breaking news
-
వలంటీర్ చెప్పినవారికి ఓటేసేంత బలహీనంగా ఓటర్లు లేరు
సాక్షి, అమరావతి: వలంటీర్ల మాటలు విని.. వారు చెప్పినవారికి ఓటు వేసేంత బలహీనంగా ఓటర్లు లేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. వలంటీర్, లబ్దిదారు మధ్య ఉన్న అనుబంధం వలంటీర్ రాజీనామాతో తెగిపోతుందని స్పష్టం చేసింది. అలాంటప్పుడు వలంటీర్ చెప్పినట్టు ఓటరు ఎందుకు చేస్తారని ప్రశ్నిం చింది. వలంటీర్లు తమ జేబులో నుంచి తీసి డబ్బేమీ ఇవ్వడం లేదని, అలాంటప్పుడు వారి మాటలను ఓటరు ఎందుకు వింటారని పిటిషనర్‌ను నిలదీసింది. ఎవరైనా కూడా ఓటరును పోలింగ్ బూత్ వద్దకు వెళ్లేంత వరకే ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. పోలింగ్ బూత్‌లోకి వెళ్లాక ఓటరు తనకు నచ్చినవారికే ఓటు వేస్తారని తెలిపింది. రాజీనామా చేశాక ఎవరైన వలంటీర్ ఏదైనా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిం చింది. మొత్తం వలంటీర్లు ఎందరు? ఎంతమంది పనిచేస్తున్నారు? రాజీనామా చేసినవారెందరు? తదితర వివరాలను తమ ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. రాజీనామా చేశాక మేమేం చేయలేం.. కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది శివదర్శన్ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారన్నారు. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా, పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా వలంటీర్లను నియంత్రిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఒకవేళ వలంటీర్ రాజీనామా చేస్తే వారిపై ఎన్నికల సంఘానికి ఎలాంటి నియంత్రణ ఉండదన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. వారికి సైతం ప్రాథమిక హక్కులున్నాయని.. ఇష్టానుసారం రాజీనామా చేసే హక్కు వారికి సైతం ఉందన్నారు. వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పిటిషనర్ ఎలాంటి ఉదంతాలను పొందుపరచలేదని చెప్పారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ప్రత్యక్ష పరిచయాలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.. పిటిషనర్ రామచంద్ర యాదవ్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆ ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు వలంటీర్లు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులతో వలంటీర్లు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికల్లో లబ్దిదారులను అధికార పార్టీ వైపు తిప్పడానికి వారిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల వలంటీర్ల రాజీనామాల విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. మరి సెలబ్రిటీలు కూడా ప్రచారం చేస్తున్నారుగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసి, ఆయా పార్టీల అభ్యర్థుల అవకాశాలను ప్రభావితం చేయడం సాధ్యమా? అని ప్రశ్నిం చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకరు పెద్ద ధనవంతుడు, మరొకరు పేద వ్యక్తి అయి ఉంటే, ఆ పేద వ్యక్తి.. తాను ఎన్నికల్లో తలపడేందుకు సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరగలడా? అని నిలదీశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఊహల ఆధారంగా పిటిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. రాజీనామాలు చేశాక వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎక్కడా కూడా పిటిషన్లో పేర్కొనలేదన్నారు. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని, వరుసగా వారు మూడు రోజుల పాటు విధులకు హాజరు కాకుంటే వారిని విధుల నుంచి తొలగించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేసేందుకే వలంటీర్లను నియమించామని చెప్పారు. వారు కేవలం గౌరవ వేతనం మాత్రమే అందుకుంటున్నారని గుర్తు చేశారు. కొందరు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ రోజుల్లో ఐఏఎస్ అధికారులు కూడా తమ ఉద్యోగానికి రాజీనామా చేసి, నచ్చిన పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. కాబట్టి రాజీనామా చేశాక ఎవరినీ నియంత్రించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
Supreme Court of India: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలను వివరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల విధానంలో పవిత్రత ఉండాలని, ఎటువంటి అనుమానాలు, అపోహలకు ఆస్కారం ఉండొద్దని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థలో ఓటర్ల సంతృప్తి, విశ్వాసం అనేవి చాలా ముఖ్యమని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నమోదైన ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్పులతో క్రాస్–వెరిఫికేషన్ చేయాలని కోరుతూ అసోసియేసన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఏడీఆర్ తరపున సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై అనుమానాలు వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. అన్నింటికీ అనుమానించవద్దని సూచించింది. పిటిషన్లపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. -
ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాజకీయాలకు అతీతంగా.. అత్యంత పారదర్శకంగా.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రపతి, శాసనసభ ఎన్నికలకు గవర్నర్ గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలయిందని తెలిపారు. సచివాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీల నుంచి అత్యధికసంఖ్యలో ఫిర్యాదులు వస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామనడానికి.. షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు టీడీపీకి చెందిన 126 మందిపైన, వైఎస్సార్సీపీకి చెందిన 136 మందిపైన కేసులు నమోదు చేయడమే నిదర్శనమని చెప్పారు. 12,459 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తొలిసారిగా పోలింగ్ గది లోపల, వెలుపల క్యూలైన్ల వద్ద వెబ్‌కెమెరాలు బిగించినట్లు తెలిపారు. అభ్యర్థులు ఇంకా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను తమ దృష్టికి తీసుకొస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో 30,111 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌టెలికాస్టింగ్ ద్వారా నిరంతరం పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో అక్రమ మద్యం సరఫరాను అరికట్టడానికి దేశంలోనే తొలిసారిగా జియోట్యాగింగ్‌తో రోజూ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మద్యం సరఫరా కేంద్రాల వద్ద వినియోగిస్తున్న ముడిపదార్థాల నుంచి ఉత్పత్తి గోడౌన్లు, అక్కడినుంచి షాపులు, బార్లకు వెళ్లేవరకు వాహనాలను నిరంతరం ట్రాక్‌చేసే విధంగా జియోట్యాగింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జప్తు నుంచి సాధారణ ప్రజలకు ఊరట ఎన్నికల నిఘా సందర్భంగా జప్తుచేస్తున్న నగదు, వస్తువుల విషయంలో సాధారణ ప్రజలపై ఎఫ్ఆర్ఐలు నమోదు చేయడంపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రాజకీయపార్టీలు, చట్టవ్యతిరేక కార్యక్రమాలతో సంబంధంలేని నగదు, వస్తువులు జప్తుచేసినప్పుడు సరైన ఆధారాలు చూపిస్తే 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా వెనక్కి ఇస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గ్రీవెన్స్ సెల్ రోజూ రెండుసార్లు సమావేశమై ఇటువంటి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.121.91 కోట్ల విలువైన నగదు, వస్తువులను జప్తు చేశామన్నారు. దీన్లో రూ.31.75 కోట్ల నగదు ఉందని, సరైన ఆధారాలు చూపించిన రూ.18 కోట్లను వెనక్కి ఇచ్చేశామని చెప్పారు. వీఐపీల భద్రతపై ప్రత్యేక మార్గదర్శకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు కేంద్ర పోలీస్ అబ్జర్వర్ల పర్యవేక్షణలో కొనసాగుతోందని మీనా తెలిపారు. దర్యాప్తు వివరాలను రోజూ ఎన్నికల సంఘానికి అందజేస్తున్నారన్నారు. ఈ సంఘటన తర్వాత వీఐపీల ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ఎస్పీలకు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారులపై వచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని, ఈసీఐ ఆదేశాల మేరకు ఆ ఉద్యోగుల వివరణ తీసుకుని పంపామని చెప్పారు. రాజీనామా చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లపై ఎటువంటి ఆంక్షలు ఉండవన్నారు. వారిని ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోనీయకూడదంటూ రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేదని చెప్పారు. రాజీనామా చేసిన వలంటీర్లను ఏజెంట్లుగా అనుమతించకూడదంటూ ఇప్పటికే అందిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు తెలిపారు. ‘అరకు’లో పోలింగ్ సమయం కుదింపు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలకు మే 13వ తేదీ పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలుగు, ఇంగ్లిషుల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం కుదించారు. మిగతా అన్ని నియోజకవర్గాలకు మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అరకు లోక్‌సభ పరిధిలో కొండ ప్రాంతాలున్నందున పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ప్రాంతాలకు పోలింగ్ సామగ్రి, సిబ్బంది తరలింపునకు హెలికాప్టర్లను వినియోగించనున్నారు. చీకటిపడితే హెలికాప్టర్లో ఈవీఎంలను, సిబ్బందిని తిరిగి స్ట్రాంగ్‌రూమ్‌లకు చేర్చడం కష్టమవుతుందని పోలింగ్ సమయాన్ని కుదించారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న ఓటర్లందరికీ ఎంత సమయమైనా ఓటువేసే అవకాశం కల్పిస్తారు. మే 5 నుంచి 10 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఈసారి పోస్టల్ బ్యాలెట్లను పోస్టు ద్వారా కాకుండా ఫెసిలిటేషన్ సెంటర్లో వినియోగించుకోవాల్సి ఉంటుందని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నవారు గతంలో వలే పోస్టు ద్వారా పంపడం కాకుండా స్థానికంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేవలం సర్విసు ఓటర్లు మాత్రమే పోస్టల్ ద్వారా బ్యాలెట్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయిన తర్వాత మే 2వ తేదీ నుంచి మే 10 వరకు ఇంటివద్ద ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే విధంగా జిల్లా అధికారులు తేదీలను నిర్ణయిస్తారని చెప్పారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, అంగవైకల్యం 40% దాటినవారు ఇంటివద్దే ఓటుహక్కును మే 2 నుంచి మే 10వ తేదీలోగా, పోస్టల్ బ్యాలెట్‌ను మే 5 నుంచి మే 10వ తేదీ వరకు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఒక్కసారి ఇంటివద్ద ఓటుహక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే వారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. 10వ తేదీలోగా ఇంటింటి ఓటింగ్ ప్రక్రియను పూర్తిచేసే విధంగా ఎన్నికల సిబ్బంది రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ముందస్తు సమాచారం అందిస్తారని చెప్పారు. ఇద్దరు పోలింగ్ సిబ్బంది, వీడియోగ్రాఫర్, భద్రతా సిబ్బంది ఇంటి దగ్గరకు వచ్చి ఓటింగ్ ప్రక్రియను పూర్తిచేస్తారని తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 5.50 లక్షలమంది సిబ్బందిని వినియోగిస్తున్నామని, వీరందరికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు వంటి బయట వ్యక్తులకు కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
Lok Sabha elections 2024: 21 రాష్ట్రాల పరిధిలో పోలింగ్ @ 102 నేడే!
సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ అయిన లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోరుకు సర్వం సిద్ధమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటితోపాటే అరుణాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 60, సిక్కింలోని మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. స్థానిక పరిస్థితులను బట్టి పోలింగ్ వేళల్లో మార్పులుచేర్చే అవకాశముంది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానే‹Ùకుమార్ సుఖ్బీర్సింగ్ సంధూ పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈసీ రాజీవ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. తొలి దశలో బరిలో నిల్చిన నేతలు.. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ(నాగ్‌పూర్ నియోజకవర్గం), కిరెన్ రిజిజు(అరుణాచల్ వెస్ట్), సంజీవ్ భలియా(ముజఫర్‌నగర్), జితేంద్ర సింగ్(ఉధమ్‌పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్(బికనీర్), ఎల్.మురుగన్(నీలగిరి), శర్బానంద సోనోవాల్(దిబ్రూగఢ్), భూపేంద్ర యాదవ్(అల్వార్) శుక్రవారం నాటి పోరులో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అరుణాచల్ మాజీ సీఎం నబాం టుకీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్ దేవ్, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్, డీఎంకే నాయకురాలు కనిమొళి, బీజేపీ తమిళనాడు చీఫ్ కె.అన్నామలై, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ తనయుడు నకుల్‌నాథ్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ నేత జితిన్ ప్రసాద, నితిన్ ప్రామాణిక్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ పోటీచేస్తున్న స్థానాల్లోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. భారీగా ఏర్పాట్లు తొలి దఫా పోలింగ్ కోసం 18 లక్షల మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పోలింగ్, భద్రతా సిబ్బందిని తరలించేందుకు 41 హెలికాప్లర్లు, 84 ప్రత్యేక రైళ్లు, లక్ష వాహనాలు సమకూర్చారు. తప్పకుండా ఓటేయాలి: సీఈసీ రాజీవ్ ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోసందేశం విడుదలచేశారు. ‘‘ భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేవి అత్యంత రమణీయమైన భావన. ఇందులో ఓటింగ్‌కు మించింది లేదు. భారతీయ ఓటర్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ఎండ వేడిమినీ అధిగమిస్తుంది. ఎన్నికలు మీవి. ఎవరిని ఎన్నుకోవాలనేది మీ ఇష్టం. మీ ప్రభుత్వాన్ని మీరే నిర్ణయించుకోండి. మీ కుటుంబం, పిల్లలు, పల్లె, గ్రామం.. అంతెందుకు దేశం కోసం మీరు వేస్తున్న ఓటు ఇది’ అని రాజీవ్ వ్యాఖ్యానించారు. 85 ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాడు ఈ 102 సీట్లలో 45 చోట్ల యూపీఏ గెలుపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 45 చోట్ల యూపీఏ కూటమి విజయం సాధించింది. 41 స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఈ 41లో బీజేపీ గెలిచినవే 39 ఉన్నాయి. సమస్యాత్మక బస్తర్‌లోనూ.. మావోల దాడులు, పోలీసు బలగాల ఎదురుకాల్పుల మోతలతో దద్దరిల్లే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. బస్తర్‌లోని కాంకేర్ జిల్లాలో ఈనెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది నక్సల్స్ మరణించిన నేపథ్యంలో ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బస్తర్‌లో 61 పోలింగ్‌బూత్‌లు సున్నితమైన ప్రాంతాల్లో, 196 బూత్‌లను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. బస్తర్ నుంచి కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నేత కవాసి లఖ్మా బరిలో నిలిచారు. ఈయనకు పోటీగా మహేశ్ కశ్యప్‌ను బీజేపీ నిలిపింది. భద్రతా కారణాల రీత్యా కొన్ని బూత్‌లలో పోలింగ్‌ను మధ్యా హ్నం మూడు గంటలవరకే అనుమతిస్తారు. 191 ‘సంఘ్వారీ’ బూత్‌లను మహిళా సిబ్బంది నిర్వహిస్తారు. 42 ‘ఆదర్శ్’, 8 ‘దివ్యాంగ్జన్’, 36 యువ బూత్‌లనూ ఏర్పాటుచేశారు. -
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ చెప్పారు. రాష్ట్రంలో సైతం కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో నామినేషన్ వేయొచ్చు ఆన్లైన్లో సైతం నామినేషన్ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్ పత్రాల ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ ఫారంతోపాటు అఫిడవిట్‌లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్ అప్లికేబుల్’అని రా యాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్‌రాజ్ వెల్లడించారు. 23లోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు. మహిళా ఓటర్లే అధికం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్‌రాజ్ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019