
వైద్యులు అలసత్వం వీడాలి
● పీహెచ్‌సీల్లో ఎందుకు అందుబాటులో ఉండటం లేదు? ● రాత్రి వేళల్లో కచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశం ● వరుస సమీక్షల్లో కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది సమయపాలనలో నిర్లక్ష్యం వీడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో పలు శాఖలతో వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో 24 గంటల పాటు పనిచేసే పీహెచ్‌సీల్లో రాత్రి వేళల్లో సిబ్బంది ఎందుకు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పీహెచ్‌సీల్లో ఓపి ఎంత ? ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ సేవలు అందించే విధానం ను పీహెచ్‌సీల వారీగా మెడికల్ ఆఫీసర్‌లతో నిత్యం సమీక్షిస్తామన్నారు. ఎన్‌సీడీ సర్వే కొన్ని పీహెచ్‌సీలలో వేగంగా జరుగుతోందని, ఇంకొన్ని చోట్ల నామమాత్రంగా చేస్తున్నారని మండిపడ్డారు. పీహెచ్‌సీలలో పరికరాల సమగ్ర నివేదికను ఈనెల 21 లోపు అందజేయాలన్నారు. సమీక్షలో డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి, డీసీహెచ్‌ఎస్ ప్రభావతి పాల్గొన్నారు.
మార్చి 2 లోపు సర్వే పూర్తి చేయండి
జిల్లాలో దారిద్య్ర రేఖకు దిగువనున్న వారిని మార్చి 2లోపు గుర్తించి ఆర్థిక సాధికారతకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అట్టడగు స్థాయిలో ఉంటూ జీవించడానికి కనీస సౌకర్యాలు లేని వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు పీ4 విధానాన్ని (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్ షిప్) అవలంబిస్తున్నామన్నారు. దారి ద్య్రరేఖకు దిగువనున్న వారిని గుర్తించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రమాణాలను అనుసరించి నేటి నుంచి మార్చి 2 వరకు సర్వే చేయాలన్నారు. సమీక్షలో సీపీఓ సాంబశివారెడ్డి, డీఎల్‌డీఓ రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment