
పది, ఇంటర్ పరీక్షల్లో పొరపాట్లకు తావివ్వొద్దు
– సమీక్షలో కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ మొదటి , ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తారన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఇంటర్ పరీక్షలకు మొత్తం 30,652 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు ఇందులో మొదటి సంవత్సరం 15,482 మంది (జనరల్– ఒకేషనల్), ద్వితీయ సంవత్సరం 15,170 మంది (జనరల్– ఒకేషనల్) విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా 118 కేంద్రాల్లో రెగ్యులర్ 20,954 మంది, ప్రైవేట్ 294 మంది మొత్తం 21,248 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు చీటింగ్‌కు పాల్పడిన ఎక్జామినేషన్ యాక్ట్ కింద చర్యలు తప్పవని హెచ్చరించారు.
కేంద్రాల వద్ద 144 సెక్షన్....
జిల్లాలో ఇంటర్ , పదో తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్‌ను అమలు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ మోహన్‌కుమార్, ఇంటర్మీడియట్ డీవీఈఓ సయ్యద్ మౌలా, డీఈఓ వరలక్ష్మి, తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment