Sakshi News home page

AP IMD Weather Report: మూడు రోజులు తేలికపాటి వర్షాలు 

Published Wed, Apr 17 2024 5:30 AM

Light rains for three days - Sakshi

రాయలసీమపై ఉపరితల ఆవర్తన ప్రభావం 

కొన్నిచోట్ల 44–46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం 

అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ  

సాక్షి, విశాఖపట్నం: రాయలసీమపై మంగళవారం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజు­లు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ విభా­గం (ఐఎండీ) తెలిపింది.

మరోవైపు వచ్చే మూడు రోజు­లు కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 44నుంచి 46 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల పలు­చోట్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.  

కొవిలంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు 
మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కొవిలంలో 45.4 ఉష్ణోగ్రత రికార్డయింది. తుమ్మి­కపల్లి (విజయనగరం)లో 45.2, రావికమ­తం (అనకాపల్లి)లో 45.1, మక్కువ (పార్వతీపురం మన్యం)లో 44.4, గోస్పాడు (నంద్యాల)లో 44.3 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. 88 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 89 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.

కాగా.. బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 175 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళం జిల్లాలో 12, విజయనగరం 18, పార్వతీపురం మన్యం 12, విశాఖపట్నం 2, అనకాపల్లి 2, కాకినాడ 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, శ్రీకాకుళం జిల్లాలో 11, విజయనగరం 6, పార్వతీపురం మన్యం 3, అల్లూరి సీతారామరాజు 12, విశాఖపట్నం 3, అనకాపల్లి 15, కాకినాడ 15, కోనసీమ 9, తూర్పు గోదావరి 18, పశ్చిమ గోదావరి 18, ఏలూరు 13, కృష్ణా 10, ఎన్టీఆర్‌ 6, గుంటూరు 15, పల్నాడు 22, బాపట్ల 2, ప్రకాశం 8, ఎస్పీఎస్సార్‌ నెల్లూరు 1, తిరుపతి జిల్లాలో 3 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయి. 

తీవ్ర వడగాడ్పులకు అవకాశం 
గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోను, శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో, ఈనెల 20న అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులకు ఆస్కారం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. తీవ్ర వడగాడ్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలు, వడగాడ్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Advertisement

homepage_300x250