
ద్రవిడ వర్సిటీ.. ఇన్‌చార్జి పాలన
● పెండింగ్‌లో వీసీ నియామకం ● ముందుకుసాగని అభివృద్ధి పనులు
కుప్పం : కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో 9 నెలలుగా ఇన్‌చార్జి వీసీ, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌లతో పాలనను కొనసాగిస్తున్నారు. దీంతో వర్సిటీలో అభివృద్ధి ముందుకు సాగక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతోంది. కూటమి అధికారంలోకి రాగానే ద్రవిడ వర్సిటీ వీసీగా ఉన్న ఆచార్య కొలకలూరి మధుజ్యోతి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే వర్శిటీ ఇన్‌చార్జి వీసీగా ద్రవిడ వర్సిటీ లైబ్రరియన్ ఆచార్య దొరస్వామిని, కంప్యూటర్ సైన్స్ విభాగంలోని ఆచార్య కిరణ్ కుమార్‌ను ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా నియమించారు. అప్పటి నుంచి ఒక్క ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగకపోవడంతో వర్సిటీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. దీంతో వర్శిటీలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న న్యాక్ గ్రేడింగ్ సైతం ‘బి’ గ్రేడ్‌కే పరిమితం కావడంపై వర్సిటీలో తీవ్ర స్థాయిలో విమర్శలు నెలకొన్నాయి.
ఏడాదిగా జీతాలు అందక ..
న్యాక్ పీర్ టీమ్ సైతం వర్సిటీలో పాలనను మెరుగు పరుచుకోవాలని, ఇక్కడి పాలనపై అసహనం వ్యక్తం చేశారు. అదే రెగ్యులర్ వీసీ నియామకం జరిగి ఉంటే న్యాక్ గ్రేడింగ్ మరోలా ఉండి ఉంటుందని వర్సిటీలో కొంత మంది ఆచార్యులు చెబుతున్నారు. దీంతో పాటు వర్శిటీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంవత్సరానికి పైగా జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. కేవలం 6 నెలల జీతాలను మొదట్లో అందించి చేతులు దులుపుకున్నారు. వీరికి సైతం జీతాలు అందించేందుకు అధికారులు సతమతమవుతున్నారు.
పెండింగ్‌లోనే నియామకం
రాష్ట్రంలో 9కి పైగా వర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించారు. అయితే కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయ వీసీ నియామకం ప్రకటించలేదు. దీంతో వర్సిటీ వీసీ నియామకాన్ని పెండింగ్‌లో పెట్టడంతో వర్సిటీలో అసంతృప్తి నెలకొంది. రెగ్యులర్ వీసీ లేకపోవడంతో ఇన్‌చార్జి పాలనతో బోధనా సిబ్బంది పదోన్నతులు , ఉన్నత విద్యకు సంబంధించిన పలు కార్యక్రమాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment