
నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్
చింతూరు: పోలవరం ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్న గ్రామాలకు చెందిన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. కాలనీల నిర్మాణాల్లో జరిగిన తప్పులను సరిచేసి కొత్తగా పెరిగిన రేట్లకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజనేతర నిర్వాసితులకు ఏలూరు జిల్లా తాడ్వాయి, పశ్చిమ గోదావరి జిల్లా యాదవోలు ప్రాంతాల్లో త్వరితగతిన కాలనీల నిర్మాణాలు చేపడతామని చెప్పారు. కాలనీల నిర్మాణ ప్రాంతాల్లో గ్యాస్ పైపులైన్లు ఉంటే కొంతమేర స్థలాన్ని వదిలేసి మిగతా స్థలంలో నిర్మాణాలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ముంపునకు గురవుతున్న ఇళ్లకు సంబంధించిన విలువలో తేడాలు వచ్చాయంటూ చాలామంది దరఖాస్తులు ఇచ్చారని, రీసర్వే నిర్వహించా లని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. చింతూ రు డివిజన్లో అటవీ అభ్యంతరాలతో నిలిచిపోయిన రహదారులు, వంతెనలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
సమస్యల పరిష్కారానికి వినతి
కలెక్టర్ దినేష్‌కుమార్ చింతూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా నాలుగు మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు భారీసంఖ్యలో తరలివచ్చి తమ గ్రామాలకు చెందిన ముంపు సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ పొలాలు, గ్రామాలు మునుగుతున్నా ముంపు జాబితాలో చేర్చలేదని పలు గ్రామాలకు చెందిన నిర్వాసితులు కలెక్టర్ ఎదుట వాపోయారు. ఆర్‌అండ్‌ఆర్ సర్వేలో భాగంగా ఇంటి విలువలు సక్రమంగా సర్వే చేయలేదని, రీసర్వే చేసి తమకు న్యాయం చేయాలని పలువురు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలవరం అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పనుల పురోగతి గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం అడ్మినిస్ట్రేటివ్ అధికారి అభిషేక్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, పోలవరం స్పెషలాఫీసర్ సరళావందనం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment