
దేచవరంలో భూచోళ్లు
నరసరావుపేట: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామంలో చర్మకారుల సహకార సంఘానికి కేటాయించిన భూమి ఆక్రమణకు గురైంది. గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ అధికారుల అండదండలతో ఆన్‌లైన్ చేయించుకొని, నకిలీ రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. దర్జాగా అనుభవిస్తున్న విషయం బయటకు పొక్కడంతో కొన్నాళ్లపాటు మిన్నకుండిపోయారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి సదరు భూమిని ఆక్రమణ చేసుకొని సొంతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా నాలుగు రోజుల కిందట భూమిలో ముళ్లపొదలు తొలగించి తమదిగా నమ్మించే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆర్‌ఎస్‌ఆర్, అడంగల్‌లో స్పష్టంగా నమోదు
1970లో అప్పట్లో ఉన్న ప్రభుత్వం దేచవరం గ్రామంలోని చర్మకారుల సహకార సంఘం కోసం భూమిని కేటాయించే ప్రక్రియ ప్రారంభించింది. గ్రామ పరిధిలోనే రూపెనగుంట్ల గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఆనుకొని సర్వే నంబరు 192–6బి1లో 3.56 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. అందులో ఎకరాన్ని చర్మకారుల సహకార సంఘానికి కేటాయించారు. వివరాలు ప్రసుత్తం కూడా ఆర్‌ఎస్‌ఆర్, అడంగల్‌లో స్పష్టంగా ఉన్నాయి.
ఆక్రమణ రహస్యం బయటకు వచ్చిందిలా...
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ కుటుంబాలకు నివేశనా స్థలాలు మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వ భూమి కోసం అధికారులు రికార్డులు తిరగేశారు. చర్మకారులకు కేటాయించిన భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పేరుపై ఆన్‌లైన్ చేయించుకున్నట్లు తేలింది. దీంతో అసలు విషయాన్ని బయటకు లాగారు. ఆన్‌లైన్ చేయించుక్నున వ్యక్తి తన కుమారుల పేరుపై తప్పుడు రిజస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్లు తేలింది. దీనిపై అప్పట్లో వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆన్‌లైన్ నుంచి పేర్లను తొలగించి చర్మకారుల సొసైటీ పేరు మీదే తిరిగి ఆన్‌లైన్ చేశారు.
ముళ్ల పొదలు తొలగింపు
వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో మిన్నకుండిపోయిన సదరు వ్యక్తి గత నాలుగు రోజులుగా సదరు స్థలాన్ని తిరిగి ఆక్రమణ చేసుకునే పనిలో ఉన్నాడు. సంఘానికి చెందిన భూమిలో ముళ్లపొదలు తొలగించి, కబ్జా చేయాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాడు. తన పేరుపై తిరిగి ఆన్‌లైన్ చేసేందుకు రెవెన్యూ శాఖ ద్వారా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు స్పందించి కబ్జాకు గురవుతున్న స్థలాన్ని ఆక్రమణ చెర నుంచి విడిపించి తప్పుడు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని పలువురు ఎస్సీలు కోరుతున్నారు.
చర్మకారుల సహకార సంఘం భూమి ఆక్రమణ రోడ్డు పక్కనే ఉండడంతో ఆక్రమణదారుల కన్ను పట్టపగలే ముళ్లపొదలు తొలగించి సొంతం చేసుకునే యత్నం గతంలో ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకొని తప్పుడు రిజిస్ట్రేషన్లు
Comments
Please login to add a commentAdd a comment