
పసర మందులు వాడొద్దు
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జమాల్ బాషా ● సరియాపల్లిలో ప్రత్యేక వైద్య శిబిరం ● 52మందికి వైద్య సేవలు ● నలుగురు చిన్నారులు ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలింపు
ముంచంగిపుట్టు: పసర మందులు వాడడం వల్ల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని, వాటికి దూరంగా ఉండాలని వైద్య సిబ్బంది ఇచ్చే మందులు మాత్రమే వాడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జమాల్ బాషా గిరిజనులకు సూచించారు. మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ సరియాపల్లిలో వాంతులు,విరోచనాలు,పుండ్లతో గిరిజనులు అస్వస్థతకు గురైనట్టు పత్రికల్లో వార్తలు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు.బుధవారం కిలగాడ వైద్యాధికారులు రమేష్,శిరీష,వైద్య సిబ్బంది సరియాపల్లిలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాంతులు,విరోచనాలు,జలుబు,దగ్గు,జ్వరాలు,చర్మ వ్యాధులతో బాధపడుతున్న 52 మందికి వైద్య సేవలు అందించారు.18 మంది జ్వర బాధితులకు రక్తపరీక్షలు చేయగా సాధారణ జ్వరాలుగా తేలింది. సరియాపల్లిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జమాల్ బాషా పర్యటించి, అనారోగ్యాలకు గల కారణాలపై గిరిజనులతో మాట్లాడి ఆరా తీశారు. కొంత మంది గతంలో ఇచ్చిన మందులు వాడలేదని వైద్య సిబ్బంది జమాల్ బాషా దృష్టికి తీసుకువచ్చారు.దీంతో గిరిజనులతో ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఇచ్చే మందులు తప్పనిసరిగా వాడాలని,అప్పుడే వ్యాధులు తగ్గుతాయని,నాటు మందులు,పసర మందులు వాడితే వికటించే ప్రమాదం ఉందని చెప్పారు. గ్రామస్తులు తాగుతున్న నీటి శాంపిల్స్‌ను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సేకరించారు. కోర్రా విక్రత్,కోర్రా వసంత్,కోర్రా హర్షింత్,గోల్లోరి వినయ్ అనే నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు.మరో రెండు రోజుల పాటు సరియాపల్లిలో వైద్య శిబిరం కొనసాగుతుందని కిలగాడ వైద్యాధికారి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి,మండల వైఎస్సార్‌సీపీ నేతలు మోహన్,జగన్నాథం,ఆరోగ్య విస్తరణ అధికారి సుబ్రహ్మణ్యం,కిలగాడ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పసర మందులు వాడొద్దు
Comments
Please login to add a commentAdd a comment