
పరీక్షలంటే భయం వద్దు
● ఉన్నత విద్యకు ‘పది’ ఫలితాలే పునాది ● తల్లిదండ్రుల నమ్మకాన్ని నిజం చేయాలి ● ఐటీడీఏ పీఓ రాహుల్
అశ్వారావుపేటరూరల్: పదో తరగతి పరీక్షలకు ఇంకా నెల రోజుల సమయం ఉందని, పరీక్షలంటే విద్యార్థుల్లో భయాందోళనలు సహజమని, భయాన్ని వీడాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. బుధవారం అశ్వారావుపేట గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వార్షిక పరీక్షల్లో పాటించాల్సిన మెళకువలు, జాగ్రత్తలపై సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్ పదో తరగతి మార్కులతోనే ఆధారపడి ఉంటుందని, ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రతిరోజూ స్టడీ అవర్స్ నిర్వహించాలని హెచ్‌ఎం భావ్‌సింగ్‌కు సూచించారు. పాఠశాల భవన మైనర్ రిపేర్లు చేయించాలని ఏఈఈ ప్రసాద్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఎస్‌ఓ ఉదయభాస్కర్, ఏటీడీఓ చంద్రమోహన్, ఎస్‌సీఆర్‌పీ రాజబాబు పాల్గొన్నారు.
స్వశక్తితో ఎదగాలి..
ములకలపల్లి: నిరుద్యోగులు ఐక్యంగా కుటీర పరిశ్రమలు స్థాపించి స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని పీఓ రాహుల్ సూచించారు. మండలంలోని పాతగంగారంలో ఏర్పాటు చేసిన గిరిజన సాఽధిక బ్రిక్స్ యూనిట్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నలుగురు బృందంగా ఏర్పడి రూ.15 లక్షల సబ్సిడీతో రూ.25 లక్షల వ్యయంతో బ్రిక్స్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. ఇటుకలను మార్కెటింగ్ చేసి, చక్కటి లాభాలు ఆశించాలని సాధిక బ్రిక్ యూనిట్ సభ్యులకు సూచించారు. ఆయన వెంట టీజీబీ మేనేజర్ నరేశ్, ఫీల్డ్ ఆఫీసర్ సురేశ్ తదితరులు ఉన్నారు.
ప్రాథమిక విద్యే పునాది
దమ్మపేట : ప్రాథమిక విద్యే చిన్నారుల భవితకు పునాదని పీఓ రాహుల్ అన్నారు. మండలంలోని కొడిసెలగూడెం, అంకంపాలెం పాఠశాలలను బుధవారం ఆయన సందర్శించారు. కొడిసెలగూడెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యసన, పఠన, రాత సామర్థ్యాలను పరిశీలించి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వారి పేర్లు కూడా రాయలేని పరిస్థితిలో ఉన్నారని, ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల స్థానంలో వేరే వారిని నియమించాలని ఏటీడీఓ చంద్రమోహన్‌ను ఆదేశించారు. పాఠశాలలపై ఎస్‌సీఆర్‌పీల పర్యవేక్షణ ఉండాలన్నారు. అంకంపాలెం పాఠశాలలో కెరీర్ గైడెన్స్ చార్ట్‌ను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తి సామర్థ్యాలను గుర్తించి, వాటిని పెంపొందించుకునేలా సరైన తోడ్పాటు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శారద, వార్డెన్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment