
వేళ్లూనుకున్న అవినీతి
ముడుపులు ముట్టజెబితేనే ప్రభుత్వ శాఖల్లో పనులు
● కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్న ప్రజలు ● ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో ఏసీబీకి చిక్కిన 15 మంది ఉద్యోగులు
పాల్వంచరూరల్: అటవీశాఖ ఇల్లెందు డివిజన్‌లో గత మంగళవారం కొమరారం ఎఫ్‌ఆర్‌ఓ, ఎఫ్‌బీఓలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటనతో ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. ముడుపులు ముట్టజెప్పనిదే ఏ ప్రభుత్వ శాఖలోనూ పనులు జరగడం లేదనేందుకు ఈ సంఘటనలే నిదర్శనంగా చెప్పవచ్చు. ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డవారిలో ఎక్కువ మంది భద్రాద్రి జిల్లావారే ఉన్నారు. వారిలోనూ పాల్వంచ ఉద్యోగులు, అధికారులు ఏడుగురు ఉన్నారు.
ఏయే శాఖల్లో ఎవరెవరు పట్టుబడ్డారంటే...?
●గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 15 మంది అధికారులు ఏసీబీకి చిక్కారు. 2024 జనవరి 29న ఖమ్మం టూటౌన్‌లో రూ. 50వేలు లంచం తీసుకుంటున్న హెడ్‌కానిస్టేబుల్ పి.కోటేశ్వరరావును పట్టుకున్నారు.
●ఏప్రిల్ 18న పాల్వంచ మున్సిపల్ సూపరింటెండెంట్ అక్కిరెడ్డి వెంకటరమణి, ఉద్యోగి ప్రసన్నకుమార్ రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
●భద్రాచలం ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు.
●మే 16న అశ్వారావుపేటలో విద్యుత్‌శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ధరావత్ శంకర్ రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
●మే 23న చర్ల డిప్యూటీ తహసీల్దార్ బి.భరణిబాబు రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అదే నెలలో పాల్వంచ పట్టణ ఎస్‌ఐ బాణాల రాము రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
●ఆగస్టు 21న ఆళ్లపల్లి మండల పంచాయతీ అఽధికారి బత్తిని శ్రీనివాసరావు రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
●సెప్టెంబర్ 18న జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.సూర్యనారాయణ రూ.లక్షా 14 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
●పాల్వంచ విద్యుత్ శాఖ లైన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు రూ.26 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
●2025 జనవరి 25న ఇల్లెందులో ప్రభుత్వ మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ బి.కృష్ణ, ఆఫీసు సహాయకుడు కొచ్చెర్ల రామకృష్ణ రూ.2వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. జనవరి 27న సత్తుపల్లిలోని మున్సిపల్ ఉద్యోగి ఎన్.వినోద్ రూ.2500 లంచం తీసుకుని దొరికాడు.
●ఫిబ్రవరి 18న కొమరారం ఫారెస్ట్ ఎఫ్‌ఆర్‌ఓ ఆర్.ఉదయ్‌కుమార్, బీట్‌ఆఫీసర్ ఎన్.హరిలాల్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
నేరం రుజువైతే ఉద్యోగం నుంచి తొలగింపు
ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు అవినీతికి పాల్పడి ఏబీసికి పట్టుబడ్డాక నేరం రుజువైతే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. లంచం పుచ్చుకుంటూ దొరికిన ఉద్యోగులను ఏసీబీ అధికారులు 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. 40 రోజులు జైలులో ఉండాల్సిందే. బెయిల్ కూడా దొరకదు. కోర్టులో నేరం రుజువైతే ఆరేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అవినీతి ఉద్యోగుల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుంది.
కేసుల నమోదు ఇలా..
ప్రభుత్వ ఉద్యోగులు చట్టప్రకారం చేయాల్సిన పనుల విషయంలో లంచం అడగడం, తీసుకోవడం నేరం. సెక్షన్ 7 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉంటే సెక్షన్ 13 (1) ప్రకారం చర్యలు తీసుకుంటారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవకతవకలకు పాల్పడినా, ప్రజాధనం దుర్వినియోగం చేసినా సెక్షన్ 13(1) అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం కేసులు నమోదు చేస్తారు. అక్రమ ఆస్తుల కూడబెట్టడంలో సహకరించిన స్నేహితులు, బంధువులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. అవినీతి అధికారులను పట్టించే విషయంలో భయపడొద్దు. నిర్భయంగా సమాచారం ఇచ్చి సహకరించాలి.
–వై.రమేష్, ఏసీబీ డీఎస్పీ

వేళ్లూనుకున్న అవినీతి
Comments
Please login to add a commentAdd a comment