
విత్తు.. వనమైతే!
ఇళ్లలో విరివిగా పండ్ల వినియోగం
● చెత్త బుట్టల్లోకి చేరుతున్న గింజలు ● అడవుల్లో వెదజల్లితే అందరికీ ‘ఫలాలు’ ● వన్యప్రాణులకూ తీరనున్న ఆహార సమస్య
ఇళ్లలో పండ్లు తిన్న తర్వాత వాటి గింజలను సేకరించి, అడవుల్లో వేయడం ద్వారా అనేక రకాల పండ్ల మొక్కలు అడవుల్లో మళ్లీ చిగురించే అవకాశం ఉంది. తద్వారా అడవుల్లోని జీవరాశులకు సైతం ఆహార కొరత తీరేందుకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా కోతుల వంటివి గ్రామాలపై పడి దాడి చేయకుండా అడవుల్లోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
అగ్ని ప్రమాదాలతో అనర్థం..
అడవుల్లో చెట్లకు కాసే పండ్లను పక్షులు, కోతులు, ఇతర వన్యప్రాణులు తింటాయి. ఈ క్రమంలో ఆయా చెట్ల కాయలు, వాటిలోని గింజలు వేర్వేరు ప్రాంతాల్లో పడుతుంటాయి. ఆ విత్తనాలు భూమిపై పడి వర్షాలు పడగానే తిరిగి మొలకెత్తుతుంటాయి. అయితే అడవుల్లో మానవ సంచారం పెరిగిన తర్వాత తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో అయితే ఈ సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా ఉంది. ఇలా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎండిపోయిన ఆకులకు నిప్పంటుకుని దావానంలా చుట్టు పక్కల ప్రాంతాలకూ మంటలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద చెట్లకు నష్టం కొంతయితే.. అడవిలో నేలపై రాలిపోయిన గింజలు/విత్తనాలు మాడిమసవడం ద్వారా అధిక నష్టం జరుగుతోంది. దీంతో సహజ పద్ధతిలో అడవుల విస్తరణ ఆశించిన మేర పెరగడం లేదు. అటవీ శాఖ నర్సరీల్లో పెంచిన మొక్కలు నాటితేనే అడవులు మనుగడ సాగిస్తున్నాయి.
గింజలు కాపాడితే..
ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జామ, కీరదోస, పుచ్చకాయ, సపోట, మామిడి, దానిమ్మ, బత్తాయి, రేగు, సీతాఫలం, సంత్రాలు తదితర పండ్లతో పాటు యాపిల్, చెర్రీ, బెర్రీ వంటి పండ్లను విరివిగా కొనుగోలు చేసి తింటుంటాం. పండ్లను తిన్న తర్వాత మిగిలిన గింజలను డస్ట్‌బిన్‌లో పడేసి ఆ తర్వాత మున్సిపల్/పంచాయతీ చెత్త కుండీల్లో వేస్తుంటాం. దీంతో ప్రకృతిలో ఎంతో విలువైన విత్తనాలు వృథా అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పండ్లు తిన్న తర్వాత మిగిలే గింజలను నిల్వ చేసి, వేసవిలో ఎండబెట్టడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించొచ్చు.
దృఢంగా పెరుగుతాయి..
సాధారణంగా నర్సరీల్లో అంటు కట్టడం ద్వారా పెంచే మొక్కలంటే విత్తనం ద్వారా అడవిలో మొలకెత్తే చెట్టు బలంగా ఉంటుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. నర్సరీ నుంచి తెచ్చి నాటిన మొక్కకు ట్రీగార్డ్ ఏర్పాటు చేసి, సరిపడా నీరు అందించినప్పుడే అది చెట్టుగా ఎదుగుతుందని, అదే విత్తనం నుంచి వచ్చిన మొక్క అయితే ప్రకృతి అడ్డంకులను ఎదుర్కొని బలంగా పెరుతుందని అంటున్నారు.
పదేళ్లుగా ఇదే పని
ప్రభుత్వ ఉద్యోగం చేసి విరమణ పొందిన తర్వాత అడవుల పెంపకంపైనే దృష్టి పెట్టాను. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వివిధ గింజలను సేకరించడం, ఎండబెట్టడం.. ఆ తర్వాత వాటిని అడవులు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లడం చేస్తుంటాను. వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు అక్కడా ఇదే పని చేస్తుంటా. ఇటీవల కుంభమేళాకు వెళ్లి అక్కడి ప్రజలకు మన దగ్గర దొరికే పండ్ల గింజలు ఇచ్చి వచ్చా. గత పదేళ్లలో నేను చల్లిన ఎన్నో విత్తనాలు ఆ తర్వాత మొక్కలై ఇప్పుడు చెట్లుగా మారాయి. గింజలను వృథాగా చెత్త బుట్టల్లో వేయొద్దు. కొంత సామాజిక బాధ్యతగా ఎండబెట్టి.. వీలున్నప్పుడు ఖాళీ ప్రదేశాలు, అడవుల్లో వేయండి. – హరినాథ్, ప్రకృతి ప్రేమికుడు
ఆ గింజలు అడవుల్లో వేస్తే..
వేసవికాలంలో ఎండబెట్టిన గింజలను రుతుపవనాల సీజన్ ప్రారంభమైన తర్వాత ఇంటి నుంచి వేరే ఊళ్లకు లేదా బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు రోడ్ల పక్కన, బంజరు భూముల్లో, అడవుల్లో, ముళ్ల పొదల్లో, చిట్టడవుల దగ్గర జల్లడం ద్వారా ఆయా గింజలు మొలకెత్తే అవకాశం ఉంటుంది. వంద గింజలు విసరితే కనీసం పది గింజలు మొలకెత్తినా, అందులో ఒకటి మొక్కగా మారి చెట్టయినా ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి, పరోక్షంగా మానవాళికి ఉపయోగకరంగా మారుతుంది.

విత్తు.. వనమైతే!
Comments
Please login to add a commentAdd a comment