Sakshi News home page

ఆ బాధ ఎప్పటికీ...

Published Sun, Nov 1 2015 4:11 AM

ఆ బాధ ఎప్పటికీ... - Sakshi

ఆఫ్ ద ఫీల్డ్
న్యూఢిల్లీ: ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడం అనేది తనని జీవితకాలం బాధిస్తూనే ఉంటుందని ఇటీవల రిటైరైన డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ చెప్పాడు. జట్టుకు తన సేవలు అవసరం లేదని ఒక్క మాట చెప్పి ఉంటే, ఢిల్లీలో చివరిసారి టెస్టు ఆడి వీడ్కోలు పలికేవాడినని... కానీ నాటి సెలక్టర్లు తనకు అలాంటి అవకాశం ఇవ్వలేదని మరోసారి బాధపడ్డాడు. ‘దేశం తరఫున 12 సంవత్సరాలు ఆడిన క్రికెటర్‌కు కనీసం వీడ్కోలు మ్యాచ్ ఆడే అర్హత ఉండదా’ అని వీరూ ప్రశ్నించాడు.

తన విషయంలోనే కాదని, దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఏ క్రికెటర్‌కైనా ఒక వీడ్కోలు మ్యాచ్ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఢిల్లీలో జరిగే చివరి టెస్టు సందర్భంగా సెహ్వాగ్‌ను బీసీసీఐ సన్మానిస్తుందనే వార్త వినిపిస్తోంది. ‘అలా జరిగితే మంచిదే. ఒకవేళ బీసీసీఐ పట్టించుకోకపోతే ఢిల్లీ క్రికెట్ సంఘమైనా ఆ పని చేస్తుందని భవిస్తున్నాను’ అని వీరూ అన్నాడు.

అలాగే జట్టును ఎంపిక చేసే సమయంలో సీనియర్, జూనియర్ అనే బేధం లేకుండా వరసగా ఐదు మ్యాచ్‌లలో విఫలమైన వారిని జట్టులోంచి తీసేయాలని అభిప్రాయపడ్డాడు. మిగిలిన జట్లతో పోలిస్తే పాకిస్తాన్‌పై తాను ఎక్కువ నిలకడగా ఆడేవాడినని, ఆ జట్టుతో మరో రెండు సిరీస్‌లు ఆడి ఉంటే తన కెరీర్ పరుగులు 10 వేలు (వీరూ చేసింది 8,586) దాటేవని అన్నాడు.

Advertisement

homepage_300x250