
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్టు
అరకులోయటౌన్: అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరకులోయ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు గ్రాముల బంగారం, రెండు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లు, రూ.1,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను పాడేరు డీఎస్పీ ఎస్‌కే షెహబాజ్ అహ్మద్ బుధవారం అరకు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో వెల్లడించారు. అరకులోయ పోలీస్ సర్కిల్ పరిధిలోని డుంబ్రిగుడ మండలం బోందుగుడలో సూర్యప్రకాశరావు ఇంట్లో ఈనెల 8వ తేదీ రాత్రి ఒడిశా, ఆంధ్రాకు చెందిన ఐదుగురు దొంగలు చొరబడి కర్రలతో కొట్టి, కత్తులతో బెదిరించి రెండు గ్రాముల బంగారు పుస్తెలు, రూ.30వేల నగదు, ఇతర వస్తువులు అపహరించినట్టు చెప్పారు. డుంబ్రిగుడ పోలీసులు అరకు సీఐ ఎల్.హిమగిరి నేతృత్వంలో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టి, చాకచక్యంగా ముఠాలో ఇద్దరు సభ్యులను పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ముఠా సభ్యులైన డుంబ్రిగుడ మండలం బొందుగు డ గ్రామానికి చెందిన పావుకారి సురేష్(24), ఒడిశా రాష్ట్రం శిమిలిగుడ మండలం, దోలింబ పంచాయతీ కుంటగుడ గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్ బోస్లా(24)లను అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరిని గురువారం కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు. ఒడిశాకు చెందిన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. ఈ కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన పాడేరు సెంట్రల్ క్రైమ్ టీం హెచ్‌సీలు నాగేశ్వరరావు, సత్యనారాయణ, బెహరాలకు నగదు రివార్డులను డీఎస్పీ అందజేశారు. కేసును ఛేదించిన అరకు సీఐ ఎల్.హిమగిరి, డుంబ్రిగుడ, అరకులోయ ఎస్‌ఐలను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ ఎల్. హిమగిరి, డుంబ్రిగుడ ఎస్‌ఐ కె.పాపినాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment