం నిర్ధారణ అయినందునే ఐపీసీ 307 కింద హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొనడంతో అందుకు న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో నిందితుడు వేముల సతీశ్‌కుమార్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం పోలీసులు అతనిని నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు.

అంతకుముందు.. ఈ కేసులో నిందితుడిని విజయవాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్, మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదనలు వాడివేడీగా సాగాయి. హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు నిందితుడి తరఫు న్యాయవాది ప్రయత్నించగా.. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కిశోర్‌ ఆ వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. టీడీపీ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన వీడియోల ఆధారంగా నిందితుడి తరఫు న్యాయవాది వాదించడం గమనార్హం. ముఖ్యమంత్రికి రాయిదెబ్బ తగలలేదని.. గజమాల ఇనుప వైర్‌ గీసుకుని గాయమైందని.. పైగా, ఈ దాడికి పాల్పడాలని నిందితుడు సతీశ్‌ను ఎవరూ ప్రేరేపించలేదని వాదించారు.

కానీ, ఈ వాదనలను ఏపీపీ కిశోర్‌ తిప్పికొట్టారు. పోలీసుల రిమాండ్‌ నివేదికలో పేర్కొన్న అంశాలను ఉటంకిస్తూ పక్కా కుట్రతోనే సీఎం వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు తగిలిన గాయాల తీవ్రతపై ప్రభుత్వాసుపత్రి అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. నిందితుడు హత్యాయత్నానికి ఉపయోగించిన పదునైన సిమెంట్‌ కాంక్రీట్‌ రాయి సీఎం జగన్‌ కనుబోమపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని నిర్ధారణ అయినందునే ఈ దుర్ఘటనను హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వివరించారు.  

కుట్రదారుల ప్రేరేపణతోనే.. 
గతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కేదర్‌యాదవ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఏపీపీ ఈ సందర్భంగా ఉదహరించారు. కొందరు కుట్రదారుల ప్రేరేపించడంతోనే నిందితుడు వేముల సతీశ్‌ సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైందన్నారు. నిందితుడు సతీష్‌ మైనర్‌ అని అతని తరఫు న్యాయవాది వాదనను ఏపీపీ కిశోర్‌ తప్పని నిరూపించారు. పోలీసులు ముందుగానే నిందితుడు సతీ‹Ùకు కార్పొరేషన్‌ జారీచేసిన జనన ధృవీకరణ పత్రాన్ని న్యాయస్థానానికి సమర్పించారు.

దాని ఆధారంగా నిందితుడికి 19 ఏళ్లు ఉన్నట్లుగా తేలిపోయింది. దీంతో న్యాయస్థానం సతీశ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం.. భద్రతా కారణాల దృష్ట్యా అతనిని పోలీసులు నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకుగాను నిందితుడు సతీశ్‌ను పోలీస్‌ కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. 

Advertisement

adsolute_video_ad

homepage_300x250