
‘గురువుల’ప్రాధాన్యత ఎవరో!
● బరిలో మొత్తం 15మంది అభ్యర్థులు ● ఉపాధ్యాయ సమస్యలే ప్రచార అస్త్రాలు ● ఆసక్తికరంగా టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా సాగుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ స్థానానికి 15మంది బరిలో ఉన్నారు. 27,088మంది ఓటర్లు ఉన్నారు. ముగ్గురు రాజకీయ పార్టీల నుంచి పోటీలో ఉండగా, మరో 12మంది ఆయా సంఘాల మద్దతుతో బరిలోకి దిగారు. ఎగువ సభకు ఎన్నికల్లో మేధావి వర్గంగా చెప్పుకునే విద్యావంతులైన టీచర్ల ఆలోచన సరళి చాలా భిన్నంగా ఉంటుందంటారు. అభ్యర్థి, పార్టీ, సంఘం ఏదైనా తమ విచక్షణతోనే ఓటు వేస్తూ వైవిధ్యతను చూపిస్తుంటారు. గతంలో పలుమార్లు అంచనాలకు అందకుండా తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలో టీచర్లు వేసే మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల క్రమంలో ఎటువైపు మొగ్గు ఉన్నా ఫలితాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎవరి గెలుపు ఉంటుందనేది సర్వత్రా చర్చ సాగుతోంది.
సమస్యలే ప్రచారాస్త్రాలు
ఉపాధ్యాయులను ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సమస్యలు అనేకంగా ఉన్నాయి. ప్రతీసారి ఆయా సమస్యలే ఎన్నికల్లో ఎజెండాగా మారుతున్నాయి. తాజా ఎన్నికల్లోనూ అవే ప్రచారాస్త్రాలుగా మారాయి. ప్రధానంగా సీపీఎస్(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం), ఏకీకృత సర్వీస్ రూల్, 317జీవో, 2002 ఉపాధ్యాయుల సమస్యలు, డీఏల పెండింగ్, టీచర్ల పదోన్నతులు తదితరవన్నీ పేరుకుపోయాయి. ఎమ్మెల్సీగా గెలిచాక సమస్యలు మర్చిపోతున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నుంచి పరిశీలిస్తే ఈసారి బీజేపీ నుంచి వ్యాపారవేత్త మల్క కొమురయ్య పోటీలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ బాధ్యతను తమ భుజాలకెత్తుకున్నారు. బీజేపీ ప్రభుత్వం టీచర్లను ఇబ్బంది పెడుతున్న సీపీఎస్‌ను తీసుకొచ్చిందనే కారణంతో పార్టీ అభ్యర్థికి ఏ మేరకు ఓట్లు పడుతాయనేది తేలాల్సి ఉంది. ఆయన యజమానిగా ఉన్న మంచిర్యాలలోని శాలివాహన ప్లాంటు మూసివేత, కార్మికుల సమ్మె ప్రభావం ఉండనుంది.
టీఎస్‌సీపీఎస్‌ఈయూ నుంచి ఇన్నారెడ్డి
సీపీఎస్ రద్దు ఏకై క లక్ష్యంగా సాగుతున్న టీఎస్‌సీపీఎస్‌ఈ యూనియన్ బలపర్చిన అభ్యర్థిగా తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డి బరిలో ఉన్నారు. గతంలో పీఆర్‌టీయూ రాష్ట్ర స్థాయి నాయకుడిగా, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డికి ఉపాధ్యాయ సమస్యలపై పోరాటమే తన బలంగా చెబుతుంటారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీచర్ల స్థానానికి అధికారికంగా ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదు. తెరవెనక మాత్రం ఓ అభ్యర్థికి మద్దతు ఉందని ఉపాధ్యాయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇక తాజా మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మరోసారి పోటీలో నిలిచారు. పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, బీఎస్పీ నుంచి యాటకారి సాయన్న, దళిత బహుజన పార్టీ నుంచి గవ్వల లక్ష్మీతోపాటు అశోక్‌కుమార్, వై.కంటె సాయన్న, చలిక చంద్రశేఖర్, జగ్గు మల్లారెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డి, ముత్తరాం నర్సింహాస్వామి, విక్రమ్‌రెడ్డి, శ్రీకాంత్, సుహాసిని మొత్తం 15మంది ఉన్నారు.
ఇంటింటికి అభ్యర్థి ప్రచారం
ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో ప్రచారం చేసే అవకాశం లేకపోవడంతో నేరుగా టీచర్ల ఇంటికే వెళ్తున్నారు. మార్నింగ్ వాకింగ్, సంఘ కార్యాలయాలు, సెలవు దినాలు, నిర్ణీత వేళల్లోనే టీచర్లను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సోషల్‌మీడియా, ఫోన్ కాల్స్‌తోనూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment