
ఎన్నికల గౌరవ వేతనం రూ.1.44 కోట్ల విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : గత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది గౌరవ వేతనం రూ.1.44 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందికి కలెక్టరేట్ ఎన్నికల విభాగం త్వరలో జమ చేయనుంది.
సులభ పద్ధతుల్లో బోధన
కార్వేటినగరం : ఉపాధ్యాయులు తమ తరగతి బోధనాంశ ప్రక్రియలో గుర్తించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రణాళిక వేసుకుని, అమలు చేసి వివరాలను రికార్డు చేయడమే యాక్షన్ రీసెర్స్ అని జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపల్ డాక్టర్ శేఖర్ పేర్కొన్నారు. బుధవారం డైట్ ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సులభ పద్ధతిలో అర్థమయ్యే విధంగా బోధన చేపట్టడానికి ఈ శిక్షణ దోహద పడుతుందన్నారు. ఎంపిక చేసిన ఉపాధ్యాయులు డైట్‌లో నిర్వహించే యాక్షన్ రీసెర్చ్‌కు అనుగుణంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఆ అంశాలను విద్యార్థులకు బోఽధించాలని చెప్పారు. కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్‌లు ప్రభాకర్, చెంగల్‌రాజు, సునీత, నిర్మల, దేవప్రసాద్, రఫీ, అనిత, నాగరాజునాయక్, పలువురు ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మోడల్ ఫౌండేషన్ పాఠశాలలు సందర్శించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఉన్న మోడల్ ఫౌండేషన్ పాఠశాలలను సందర్శించాలంటూ ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ వెంకట కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు డీఈఓ కార్యాలయానికి అందాయి. ఆ మేరకు జిల్లాలోని మోడల్ ఫౌండేషన్ పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. ఈసీసీఈ, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యకలాపాల ప్రదర్శన తరగతులను పర్యవేక్షించాలన్నారు. పర్యవేక్షించేందుకు జిల్లాలోని డైట్ అధ్యాపకులను నియమించారు.
రీసర్వేను పారదర్శకంగా నిర్వహించాలి
తవణంపల్లె : రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. బుధవారం సాయంత్రం చెర్లోపల్లెలో రీసర్వేను పర్యవేక్షించారు. సర్వే ఎలా చేస్తున్నారు? ఎప్పటికి పూర్తి చేస్తారని ఆరా తీశారు. పారదర్శకంగా రీసర్వే చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీల గురించి చర్చించారు. తహసీల్దార్ సుధాకర్ రెవెన్యూ సదస్సులో 174 అర్జీలు వచ్చినట్లు వివరించారు. ఇందులో 86 అర్జీలను పరిష్కరించామని మిగిలిన అర్జీలను త్వరలో పరిష్కరిస్తామని వివరించారు. మండల సర్వేయర్ మురళీమోహన్, ఆర్‌ఐ జీవన్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
విలీనబడి కష్టాలు
గంగాధరనెల్లూరు : మా పిల్లలను ఊరిలోని బడికి కాకుండా ప్రభుత్వం మెర్జ్ చేసిన గ్రామానికి దూరంగా ఉన్న మరో పాఠశాలకు పంపలేమని మండల పరిధిలోని కట్టకందపల్లి హరిజనవాడ గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ–1 ఆంజనేయులు శెట్టికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఎస్‌ఎంసీ చైర్మన్ బాబు మాట్లాడుతూ.. కట్టకందపల్లి హరిజనవాడ నుంచి వేపంజేరి గ్రామానికి మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్నందున మా పిల్లలను ఆ పాఠశాలకు పంపలేమని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని పాఠశాలను వేరే పాఠశాలలో కలపడాన్ని తిరస్కరిస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు.

ఎన్నికల గౌరవ వేతనం రూ.1.44 కోట్ల విడుదల
Comments
Please login to add a commentAdd a comment