Sakshi News home page

కులశేఖరపట్నం నుంచి నేడు ఇస్రో తొలి ప్రయోగం

Published Wed, Feb 28 2024 5:55 AM

ISRO first launch from Kulasekharapatnam today - Sakshi

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో సిద్ధమవుతున్న మరో స్పేస్‌ పోర్టు

సూళ్లూరుపేట: ఇస్రో తమిళనాడులోని తూత్తుకుడి జి­ల్లా కులశేఖరపట్నంలో మరో స్పేస్‌ పోర్టును సిద్ధం చే­స్తోంది. అక్కడి పోర్టు నుంచి బుధవారం రోహిణి సౌండింగ్‌ రాకెట్‌–200ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భవిష్యత్‌లో భారీ ప్రయోగాలు చేయను­న్న ఇస్రో చిన్న ప్రయోగాలు, వాణిజ్యపరమైన ప్రయోగాలు, ఎస్‌ఎస్‌ఎల్‌వీలాంటి చిన్నతరహా రాకెట్లు, ప్రై­వేట్‌ సంస్థలకు చెందిన రాకెట్లను ప్రయోగించేందుకు కులశేఖరపట్నంలో రాకెట్‌ కేంద్రాన్ని సిద్ధం చేస్తోంది.

ఐదారేళ్ల క్రితమే తూర్పుతీర ప్రాంతంలో రెండో స్పేస్‌ పోర్టు నిర్మించాలనే ఉద్దేశంతో స్థలాన్వేషణ చేశారు. అదే సమయంలో కృష్ణా జిల్లా నాగాయలంకను పరి­శీలించారు. అక్కడి వాతావరణం అనుకూలంగా లేకపో­వడంతో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నం వద్ద భూములను పరిశీలించారు. వెంటనే స్థలసేకరణ జరిపారు.

స్పేస్‌ పోర్టు ఏర్పాటు చేసే­టపుడు ముందుగా సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగాలు చేసి అక్కడ గ్రావిటీ పవర్, సముద్రపు వాతావరణం, భూ­మి­కి అతితక్కువ దూరంలో వాతావరణంలో తేమలాంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. కులశేఖరపట్నం నుంచి రోహిణి సౌండింగ్‌–200 రాకెట్‌ ప్ర­యోగం చేపట్టేందుకు సూళ్లూరుపేటలోని శ్రీహరికోట సెంటర్‌ నుంచి 40 మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు తరలి వెళ్లారు. 

Advertisement

homepage_300x250