Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

వివేకా హత్యపై దుష్ప్రచారం ఆపండి 

Published Fri, Apr 19 2024 5:56 AM

Stop the smear campaign on Vivekas murder - Sakshi

షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, లోకేశ్‌లకు కడప కోర్టు ఆదేశం 

వీరు పరువు నష్టం కలిగించేలా మాట్లాడారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి 

పెండింగ్‌ కేసులపై మాట్లాడొద్దు 

ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను మాధ్యమాల నుంచి తొలగించండి 

రాజకీయ మైలేజీ కోసమే సీఎం జగన్, అవినాశ్‌లపై దుష్ప్రచారం 

పార్టీలు, మీడియా తీర్పులు ఇచ్చేస్తున్నాయి.. ఇది న్యాయ పాలనలో జోక్యం చేసుకోవడమే

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిలపైన దుష్ప్రచారం చేయొద్దని కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవి తదితరులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్‌ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు తేల్చిచెప్పింది.

కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దని సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడే మాట్లాడాలని కుండబద్దలు కొట్టింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని హెచ్చరించింది. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్, షర్మిల, సునీత తదితరులు తాము చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియా మాధ్యమాల నుంచి తొలగించాలని ఆదేశించింది. వీరు సీఎం వైఎస్‌ జగన్, వైఎస్‌ అవినాశ్‌రెడ్డిలపై దుష్ప్రచారం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది.

రాజకీయంగా మైలేజీ కోసమే దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలు, మీడియా పబ్లిక్‌ కోర్టుగా అవతరించి న్యాయపాలనలో జోక్యం చేసుకుంటున్నాయని కడప జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు కడప ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి జి.శ్రీదేవి రెండు రోజుల క్రితం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఆరోపణలు, వక్రీకరణలు ఆపండి..
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ధ్రువీకరణ కాని ఆరోపణలతో, వక్రీకరణలతో వ్యక్తిగత దాడులు, విమర్శలు చేయడం మానాలని కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలను, వారి పార్టీల క్యాడర్‌ను కడప జిల్లా కోర్టు ఆదేశించింది. వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉందని కోర్టు గుర్తు చేసింది.

ఈ నేపథ్యంలో వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ఆరోపిస్తూ మీడియా, సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని ఆయా పార్టీల అధినేతలను, అనుచరులకు కోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్‌రెడ్డిని వైఎస్‌ జగన్‌ రక్షిస్తున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆపాలని తేల్చిచెప్పింది.

వ్యక్తిగత విమర్శలు మాని తమ పార్టీల ఎజెండాలపైన, ఇతర పార్టీల వైఫల్యాలపైన దృష్టి సారించాలని వారికి కోర్టు హితవు పలికింది. వివేకా హత్య కేసులో జగన్‌ నిందితుడు కాదన్న విషయాన్ని గుర్తెరగాలంది. రాజకీయ మైలేజీ కోసమే జగన్, అవినాశ్‌లపై.. షర్మిల, చంద్రబాబు, లోకేశ్‌ తదితరులు వ్యాఖ్యలు చేశారంది. ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా పరువు నష్టం కలిగించేవేనని తేల్చిచెప్పింది. 

అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి..
వాదనలు విన్న జిల్లా జడ్జి శ్రీదేవి పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించారు. వాక్‌ స్వాతంత్య్రం సహేతుక పరిమితులకు లోబడి ఉంటుందన్న సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఓ వ్యక్తి ప్రతిష్టను, మంచితనాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీ­యడం ఆ స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ‘వైఎస్‌ వివేకా హత్య కేసు ప్రస్తుతం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉంది.

ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా షర్మిల, చంద్రబాబు, లోకేశ్‌ ప్రజల ముందు వైఎస్సార్‌సీపీ, దాని అధినేత వైఎస్‌ జగన్, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తదితరులపై తప్పుడు, పరువు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారనేందుకు, అసభ్యంగా పరిహాసం చేస్తున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. వారి మాటలను, వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాలు పదే పదే ప్రచురించాయి, ప్రసారం చేశాయి. ముఖ్యంగా అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా పేర్కొన్నారు. ఆయనను సీఎం జగన్‌ రక్షిస్తున్నారని పేర్కొన్నాయి.’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇతరులు సొంత తీర్పులివ్వరాదు..
‘పౌర హక్కుల దురాక్రమణను నిరోధించడానికి, నిందితుల హక్కులను కాపాడేందుకు, మీడియా ప్రవ­ర్తనకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయవ్యవస్థ స్వ­తం­త్రంగా వ్యవహరించే విషయంలో సరైన నిబంధనలు లేవు. ఓ వ్యక్తి అరెస్ట్‌ సమయంలో అతడిని దోషిగా నిర్ధారించే ట్రెండే ప్రస్తుతం కొనసాగుతోంది. రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు, మీడియా ఉన్నది ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకే తప్ప, తమ ఇష్టాఇష్టాలకు అనుగుణంగా తీర్పులు ఇచ్చేందుకు ఎంతమాత్రం కాదు.

ప్రస్తుత కేసులో ఈ కోర్టు ముందుంచిన డాక్యుమెంట్లు, వీడియోలు, పత్రికా కథనాలను విశ్లేషిస్తే.. బహిరంగంగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆయనను వైఎస్‌ జగన్‌ రక్షిస్తున్నట్లు కూడా ప్రచారం చేస్తు­న్నారు. ఓ కేసు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న­ప్పుడు.. ఎవరూ కూడా తమ సొంత తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు. ఆ అధికారం ఎవరికీ లేదు. అలాంటి కేసులో ఉన్న వ్యక్తిని తమ ఇష్టానుసారం హంతకుడిగా, దోషిగా ప్రకటించడానికి వీల్లేదు.

నిష్పాక్షిక ట్రయల్‌ నిర్వహించి నిందితుడిని దోషిగా నిర్ధారించేంత వరకు ఆ వ్యక్తి అమాయకుడే అన్నది న్యాయ సూత్రం. ఓ వ్యక్తి నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పైన మాత్రమే ఉంది. పెండింగ్‌లో ఉన్న కేసు గురించి మూడో వ్యక్తి ఎవరూ కూడా తమ తప్పుడు ప్రయోజనాల కోసం బహిరంగంగా మాట్లాడటం, వ్యాఖ్యలు చేయడం, తీర్పులిచ్చేయ­డానికి ఎంతమాత్రం వీల్లేదు’ అని జడ్జి శ్రీదేవి తేల్చిచెప్పారు.

తప్పుడు ప్రచారంపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం..
చంద్రబాబు ప్రోద్భలంతో వైఎస్‌ వివేకా హత్యపై షర్మిల, పురందేశ్వరి, పవన్‌ కళ్యాణ్, నారా లోకేశ్, సునీత తదితరుల దుష్ప్రచారంపై విసిగిపోయిన వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటా­నికి దిగింది. తమ పార్టీతో పాటు సీఎం వైఎస్‌ జగన్, ఎంపీ అవినాశ్‌­రెడ్డి, తదితరులపై పత్రి­కలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి తప్పు­డు ప్రచారం, అనుచిత వ్యాఖ్య­లు చేయకుండా షర్మిల, చంద్రబాబు, సునీత­లను నిరోధించాలంటూ కడప జిల్లా కోర్టులో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌ బాబు పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి జి.శ్రీదేవి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున ఎం.నాగిరెడ్డి, కె.ఎస్‌.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు, షర్మిల, సునీత తదితరులు చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన డాక్యుమెంట్లను, తప్పుడు ఆరోప­ణల వీడియోలను న్యాయవాదులు కోర్టు ముందుంచారు.

కోర్టు ప్రొసీడింగ్స్‌లో మీడియా, రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయి 
‘రాజకీయ పార్టీలు మీడియా ద్వారా పబ్లిక్‌ కోర్టుగా అవతరించాయి. అటు మీడియా, ఇటు రాజకీయ పార్టీలు సొంతంగా దర్యాప్తు చేసేస్తున్నాయి. తద్వారా కోర్టు ప్రొసీడింగ్స్‌లో జోక్యం చేసుకుంటున్నాయి. నిందితుడు, దోషికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విస్మరించాయి. దోషిగా నిర్ధారణ అయ్యే­వరకు నిరపరాధే అనే సూత్రాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కోర్టులు కేసును విచారణకు స్వీకరించడానికి ముందే నిందితులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలుస్తున్నాయి.

ఇది ప్రజలపై, జడ్జీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తత్ఫలితంగా అమాయకుడైన నిందితుడిని నేరస్తుడిగా చూడాల్సి వస్తోంది. నిందితుల హక్కులు, స్వేచ్ఛను పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదు. ట్రయల్‌కు ముందు ఓ అనుమానితుడు, నిందితుడు విషయంలో మీడియా సాగించే పరిమితికి మించిన ప్రతికూల ప్రచారం ట్రయల్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తద్వారా అతడే నేరం చేశాడని భావించాల్సి వస్తోంది. ఇలా చేయడం న్యాయ పాలనలో జోక్యం చేసుకోవడమే అవుతుంది’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

దుష్ప్రచారాన్ని ఆపండి..
ఎన్నికల ప్రచారంలో షర్మిల తదితరులు వైఎస్‌ వివేకా హత్య కేసులో వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని సీఎం జగన్‌ కాపాడుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అవినాశ్‌రెడ్డిని ఏకంగా హంతకుడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ప్రకటనలు, వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించారు.

చంద్రబాబు కూడా ప్రొద్దుటూరు సభలో వివేకాను హత్య చేసిన వ్యక్తిని ఎంపీగా నిలబెట్టారంటూ దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇక లోకేశ్‌ అయితే నేరుగా ముఖ్యమంత్రి జగనే తన బాబాయి వివేకాను హత్య చేశారని ఆరోపించారన్నారు. పురందేశ్వరి, పవన్‌ కళ్యాణ్‌ తదితరులు కూడా ఇలాగే దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. వివేకా హత్య కేసు సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జగన్, అవినాశ్, వైఎస్సార్‌సీపీపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయా పార్టీల అధినేతలను, క్యాడర్‌ను నిరోధించాలన్నారు. 

రాజకీయ మైలేజీ కోసమే సీఎం జగన్, అవినాశ్‌పై వ్యాఖ్యలు..
‘ప్రస్తుత కేసులో షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేశ్, పురందేశ్వరి, పవన్‌ కళ్యాణ్, బీటెక్‌ రవి వారి రాజకీయ మైలేజీ కోసం వైఎస్సార్‌సీపీపై, వైఎస్‌ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో జగన్‌ ఎన్నడూ కూడా నిందితుడు కాదు. కాబట్టి వివేకాను జగన్‌ చంపారంటూ ప్రజలందరి ముందు లోకేశ్‌ చేసిన ప్రకటన పరువు నష్టం కలిగించేదే. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటూ.. ఈ కోర్టు ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ ఉత్తర్వుల వల్ల షర్మిల, చంద్రబాబు, లోకేశ్‌ తదితరులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుంటే వైఎస్సార్‌సీపీ, జగన్, అవినాశ్‌ రెడ్డిలకు తీరని నష్టం కలుగుతుంది. ఇదే సమ­యంలో షర్మిల, చంద్రబాబు, లోకేశ్‌ తదితరులు పదే పదే పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తారు. ఎన్నికల వేళ ఇది వైఎస్సార్‌సీపీ, ఎన్నికల్లో పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థులకు తీరని నష్టం కలిగిస్తుంది. అందుకే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించా’ అని జిల్లా జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250