
నిర్వాసితులను కాలనీలకు తరలించాలి
కలెక్టర్ దినేష్ కుమార్
కూనవరం: పోలవరం నిర్వాసితులను ఆగస్టులోపు వారి కోసం నిర్మించిన కాలనీలకు తరలించాలని కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. భైరవపట్నంలో వీఆర్‌పురం మండలం జీడిగుప్ప గ్రామానికి చెందిన పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీలను బుధవారం ఆయన పరిశీలించారు. ఎన్ని కుటుంబాలకు ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టారు, ఎన్ని ఇళ్లు పూర్తి చేశారు తదితర వివరాలను ఆర్‌అండ్‌బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 159 ఇళ్లకు గాను 75 ఇళ్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. పూర్తయిన 75 ఇళ్లలోకి రావడానికి అభ్యంతరాలు ఏమిటని నిర్వాసితులను కలెక్టర్ ప్రశ్నించగా విద్యుత్ సౌకర్యం లేదని, తాగునీటి సమస్య ఉందని, బాత్‌రూమ్‌లు, అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల, రోడ్లు, డ్రైనేజీలు తదితర సౌకర్యాలు లేవని చెప్పారు. రెండు నెలల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో రామాంజనేయ ప్రసాద్‌లను కలెక్టర్ ఆదేశించారు. జీడిగుప్ప గ్రామానికి చెందిన 17 మంది రైతులకు ట్రైకార్ సంస్థ ద్వారా ఇసునూరులో సాగుభూమి ఇచ్చారు. ఆ భూమి పోలవరం ముంపులో పోతోంది. దానికి భూమికి బదులు భూమి ఇవ్వలేదని రైతులు ఆరోపించారు. ఈవిషయంపై కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి ఇచ్చిన భూమికి కూడా నష్ట పరిహారం వస్తుందని స్పష్టం చేశారు. ఈకార్యక్రంలో సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటేశ్వర రెడ్డి, ఐటీడీఏ ఈఈ మురళి, సెరీకల్చర్ అధికారులు, తహసీల్దార్లు శ్రీనివాసరావు, సరస్వతి, ఎంపీడీవో రామాంజనేయ ప్రసాద్, ఎఫ్‌ఆర్‌వో కరుణాకర్, ఎస్‌ఐ లతాశ్రీ తదితరులు పాల్గొన్నారు.
దసలి పట్టు రైతుల ఆదాయం పెంపుపై దృష్టి
కూనవరం: దసలి పట్టు రైతుల ఆదాయం పెంపుపై దృష్టి పెడతామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పైదిగూడెంలో దసలి పట్టు రైతుల సిల్క్‌దారం ఉత్పత్తి కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిల్క్‌దారం తయారీ ద్వారా ఎంత మేర ఆదాయం వస్తుందని సెరీకల్చర్ అధికారులను అడిగారు. ఏడాదికి మూడు పంటలకు అవకాశం ఉందని, తద్వారా పట్టు రైతులకు సుమారు రూ. 35 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం వస్తుందని సెరీకల్చర్ జిల్లా అధికారి కె.అప్పారావు కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలసుకున్నారు. ప్రకృతి అనుకూలిస్తే ఆదాయం బాగుంటుందని, ప్రతికూల పరిస్థితుల్లో పూట గడవడం కష్టంగా ఉంటోందని, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా ఆదాయ మార్గం చూపాలని రైతులు కోరారు. ఈకార్యక్రమంలో సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, సెరీకల్చర్ ఏడీ పాల్‌రాజ్, ఏఎస్‌వో వెంకట హరికృష్ణ, ఐటీడీఏ ఈఈ మురళి, తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో రామాంఅజనేయ ప్రసాద్, ఏఎస్‌డీఎస్ డైరెక్ట్ వి.గాంధీబాబు, ఎఫ్‌ఆర్‌ఓ కరుణాకర్, ఎస్‌ఐ లతశ్రీ పాల్గొన్నారు.
సమస్యలపై కలెక్టర్‌కు వినతి
వి.ఆర్.పురం: శ్రీరామగిరి పంచాయతీ పరిధిలోని పోలవరం నిర్వాసిత నాలుగు గ్రామల ప్రజల సమస్యలపై సర్పంచ్ పులి సంతోష్ కుమార్, ఉప సర్పంచ్ గుండెపూడి లక్ష్మణరావు తదితరులు చింతూరు పర్యటనకు వచ్చిన కలెక్టర్ దినేష్‌కుమార్‌ని బుధవారం కలిసి సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ 41.15 కాంటూరు పరిధిలో ముంపునకు గురైయ్యే నాలుగు గ్రామల ప్రజలకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, గిరిజనులు సాగుచేస్తున్న డీ–ఫారం పట్టా భూములకు నష్ట పరిహారం, స్థలాలు ఇవ్వాలని కోరారు. మేజర్లకు పునరావాసం కల్పించాలన్నారు.బీసీ కాలనీలో లాడర్ రీసర్వే చేయాలని స్థానికులు కోరారు. కాలనీ అన్ని కుటుంబాలు ముంపు బారిన పడ్డాయని, గతంలో చేపట్టిన సర్వేలో తప్పులున్నాయని, రీసర్వే చేసి, తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకులంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విష్టుమూర్తి, వెంకన్నబాబు, కృపారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

నిర్వాసితులను కాలనీలకు తరలించాలి
Comments
Please login to add a commentAdd a comment